పసిబిడ్డల ప్రాణం తీసిన జిల్లాల పునర్విభజన ..

by Sumithra |
పసిబిడ్డల ప్రాణం తీసిన జిల్లాల పునర్విభజన ..
X

దిశ, హుస్నాబాద్: మెజార్టీ ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా పాలకులు తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం ఇద్దరు పసిబిడ్డల పాలిట శాపంగా మారింది. పురిటినొప్పులు రావడంతో డెలివరి కోసం ఆస్పత్రికి వెళ్లిన ఆ గర్భిణీకి కరోనా సాకుతో ఇది తమ పరిధి కాదంటూ మూడు ఆస్పత్రులు తిప్పారు. పాలకులు, వైద్యుల నిర్లక్ష్యానికి నిండు గర్బిణీ తన ఇద్దరు కవల పిల్లల్ని కోల్పోయింది. గతంలోనూ ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయి. వీటిపై కనీసం ఎమ్మెల్యే, మంత్రి ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం.

ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణలు…

ప్రస్తుత బెజ్జంకి మండలంలో గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిదిలోకి వచ్చేది. జిల్లాల పునర్విభజన అనంతరం బెజ్జంకి మండలాన్ని సిద్దిపేట జిల్లాలో కలిపారు. ఇదే వారి పాలిట శాపంగా మారింది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు బేగంపేట గ్రామానికి చెందిన బెజ్జంకి కమల ( 30 ) పురిటి నొప్పులతో ఈ నెల 18 న డెలివరీ కోసం మొదట కరీంనగర్ జిల్లా ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయనే సాకుతో ఇది తమ జిల్లా పరిధిలోకి రాదు. మీది సిద్దిపేట జిల్లా పరిధిలోకి వస్తుంది. అక్కడే వైద్యం చేయించుకొండని అక్కడి ఆస్పత్రి వైద్యులు తెలపగా.. సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి వచ్చారు. ఇక్కడి వైద్యులు జిల్లా ఆస్పత్రిలో కేవలం కరోనా రోగులను మాత్రమే చూస్తున్నాం. ఇక్కడి కాన్పులను గజ్వేల్ ఆస్పత్రిలో చేస్తుర్రు. మీరు త్వరగా అక్కడికి వెళ్లండని చెప్పడంతో హుటాహుటిన గజ్వేల్ ఆస్పత్రికి వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లిన వారిని గజ్వేల్ ఆస్పత్రి వారు సైతం అడ్మిట్ చేసుకోలేదు. హైద్రాబాద్ నీలోఫర్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు అయోమయానికి గురయ్యారు.

కవల పిల్లలు మృతి..

గజ్వేల్ ఆస్పత్రి వారు హైద్రాబాద్ నీలోఫర్ ఆస్పత్రికి రిఫర్ చేయగా… అది దూరభారమవుతుందని భావించిన కమల కుటుంబ సభ్యులు తిరిగి కరీంనగర్ జిల్లా ఆస్పత్రికి వచ్చి అక్కడి వైద్యుల కాళ్లు పట్టుకోగా ఆపరేషన్ కు ఒప్పుకున్నారు. ఈ నెల 20న మధ్యాహ్నం 2.30 గంటలకు ఆపరేషన్ చేయగా ఆ మహిళ కవల పిల్లలు (ఆడ, మగ)కు జన్మనిచ్చింది. కవల పిల్లల్లో కూతురు పురిటిలోనే మృతి చెందింది. కుమారుడి పరిస్థితి కూడా విషమించడంతో మెరుగైన వైద్యం కోసం చైల్డ్ కేర్ స్పెషల్ వార్డుకు తరలించారు. శిశువు ఆరోగ్యం కుదుట పడకపోవడంతో శనివారం ఉదయం మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తాము ఇద్దరు పిల్లలను కోల్పోయమంటూ రోదించిన తీరు అక్కడున్న వారిని కలిచివేసింది.

జిల్లాల పునర్విభజనే కారణమంటూ గ్రామస్తుల ఆరోపణ..

జిల్లాల పునర్విభజన సమయంలో బెజ్జంకి మండలాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఉంచాలని చెప్పిన వినకుండా సిద్దిపేట జిల్లాలో కలిపారు. ఆర్ధిక మంత్రిగా కొనసాగుతున్న తన్నీరు హరీశ్ రావుది సైతం బెజ్జంకి మండలమే. అయినా స్వంత మండలంపై పట్టింపులేదు. స్థానిక ఎమ్మెల్యే సైతం ఇలాంటి విషయాల్లో స్పందించడు. గతంలోనూ జిల్లాల మధ్యనెలకొన్న సంఘటనలో శ్రీనివాస్ అనే వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటనలో పోలీసు బలగాలు మోహరించి హడావిడిగా దహన సంస్కారాలు నిర్వహించారు. ఆనాడు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కనీసం శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించలేదు. మరికొన్ని సంఘటనలు ఇలాగే పునరావృతమయ్యాయి.

ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా బెజ్జంకి మండలాన్ని సిద్దిపేట జిల్లాలో కలిపి… ఇంకా ఎంత మంది అమాయకుల ప్రాణాలు బలిగొంటారు.. మీ రాజకీయ భవిష్యత్ కోసం ఇంకా ఎంత మంది త్యాగం చేయాలంటూ వడ్లూరు బెంగపేట గ్రామస్తులు, బెజ్జంకి మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మెజార్టీ ప్రజలు వద్దన్న బెజ్జంకి మండలాన్ని సిద్దిపేట జిల్లాలో కలిపేందుకు కృషి చేసిన ఎంపీ, ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఎం సమాధానం చెబుతారో చూడాలి. ఇప్పటికైనా జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed