చక్రస్నానంతో ముగిసినతిరుమల బ్రహ్మోత్సవాలు

by srinivas |
చక్రస్నానంతో ముగిసినతిరుమల బ్రహ్మోత్సవాలు
X

దిశ, ఏపీ బ్యూరో: న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు శ‌ని‌వారం రాత్రి తిరుమలలో శ్రీవారు శ్రీ‌దేవి, భూదేవి స‌మేతంగా బంగారు తిరుచ్చిపై దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్లను విమాన ప్రాకారం చుట్టూ ఊరేగింపు నిర్వహించారు. ఈ ఉత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి.

శాస్త్రోక్తంగా తిరుమ‌లేశుని శ్రీ చ‌క్ర తిరుమంజ‌నం

శ్రీవారి చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. తొమ్మిది రోజుల పాటు జ‌రిగిన న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఆల‌యంలోని అయిన మ‌హ‌ల్ ఎదురుగా నూత‌నంగా ఏర్పాటు చేసిన చిన్న పుష్కరిణిలో అర్చకులు సుదర్శన చక్రాన్ని ముంచి, ప‌విత్ర స్నానం చేయించారు. స్నపన తిరుమంజ‌నం సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రములు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే వేదాలను టిటిడి వేదపారాయణదారులు పారాయణం చేశారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. తొమ్మిదిరోజుల ఉత్సవాలలో జరిగిన అన్ని సేవలూ సఫలమై లోకం క్షేమంగా ఉండడానికీ, భక్తులు సుఖశాంతుల‌తో ఉండడానికీ చక్రస్నానం నిర్వహించారు. ఉత్సవాలు ఒక యజ్ఞమే కనుక యజ్ఞాంతంలో అవభృథస్నానం చేస్తారు. యజ్ఞనిర్వహణంలో జరిగిన చిన్నచిన్న లోపాలవల్ల ఏర్పడే దుష్పరిణామాలు తొలగి, ఉత్సవాలు చేసినవారికి, చేయించినవారికి, ఇందుకు సహకరించినవారికీ, దర్శించిన వారికీ, అందరికీ ఈ ఉత్సవ యజ్ఞఫలం లభిస్తుంది.

ధన్యవాదాలు : ఈవో జవహర్రెడ్డి

ఈ సంద‌ర్భంగా ఈవో జ‌వ‌హ‌ర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీ‌వారి అనుగ్రహంతో న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలను విజ‌య‌వంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ఉదయం శ్రీ‌వారి ఆల‌యంలోని అయిన మ‌హ‌ల్లో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు తెలిపారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలను నిర్విఘ్నంగా నిర్వహించిన జీయ్యంగార్లు, అర్చకులు, అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, డిప్యూటీ స్పీకర్కోన రఘుపతి, అదనపు ఈవో ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు ప్రశాంతిరెడ్డి, నిశ్చిత, కుపేందర్రెడ్డి, ప్రసాద్, గోవిందహరి, అనంత, సీవీఎస్వో గోపీనాథ్జెట్టి పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed