- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తహసీల్దార్ల సంతకాలు కలెక్టర్ల చేతిలో.. ఆందోళనలో ఎమ్మార్వోలు
దిశ, తెలంగాణ బ్యూరో: వివాదాస్పద భూములపై నెలకొన్న సమస్యలను సత్వరం పరిష్కరించి రైతుబంధు, రైతుబీమా పథకాలకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. 15వ తేదీ నుంచి ఈ ఏడాది రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో వేయనున్నారు. ఈ నేపథ్యంలో పెండింగ్ సమస్యలన్నింటినీ బుధవారం నాటికి పరిష్కరించాలంటూ కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ ఆదేశించారు. దాంతో ప్రతి జిల్లాలో వేలాదిగా పేరుకుపోయిన దరఖాస్తులను మూడు రోజుల్లోనే పూర్తి చేయాలన్న ఆదేశాలతో కలెక్టర్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాళ్లు కూడా మండల స్థాయిలో జీరో పెండింగ్ చూపించాలంటూ తహసీల్దార్లపై ఒత్తిడి చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్న తాపత్రయంతో తహసీల్దార్ల సంతకాలను(డిజిటల్) కలెక్టర్లే పెడుతున్నారు. ధరణి పోర్టల్ ద్వారా తహసీల్దార్ లాగిన్ చేస్తేనే ఆయన డిజిటల్ సంతకం సాధ్యం కావాలి. కానీ పెండింగ్ ఫైళ్ల క్లియరెన్సులో అన్ని స్థాయిల్లోని పనులను కలెక్టర్లే చేస్తున్నారని తెలిసింది.
అయితే కలెక్టర్లే అన్నీ క్లియర్ చేస్తున్నప్పుడు తమ సంతకాలు ఎందుకు రావాలని తహసీల్దార్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన ఐదు రోజులుగా కలెక్టర్ల చేతిలో తహసీల్దార్ల సంతకాలు ఉన్నాయంటూ రెవెన్యూ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పెండింగ్ దరఖాస్తులు క్లియరెన్స్ చేయడంలో తహసీల్దార్లు అలసత్వం వహిస్తారని, అవినీతి, అక్రమాలకు పాల్పడుతారన్న నెపంతోనే వాళ్ల సంతకాలను కూడా కలెక్టర్ల పరిధిలోకి తీసుకురావడం ఆసక్తికరంగా మారింది.
తహసీల్దార్ల మీదే ఆధారం
కలెక్టర్లు ధరణి పోర్టల్ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకు తహసీల్దార్ల మీదనే ఆధారపడుతున్నారు. వాళ్లనే ప్రతి దరఖాస్తుకు సంబంధించిన చెక్ మెమో/రిమండేషన్స్ అడుగుతున్నారు. ఆ కాపీల ఆధారంగానే దరఖాస్తులను ఓకే చేయడం, లేదంటే తిరస్కరించడమో జరుగుతోంది. గతంలోనైతే ప్రతి ఫైలుకు వీఆర్వో, గిర్దావర్, నాయబ్ తహసీల్దార్, తహసీల్దార్.. వరుసగా చెక్ మెమోలు ఉండేవి. వారందరి అభిప్రాయాలతో పరిష్కారం జరిగేది. ఇప్పుడేమో ఒక్క తహసీల్దార్రెవెన్యూ రికార్డుల ఆధారంగా ఇచ్చే రిపోర్టుతోనే పని పూర్తి చేస్తున్నారు. అయితే ఈ ఐదు రోజుల్లో ఒక్కో కలెక్టర్ ప్రతి రోజూ వందల సంఖ్యలో దరఖాస్తులను పరిష్కరించి రికార్డులను బ్రేక్ చేశారు. ఏండ్ల తరబడిగా పెండింగులో పెట్టిన వారే నిరంతరాయంగా పని చేస్తూ క్లియరెన్సులు ఇస్తున్నారు. ప్రధానంగా ఆధార్ నమోదు, అక్షర దోషాలు, డిజిటల్ సంతకాలు, విస్తీర్ణాల్లో తేడాలు, సర్వే నంబర్లు మిస్సింగ్ వంటి ఫైళ్లు క్లియర్ చేసినట్లు సమాచారం. పెండింగ్ దరఖాస్తుల సంఖ్యను జీరో చేయాలని అధికార యంత్రాంగం రాత్రిపూట కూడా పని చేస్తోంది. మిగతా రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(పీఓబీ) సవరణకు సంబంధించిన దరఖాస్తులను పెద్దగా పట్టించుకోలేదని తెలిసింది. అలాగే దరఖాస్తులు ఏ స్టేజ్లో ఉన్నాయో కూడా తహసీల్దార్లకు ఆప్షన్లు లేకుండా పోయినట్లు సమాచారం. ఎవరైనా దరఖాస్తుదారుడు వచ్చి ప్రశ్నిస్తే సమాధానం రావడం లేదు. ఆఖరికి కలెక్టర్ అప్రూవ్చేశారా? తిరస్కరించారా? అయితే ఏ కారణాలు? ఇలాంటి అంశాలేవీ తెలియడం లేదన్న చర్చ నడుస్తోంది.
విచారణ చేయకుంటే సమస్యలే
దరఖాస్తులను రికార్డుల ఆధారంగానే పరిష్కరించడం ద్వారా సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని కొందరు తహసీల్దార్లు వాపోతున్నారు. ప్రధానంగా విరాసత్/పౌతి వంటి దరఖాస్తుల్లో వారిచ్చే అండర్ టేకింగ్ ధ్రువీకరణతోనే పరిష్కరించడం మంచిది కాదంటున్నారు. పట్టాదారుడికి ఎంత మంది సంతానం అన్న విషయాన్ని విచారణ చేయకుండా ప్రక్రియ పూర్తి చేయడం వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో పట్టాదారుడు చనిపోతే మనవడు తానే కొడుకునంటూ దరఖాస్తు చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఒకవేళ కలెక్టర్ అతడి దరఖాస్తును ఆమోదిస్తే నిజమైన వారసులు కోర్టుకు వెళ్లడం మినహా సరిదిద్దే అవకాశం ధరణి పోర్టల్లో లేదని ఓ రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి వాటిపైనా కలెక్టర్ తమ డిజిటల్ సంతకాలను పెట్టడం ద్వారా రానున్న రోజుల్లో ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందోనని రెవెన్యూ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ధరణి పోర్టల్ ప్రతి మాడ్యూల్ ద్వారా వచ్చే దరఖాస్తుల పరిష్కారానికి మార్గదర్శకాలు జారీ చేయాలని సూచిస్తున్నారు.