'సప్లై వివరాలు అందించాం.. టీకా ప్లాన్ వేసుకోండి'

by vinod kumar |   ( Updated:2021-05-19 06:09:56.0  )
సప్లై వివరాలు అందించాం.. టీకా ప్లాన్ వేసుకోండి
X

న్యూఢిల్లీ: ఈ నెల 1వ తేదీ నుంచి 18ఏళ్లు పైబడిన టీకా వేసే ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా డోసుల కొరతతో వ్యాక్సినేషన్ సజావుగా సాగడం లేదు. ఇప్పటికీ పలు రాష్ట్రాలు టీకాలు లేవని కేంద్రానికి తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జూన్ 15 వరకు టీకా లభ్యత, డోసుల సప్లై వివరాలను రాష్ట్రాలకు ముందస్తుగా అందించి అందుకు అనుగుణంగా టీకా పంపిణీ ప్రణాళికలను వేసుకోవాలని ఆదేశించింది. వచ్చే నెల 15 వరకు(మే 1 నుంచి జూన్ 15 వరకు) రాష్ట్రాలకు ఉచితంగా 5.86 కోట్ల డోసులు అందిస్తుందని, వచ్చే నెలాఖరు వరకు కంపెనీల దగ్గర 4.87 కోట్ల డోసులు అందుబాటులో ఉంటాయని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది. తదనుగుణంగా జిల్లాల వారీగా, టీకా పంపిణీ కేంద్రాల వారీగా వ్యాక్సినేషన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాలని తెలిపింది. డోసుల పంపిణీ వివరాలను టీకా కేంద్రాలు ముందస్తుగానే కొవిన్‌లో ప్రచురించాలని రద్దీ తక్కువగా ఉండేలా చూసుకోవాలని వివరించింది.

టీకా పంపిణీ ప్రణాళికలో భాగంగా టీకా ఉత్పత్తిదారుల నుంచి 50శాతం కేంద్రానికి, మిగతా 50శాతం రాష్ట్రాలు, ప్రైవేటు హాస్పిటళ్లకు వెళ్తాయన్న సంగతి తెలిసిందే. అయితే, కేంద్ర ప్రభుత్వం తన వాటా నుంచి రాష్ట్రాలకు ఉచితంగా టీకాలను అందిస్తుంది. టీకా డోసుల సప్లై వివరాలతోపాటు మరికొన్ని సూచనలనూ రాష్ట్రాలకు చేసింది. రాష్ట్రాలు, ప్రైవేటు హాస్పిటళ్లు కొనుగోలు చేయడానికి ఆయా ఉత్పత్తిదారుల దగ్గర వచ్చే నెలాఖరు వరకు అందుబాటులో ఉండే వివరాలను తెలియజేసింది. ఈ వివరాలను ఆయా కంపెనీలు కేంద్రానికి సమర్పించినట్టు ఓ ప్రకటనలో పేర్కొంది.

– జిల్లావారీగా, టీకా పంపిణీ కేంద్రాల వారీగా వ్యా్క్సినేషన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాలి.
– ఆ ప్లాన్ గురించి విస్తృత అవగాహన కలిగించడానికి అవసరమైన వేదికలను వినియోగించుకోవాలి.
– రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు టీకా పంపిణీ కేంద్రాలూ వారి టీకా పంపిణీ క్యాలెండర్‌ను ముందస్తుగా కొవిన్‌లో ప్రచురించాలి.
– ఈ క్యాలెండర్‌లో కేవలం ఒక్క రోజుకే పరిమితం కావొద్దు. ఎక్కువ రోజులతో క్యాలెండర్‌ ప్రచురించాలి
– టీకా పంపిణీ కేంద్రాల దగ్గర రద్దీ లేకుండా చూసుకోవాలి.
– కొవిన్‌లో టీకా కోసం అపాయింట్‌మెంటు సరళంగా ఉండేలా నిర్ణయాలుండాలి.

స్పుత్నిక్‌పై సస్పెన్స్?

వచ్చే నెల 15వ తేదీ వరకు రాష్ట్రాలకు అందించే టీకాల వివరాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తెలియజేసింది. కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకా డోసుల వివరాలనే రాష్ట్రాలకు అందజేసింది. కానీ, స్పుత్నిక్ వీ టీకా డోసుల వివరాలు వెల్లడించకపోవడం గమనార్హం. మనదేశంలో టీకా పంపిణీకి కొవిషీల్డ్, కొవాగ్జిన్‌తోపాటు రష్యా టీకా స్పుత్నిక్ వీ కూడా డీసీజీఐ నుంచి అనుమతి పొందిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఆ స్టాక్ మనదేశానికి రావడమే కాదు, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఉద్యోగులకు పంపిణీ కూడా ప్రారంభమైంది.

Advertisement

Next Story

Most Viewed