మాంసం తినాలంటే ఆలోచనలో పడుతున్నారు!

by Shyam |
మాంసం తినాలంటే ఆలోచనలో పడుతున్నారు!
X

దిశ, మెదక్: లాక్ డౌన్ సమయం మొదట్లో కిలో రూ.50 వరకు ధర ఉన్న చికెన్ ప్రసుత్తం అమాంతం పెరిగింది. మటన్ రేటు సైతం రూ.700 పైగానే పలుకుతోన్నది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు మాంసం తినాలంటే ఆలోచనలో పడ్డారు. ఇక ఆదివారం వచ్చిందంటే మాంసం కొనేందుకు ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు. కరోనా వైరస్ వచ్చిన తొలి రెండు వారాల్లో ప్రజలు చికెన్ తినాలంటేనే జంకేవారు. దీంతో కోడి ధర ఒక్కసారిగా పడిపోవడంతో అటు పౌల్ట్రీ రైతులు చాలా మేరకు నష్టపోయారు. చికెన్ తింటే కరోనా రాదని ప్రభుత్వం ప్రకటించడంతో మెల్లమెల్లగా చికెన్ ను ప్రజలు తింటుండటంతో కోడి ధరలకు రెక్కలొచ్చాయి. మొదటి వారంలో ధరలు లేకపోవడంతో కొందరు ఉచితంగా కోళ్లను పంపిణీ చేయగా, మరికొందరు రూ. 70 కే కోడిని అందించారు. పది రోజుల క్రితం వరకు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రూ. 200 లోపు ఉన్న చికెన్ ధర నేడు అమాంతంగా రూ. 310 కు చేరింది. మటన్ కొన్ని ప్రాంతాల్లో రూ. 700 పైగానే ధర పలుకుతోన్నది.

నియంత్రణ చర్యలేవి?

లాక్ డౌన్ నేపథ్యంలో మాంసం ధరలకు రెక్కలొచ్చాయి. కరోనా ప్రారంభ దశలో చికెన్ తింటే వైరస్ బారినపడే ప్రమాదం ఉందన్న ప్రచారంతో చికెన్ ధరలు అమాంతం పడిపోయాయి. కేజీ రూ.50 నుంచి రూ.90 మేర విక్రయాలు సాగాయి. చికెన్ తినడం వల్ల కరోనా వ్యాప్తి చెందదని సర్కారు ప్రకటనతో ప్రజలు చికెన్ తినడంపై మొగ్గుచూపారు. దీంతో క్రమేపీ చికెన్ ధరలు పుంజుకున్నాయి. పది రోజుల క్రితం వరకు రూ . 240 ధర పలికిన కేజీ చికెన్ ఇప్పుడు రూ .310 కు చేరింది. కరోనా దెబ్బకు భయపడి అధిక శాతం మంది కోళ్లఫారాల బిజినెస్ క్లోజ్ చేశారు. దీంతో మార్కెట్లో చికెన్ కు కొరత ఏర్పడింది. అదే సమయంలో డిమాండ్ పెరగడంతో కోళ్ల ఫారాల యజమానుల పంట పండింది. చికెన్ ధరలు పెరగడంతో మటన్, చేపల విక్రయాల ధరల్ని అమాంతం పెంచేశారు. లాక్ డౌన్ కు ముందు కేజీ మటన్‌ రూ .700 లోపు ఉంటే ఇప్పుడు రూ .900 పలుకుతోన్నది. కేజీ చేపల ధర రూ .500 నుంచి రూ .700 కు ఎగబాకింది. దీంతో నాన్ వెజ్ ప్రియుల జేబుకు చిల్లుపడుతోన్నది.

గుట్టుగా హోం డెలివరీ

కరోనా వైరస్ కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హోటళ్లు బంద్ చేయాలని ఆదేశించింది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా హోటళ్లను వ్యాపారస్తులు మూసివేశారు. కాగా 10 రోజుల నుంచి కొంతమంది హోటల్ యజమానులు చికెన్ బిర్యానీ, తందూరి ఐటమ్స్ లను గుట్టుగా హోం డెలివరీ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.

Advertisement

Next Story