బాధితులకు న్యాయం చేస్తాం.. జాతీయ ఎస్సీ కమిషన్ హామీ

by Shyam |
National SC Commission
X

దిశ, ఎల్బీనగర్: వనస్థలిపురం సాహేబ్‌నగర్ పద్మావతి కాలనీలో డ్రైనేజీ శుభ్రం చేస్తూ మృతిచెందిన అంతయ్య, శివ కుటుంబాలకు న్యాయం చేస్తామని జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్ అరుణ్ హల్దార్ తెలిపారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మంగళవారం జాతీయ ఎస్సీ కమిషన్ మాజీ సభ్యులు రాములు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్‌తో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఆరా తీశారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాత్రి సమయాల్లో స్కావెంజర్ పనులు చేయకూడదని నిబంధనలు ఉన్నా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి బలవంతంగా కార్మికులతో ఇలాంటి పనులు చేయించాడని తమ దృష్టికి వచ్చిందన్నారు. కాంట్రాక్టర్‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ఇందుకు బాధ్యులైన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు.

అంతేగాకుండా.. ఒక్కో కుటుంబానికి ఎస్సీ కమిషన్ తరఫున రూ. 8 లక్షల 15 వేల నష్టపరిహారం అందజేస్తామన్నారు. అలాగే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఎస్సీ కమిషన్ ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో రాచకొండ అడిషనల్ సీపీ సుధీర్ బాబు, జీహెచ్ఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed