బస్తీ దవాఖానలు ఓకే..మరి డాక్టర్లు ఎక్కడా?

by Anukaran |
బస్తీ దవాఖానలు ఓకే..మరి డాక్టర్లు ఎక్కడా?
X

దిశ, మల్కాజిగిరి : మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసింది. కానీ వాటిల్లో చాలా చోట్ల వైద్యులు లేరు. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం పూర్తిస్థాయిలో డాక్టర్లను నియమించలేదు. కొన్నిచోట్ల ఉన్న డాక్టర్లు కూడా ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్తున్నారు. దీంతో ఆ దవాఖానలకు నర్సులే పెద్ద దిక్కు అవుతున్నారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు అందుబాటులో లేక జనం ఇబ్బందులకు గురవుతున్నారు.

జీహెచ్ఎంసీ పరిధిలోని మురికివాడల్లో నివసిస్తున్న బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆరోగ్య సేవలు అందించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బస్తీ దవాఖానల్లో డాక్టర్లు లేక, ఉన్నా సక్రమంగా విధులకు హాజరుకాకపోవడంతో పేదలకు వైద్య సేవలు సక్రమంగా అందడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అల్వాల్ సర్కిల్, మచ్చబొల్లారం డివిజన్, తుర్కపల్లి మోడల్ మార్కెట్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన డాక్టర్ రాజీనామా చేసింది. అలాగే, మచ్చబొల్లారం డివిజన్ అరుంధతీనగర్ కాలనీలోని బస్తీ దవాఖాన డాక్టర్ సక్రమంగా విధులకు హాజరు కావడం పోవడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఇక డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో ఈ రెండు బస్తీ దవాఖానల్లోనూ నర్సులు మాత్రమే సేవలందిస్తున్నారు. దీంతో ప్రభుత్వం లక్ష్యం నెరవేరడం లేదు.

అల్వాల్‎లో మూడు…

అల్వాల్ సర్కిల్ పరిధిలో మే 22న మూడు బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశారు. ఇందులో ఒకటి మచ్చబొల్లారం డివిజన్ అరుందతీనగర్ కాలనీలో, రెండోది ఇదే డివిజన్ లోని తుర్కపల్లి మోడల్ మార్కెట్ లో, మూడోది వెంకటాపురం డివిజన్ లోని సుభాశ్ నగర్ లో ఏర్పాటు చేశారు. ఇందులో ప్రతి ఆస్పత్రికి ఒక డాక్టర్, ఒక నర్సు, ఒక సపోర్టింగ్ స్టాప్ ఉద్యోగిని ఏర్పాటు చేశారు. ఈ దవాఖానలను స్థానిక ఎమ్మెల్యే హన్మంతరావు ప్రారంభించారు.

డాక్టర్ రాజీనామా..

ఈ దవాఖానలు ఏర్పాటు చేసిన రెండు మూడు నెలల్లోనే అరుందతీనగర్ బస్తీ దవాఖాన డాక్టర్ అనారోగ్య కారణాలతో విధులకు రాజీనామా చేసింది. అప్పటి నుంచి స్ఠాప్ నర్సు మాత్రమే ఇక్కడ సేవలు అందిస్తోంది. ఇక్కడ డాక్టర్ రాజీనామా చేసి మూడు నెలలు గడిచినా ఇప్పటి వరకు ఇక్కడ డాక్టర్‌ను నియమించలేదు. ఈ విషయాన్ని జిల్లా వైద్యశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోవడం లేదని స్పష్టమౌతోంది. దీనిపై వివరణ కోసం ఫోన్ చేసినా అధికారులు స్పందించకపోవడం గమనార్హం.

దవాఖానలు ఉన్నయ్..

దిశ, కూకట్‎పల్లి : కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని కూకట్‌పల్లి, బాలానగర్ మండలాల్లో మొత్తం 16చోట్ల బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. కానీ పూర్తి స్థాయిలో వైద్యులను నియమించకపోవడంతో పేదలకు వైద్యం అందని ద్రాక్షలా మారింది. బాలానగర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలో కేపీహెచ్‌బీ కాలనీ ఫేజ్-4, మూసాపేట్ కైత్లాపూర్, అల్లాపూర్ రాజీవ్ గాంధీనగర్, ఫతేనగర్ జింకల వాడ, ఫతేనగర్ ఇందిరాగాంధీపురం, బాలానగర్ దిల్ షుఖ్ నగర్, కూకట్ పల్లి భాగమీర్, హైదర్‌నగర్ మహిళా మండలి భవనం, మూసాపేట్ పాండురంగా నగర్ కాలనీ, కేపీహెచ్‌బీ 3వ ఫేజ్, కూకట్‌పల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలో బాలాజీనగర్ కమ్యునిటీ హాల్, కూకట్‌పల్లి కుమ్మరి బస్తీ, జగద్గిరిగుట్ట ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలో పాపిరెడ్డినగర్ మోడల్ మార్కెట్ బిల్డింగ్, వెంకటేశ్వరనగర్, ఎల్లమ్మబండ,

హస్మత్‌పేట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలో

బోయిన్‌పల్లి ఆంజనేయ నగర్‌లల్లో మొత్తం 16 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశారు. ఇందులో హైదర్‌నగర్, పాండు రంగానగర్, కేపీహెచ్‌బీ 3వ ఫేజ్, పాపిరెడ్డి నగర్, ఆంజనేయనగర్, బోయిన్‌పల్లి బస్తీ దవాఖానల్లో ఇప్పటి వరకు వైద్యులు అందుబాటులో లేరు. దీంతో వైద్యం కోసం వస్తున్న ప్రజలకు స్టాప్ నర్సులు వైద్యం అందిస్తున్నారు. ప్రతి బస్తీలో బస్తీ దవాఖాన అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే నాయకులు జర డాక్టర్లను అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.

అప్లికేషన్లు తీసుకుంటున్నాం: డాక్టర్ ఆనంద్, డిప్యూటీ జిల్లా వైద్యాధికారి

రెండు మండలాల్లో ఐదు బస్తీ దవాఖానల్లో డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చాం. అప్లికేషన్లు వస్తున్నాయి. త్వరలో ఉద్యోగ ఖాళీల భర్తీ పూర్తి అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed