షాకింగ్: 25 వేల మంది టీనేజర్ల ఆత్మహత్యలు.. కారణాలు ఇవే

by Anukaran |   ( Updated:2021-08-01 08:35:38.0  )
షాకింగ్:  25 వేల మంది టీనేజర్ల ఆత్మహత్యలు.. కారణాలు ఇవే
X

న్యూఢిల్లీ: దేశంలో టీనేజర్ల ఆత్మహత్యల గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2017 నుంచి 19 మధ్య 24వేల మందికి పైగా టీనేజర్లు ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థం అవుతోంది. ప్రధానంగా చిన్న చిన్న కారణాలకే కలత చెంది ఆత్మహత్యలకు పాల్పడుతుండటం అందరినీ కలవరపెడుతోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) తయారు చేసిన డేటాను ఇటీవల పార్లమెంట్‌ ముందుకు కేంద్రం తీసుకువచ్చింది. ఆ డేటా ప్రకారం.. 2017-19 మధ్య 14 నుంచి 18 ఏండ్ల వయస్సు ఉన్న 24,568 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారిలో 13,325 మంది బాలికలు ఉండటం గమనార్హం.

2017లో చూస్తే ఈ మరణాల సంఖ్య 8029 ఉండగా 2018లో 8162గా ఉంది. 2019లో ఈ మరణాలు 8377 కి పెరగటం ఆందోళన కలిగిస్తోంది. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయామన్న కారణంగా కలత చెంది 2017-19 మధ్య 4046, వివాహ సంబంధ కారణాల వల్ల 639 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమ వ్యవహరాల కారణంతో 3315 మంది, అనారోగ్య కారణాల వల్ల 2567 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇంకా ఆల్కహాల్, డ్రగ్స్ కు బానిసై కొందరు, అవాంఛిత గర్భాలు, పేదరికం వంటి ఇతర కారణాల వల్ల మరికొందరు ఆత్మహత్యలు చేసుకున్నట్టు తేలింది.

కాగా టీనేజర్ల మరణాల సంఖ్యలో మధ్యప్రదేశ్ అత్యధికంగా 3,115 మరణాలతో మొదటి స్థానంలో ఉంది. పశ్చిమబెంగాల్ 2802, మహారాష్ట్ర 2,527, తమిళనాడు 2,035లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

Advertisement

Next Story

Most Viewed