తాలిబన్లు చంపినా సరే.. అక్కడినుంచి కదిలేది లేదంటున్న పూజారి

by Anukaran |   ( Updated:2021-08-17 23:37:01.0  )
తాలిబన్లు చంపినా సరే.. అక్కడినుంచి కదిలేది లేదంటున్న పూజారి
X

దిశ, వెబ్‌డెస్క్: పుట్టి పెరిగిన ఊరు.. స్నేహితులు, బంధువులు.. తానూ తిరిగిన చోటు ఇవన్నీ వదిలి కొన్నిరోజులు వెళ్లాలంటేనే బాధగా ఉంటుంది. అలాంటిది శాశ్వతంగా వదిలిపోవాలంటే ప్రాణమే పోతున్నట్టు ఉంటుంది. ఎక్కడ బతికితే ఏంటి.. బతికి ఉండడం ముఖ్యం కదా.. అనేది కొందరి వాదన. కానీ, బతికినా, చచ్చినా నా సొంతగడ్డ మీదే అని అంటున్నాడు ఒక పూజారి. గత మూడు రోజులుగా ఆప్ఘానిస్తాన్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికి తెలిసిందే. తాలిబన్లు ఆ ప్రదేశాన్ని ఆక్రమించుకోవడం ప్రజలు ప్రాణ భయంతో పరుగు లంకించుకొంటున్న తరుణంలో ఒక పురోహితుడు ప్రదర్శిస్తున్న తెగువ.. పుట్టిన గడ్డపై తనకున్న మమకారాన్ని చూపించి ఔరా అనిపిస్తున్నాడు.

పండిత్ రాజేశ్ కుమార్ అనే వ్యక్తి కాబుల్ లోని రతన్ నాథ్ మందిరంలో పూజారిగా సేవలందిస్తున్నారు. వందల ఏళ్ల నుంచి తమ పూర్వీకులు ఆ స్వామి వారిని నమ్ముకునే జీవిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాలిబన్లు ఆ ప్రదేశాన్ని ఆక్రమించుకోవడంతో ఆలయాన్ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి. అక్కడే ఉంటే ప్రాణహాని తప్పదు. కానీ, ఆ పురోహితుడు మాత్రం వణకలేదు. వందల ఏళ్ల నుంచి తమ పూర్వీకులు ఈ ఆలయానికే సేవలు అందిస్తున్నారని.. అలాంటిది తాను గుడిని వదిలి ఎలా వస్తానంటూ ప్రశ్నించాడు.

తాలిబన్లు ఇక్కడే ఉంటే చంపేస్తారు అంటే.. ఆనందంగా చనిపోతానని.. దైవసేవలో భాగంగా జరిగిందని భావిస్తానని చెబుతున్నారు. తాలిబన్లు వచ్చి చంపినా.. ఈ గుడిని వదిలిపెట్టనని, చావైనా.. బతుకైనా.. ఇక్కడే అని తెగేసి చెప్పాడు. ఆలయానికి వచ్చిన వారందరు తమతోపాటు రావాల్సిందిగా కోరినా.. ఆయన మాత్రం రానని చెప్పడంతో వారు నిరాశగా వెనుతిరిగారు. ప్రస్తుతం ఈ పురోహితుడు నెట్టింట వైరల్ గా మారాడు. ప్రతికూల పరిస్థితుల్లో ఆయన చూపిస్తున్న విధేయత, దైవభక్తిపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed