పతంగుల పండుగ వచ్చేసింది

by Shyam |
పతంగుల పండుగ వచ్చేసింది
X

తెలుగింటి సంప్రదాయ పండుగ సంక్రాంతి. ఈ పండుగ వస్తుందంటే చాలు పిల్లలకు పతంగులు, రైతులకు పంటలు, యువతులకు గొబ్బెమ్మలు, యువకులకు కోడి పందేలు గుర్తుకు వస్తాయి. పండుగకు 15 రోజుల ముందు నుంచే తెలుగు లోగిళ్లు కళకళలాడుతుంటాయి. సంక్రాంతి పండుగలో కైట్స్​ది ముఖ్యపాత్ర. రెండు మూడు నెలల ముందుగానే మార్కెట్ ను రంగురంగు కైట్స్​ముంచెత్తుతాయి. రూ.10నుంచి రూ.300 వరకు వివిధ రకాల ఆకృతుల్లో కైట్స్​లభిస్తాయి. ఈ యేడు కరోనా నేపథ్యంలో చిన్నారులు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదనే చెప్పారు. వైరస్​ భయంతో తల్లిదండ్రులు తమ పిల్లలను స్వేచ్ఛగా వదిలేయకపోవడంతో కైట్​ ఫెస్టివల్ ​కళ తప్పింది.

దిశ, శేరిలింగంపల్లి: సంక్రాంతి పండుగ వచ్చిందంటే రంగురంగుల కాగితాలతో గాలిపటాలు దర్శనమిస్తాయి. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ కైట్స్ ​ఎగుర వేస్తుంటారు. పోటీ పడుతూ పెంచీలు వేస్తూ ఉత్సాహంగా ఆడిపాడుతారు. కరోనాతో స్కూళ్లు లేకున్నా ఈ సారి పతంగుల జాడ మాత్రం పెద్దగా కనిపించడం లేదు. పిల్లలను బయటకు పంపేందుకు తల్లిదండ్రులు ఆసక్తి కనబర్చడం లేదు. వీధుల్లో పిల్లల హడావుడి కూడా అంతగా కానరావడం లేదు.

మార్కెట్‌లో వెరైటీ పతంగులు

ఈ మధ్యకాలంలో విభిన్న ఆకారాల్లో, వినూత్న రంగుల్లో గాలిపటాలు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. సాధారణ గాలిపటాలతో పాటు భిన్నమైన గాలిపటాలు మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. గతంలో పేపర్‌ను కత్తిరించి గాలి పటాలను చేసుకుని ఎగురవేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం మార్కెట్‌లో రంగురంగుల్లో వివిధ ఆకృతుల్లో గాలిపటాలు లభిస్తున్నాయి. రూ.10 నుంచి రూ.300 వరకు ఖరీదు చేసే గాలి పటాలు ఉన్నాయి. వాటిలో ఈగల్, రాకెట్‌ వంటి ఆకృతులతో పాటు హీరో, హీరోయిన్ల ఫొటోలు, స్పైడర్ మెన్, మోడీ ఫొటోలతో చాలా డిజైన్ల పతంగులు ఇప్పుడు పిల్లలను ఆకట్టుకుంటున్నాయి. గతంతో పోలిస్తే వీటి ధరలు పెరిగినా పిల్లల ఉత్సాహం కోసమైనా పెద్దలు వీటిని కొనుగోలు చేస్తున్నారు. గాలి పటాల కొనుగోలు షాపుల ముందు చిన్నారులే ఎక్కువగా దర్శనమిస్తున్నారు.

గాలిపటాల పోటీ..

హైదరాబాద్ నగరంలో పర్యాటక శాఖ ప్రతీ ఏటా గాలిపటాల పోటీలు నిర్వహిస్తుంది. ఇందులో పిల్లలే కాదు పెద్దలు సైతం గాలిపటాలు ఎగురవేసి సంబురపడతారు. అలాగే పలు దేశాలకు చెందిన వారు కూడా ఈ పోటీల్లో పాల్గొంటారు. అంతర్జాతీయ పతంగుల పండుగకు భాగ్యనగరం వేదికగా నిలుస్తుంది.

Advertisement

Next Story

Most Viewed