మెస్సీ హోటల్ గదిలో దొంగతనం

by Shyam |
Lionel Messi
X

దిశ, స్పోర్ట్స్: ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు, ప్రస్తుతం పారిస్ సెయింట్-జర్మేన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న లియోనల్ మెస్సీని దోపిడీ దొంగలు దోచుకున్నారు. ఈ సీజన్‌లో పారిస్ సెయింట్-జెర్మేన్‌ తరపున ఆడుతున్న మెస్సీ.. పారీస్‌లోని ఒక ప్రముఖ స్టార్ హోటల్‌లో 4 గదులున్న సూట్ రూమ్‌లో భార్య, 3 పిల్లలతో కలసి ఉంటున్నాడు. మాంచెస్టర్ సిటీతో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ కోసం కుటుంబంతో కలసి వెళ్లిన సమయంలో దొంగలు మెస్సీ రూమ్‌లోకి ప్రవేశించారు. రూఫ్ పై నుంచి గదుల్లోకి ప్రవేశించి రూ. 40 లక్షల విలువైన నగలు, రూ. 11 లక్షల విలువైన నగదు దోచుకొని వెళ్లారు. మ్యాచ్ అనంతరం తిరిగి వచ్చిన మెస్సీ గదిలో దొంగలు పడ్డారని తెలుసుకొని హోటల్ సిబ్బందితోపాటు పారీస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెస్సీ బస చేస్తుండటంతో హోటల్ వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అయినా సరే దొంగలు చాకచక్యంగా హోటల్ గదుల్లోకి ప్రవేశించి దోచుకున్నారు. ఇది తప్పకుండా నిష్ణాతులైన దొంగల పనే అని పోలీసులు తెలిపారు. కాగా, మెస్సీ ఇటీవల పారీస్‌లో ఒక ఇంటిని లీజ్‌కు తీసుకున్నారు. అయితే ఇంటిలో కొన్ని పనులు జరుగుతుండటంతో తాత్కాలికంగా స్టార్ హోటల్‌లో బస చేస్తున్నారు.

Advertisement

Next Story