ఓటుకు 2వేలు.. ఖర్చులకు 3వేలు

by srinivas |
ఓటుకు 2వేలు.. ఖర్చులకు 3వేలు
X

దిశ, పటాన్‌చెరు: ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి పటాన్ చెరు పారిశ్రామిక వాడల్లోనూ కనిపిస్తున్నది. పారిశ్రామికవాడలోని పటాన్‌చెరు, రామచంద్రాపురం, పాశమైలారం, ఐడీఏ బొల్లారం, ఇస్నాపూర్ పారిశ్రామిక ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన వారు నివసిస్తుంటారు. పరిశ్రమలలో కార్మికులు, తాపీ మేస్త్రీలు, కూలీలు, చిన్న గుత్తేదారులుగా ఉపాధి పొందుతుంటారు. వీరిలో ఎక్కువ శాతం రెండు రాష్ట్రాలలో ఓటు హక్కు ఉన్నది. ఒక పక్క వారు నివాసముండే పటాన్ చెరు పారిశ్రామికవాడలో ఓటరుగా నమోదు చేసుకున్నారు. మరోవైపు ఏపీలో స్థానికత, ప్రభుత్వ పథకాలను పొందడం కోసం అక్కడి ఓటరు జాబితాలో కూడా వారి పేర్లు నమోదు చేసుకున్నారు. ఏపీలో అధికార, విపక్షాల మధ్య పోటాపోటీ రాజకీయ నడుస్తుండటంతో పంచాయతీ ఎన్నికలు రెండు పార్టీల నాయకులకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్క ఓటు వదులుకోరాదనే ఉద్దేశంతో అభ్యర్థులు దూరప్రాంతాల్లో ఉన్నవారిని రప్పించే ప్రయత్నాలు జోరుగా కొనసాగిస్తున్నారు.

పారిశ్రామికవాడలోని పటాన్‌చెరు, రామచంద్రాపురం, పాశమైలారం, ఇస్నాపూర్, బొల్లారం, కాజిపల్లి, గడ్డపోతారం, వావిలాల, అన్నారం, బొంతపల్లి, దోమడుగు ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు 75 వేల వరకు ఉన్నట్లు అంచనా. ఏపీలో ఈ నెల 9, 13, 17, 21 తేదీలలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ బరిలో ఉన్న అభ్యర్థులు తమ గ్రామానికి చెందినవారు పారిశ్రామిక వాడల్లో ఏఏ ప్రాంతాల్లో ఉన్నారనే సమాచారాన్ని సేకరించి ఓటు వేయడానికి రావాలని సంప్రదింపులు జరుపుతున్నారు. పోలింగ్ సమయానికి వారిని స్వస్థలాలకు తరలించేందుకు పోటీలో ఉన్న అభ్యర్థులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందు కోసం వారి వ్యక్తులను ఇక్కడి పారిశ్రామికవాడలకు పంపుతున్నారు. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఓటరు జాబితా ఆధారంగా వివరాలు సేకరించి, ఇక్కడ వారు ప్రస్తుతం నివసిస్తున్న అడ్రస్ లను బంధువుల నుంచి సేకరించి వారి తరలింపునకు రంగంలోకి దిగారు. పటాన్ చెరు, బొల్లారం ప్రాంతాల్లో వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందినవారు ఉండగా, బీరంగూడ, కిష్టారెడ్డిపేట, అశోక్ నగర్, పాశమైలారం, ఇస్నాపూర్ ప్రాంతాల్లో ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని అనంతపూర్, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు చెందిన వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.

బస్సులు, రైళ్లలో తరలించేందుకు ఏర్పాట్లు

ఏపీలో ఓట్లు ఉన్నవారిని స్వస్థలాలకు తరలించేందుకు ఆయా పార్టీల నాయకులు పోటాపోటీగా ఆఫర్లు ఇస్తున్నారు. ఓటుకు రూ.2వేల నగదు, దారి ఖర్చులకు మరో 3 వేలు ఇచ్చేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నారని తెలిసింది. నాలుగు ఓట్లు ఉన్న కుటుంబానికి రూ.15 వేల నుంచి రూ. 20 వేల వరకు ఇచ్చేందుకు సంసిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతున్నది. లగ్జరీ బస్సులు, రైలు టికెట్లను కూడ ముందస్తుగానే అందజేస్తున్నట్లు సమాచారం. అత్యధికంగా బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో 25 వేల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. పోలింగుకు ఒకటి, రెండు రోజులకు ముందుగానే ఓటర్లను అక్కడికి తరలించేలా ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవలే సంక్రాంతి పండుగ కోసం కార్మికులు సొంతూళ్లకు వెళ్లగా, మరోసారి గ్రామాలకు తరలి వెళుతుండటంతో పరిశ్రమల యజమానులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Next Story