- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తూటాల్లా మాటలు.. హీటెక్కిన ‘ఎమ్మెల్సీ’ ప్రచారం..!
దిశ, తెలంగాణ బ్యూరో: రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఉమ్మడి ఆరు జిల్లాల్లో వేడి పెంచింది. అన్ని పార్టీలూ ఈ ఎన్నికలపైనే దృష్టి పెట్టాయి. అధికార, విపక్ష పార్టీల నేతలు తూటాల్లాంటి మాటలు వదులుతున్నారు. సవాళ్లు-ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. మంత్రులంతా రాజకీయ మీటింగులకే పరిమితమవుతున్నారు. ఇప్పటికే ఉన్న జిల్లా మంత్రులకు తోడు ప్రతి జిల్లాకు అదనంగా మరో మంత్రికి అధిష్ఠానం బాధ్యతలు అప్పగించింది. బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. మంత్రి ప్రకాష్ జవదేకర్ శనివారం నగరంలో పర్యటించారు. ఇంకా స్మృతి ఇరానీ, రవిశంకర్ ప్రసాద్, మాజీ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ తదితరులంతా రానున్నారు. కాంగ్రెస్ తరఫున రేవంత్‌రెడ్డి చేవెళ్ళ నియోజకవర్గంలో పర్యటించారు. కాగా, ఈ ఫలితాలు నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికపై ప్రభావం చూపుతుందని భావిస్తున్న పార్టీలు గెలుపుకోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఓటర్లంతా పట్టభద్రులే కావడంతో ఉద్యోగాలు, రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్లు, ఉపాధి కల్పన తదితరాలపైనే నేతలు దృష్టి పెట్టాయి. ఒక పార్టీ లోపాలను మరో పార్టీ బయట పెట్టుకుంటోంది.
మంత్రులంతా ప్రచారంలోనే
ఆయా శాఖల మంత్రులు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలోనే మునిగిపోయారు. వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి జిల్లాలో ప్రచారంలో పాల్గొన్నారు. ఆర్థిక మంత్రి హరీశ్ రావు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జిగా నియమితులు కావడంతో మేడ్చల్ ప్రచారంలో పాల్గొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా బాధ్యతలు చేపట్టిన వేముల ప్రశాంత్ రెడ్డి ఆ జిల్లాలో పర్యటిస్తున్నారు. మహమూద్ ఆలీ, తలసాని శ్రీనివాసయాదవ్, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, శ్రీనివాసగౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ఇలా అందరూ ఆయా జిల్లాల్లో ప్రచారంలోనే నిమగ్నమయ్యారు.
ఈసారి ఎందుకింత ప్రతిష్ఠాత్మకం..?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చే ఫలితం నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు, చివరకు 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల వరకు అన్నింటిమీదా ప్రభావం చూపనుండడంతో అన్ని పార్టీలూ సర్వ శక్తులతో పోరాడుతున్నాయి. ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అధికార పార్టీ తరఫున అధినేత కేసీఆర్ మొదలు మంత్రులు, ఎమ్మెల్యేల వరకు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక బీజేపీ కేంద్ర మంత్రులను రప్పిస్తోంది. అందుకే గతంలో ఎన్నడూ లేనంతటి ప్రాధాన్యత ఈసారి ఏర్పడింది. సాధారణంగా ఎమ్మెల్సీ ఎన్నికలను లైట్‌గా తీసుకునే టీఆర్ఎస్ ఈసారి మాత్రం సీరియస్‌గా తీసుకుంది. బీజేపీ హవా లేదని, టీఆర్ఎస్ పట్ల ప్రజలు ఇప్పటికీ విశ్వాసంతో ఉన్నారని నిరూపించడానికి ఈ ఎన్నికలను ప్రిస్టీజియస్‌గా తీసుకుంది.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలన్నది బీజేపీ తాపత్రయం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో చాలా డివిజన్లను కోల్పోవాల్సి రావడంతో వడ్డీతో సహా ఓట్లు రాబట్టుకుని సత్తా చాటాలన్నది టీఆర్ఎస్ అభిప్రాయం. ఆరేళ్లలో అధికారాన్ని చేజార్చుకోవడం మాత్రమే కాక పార్టీ నాయకులను, కార్యకర్తలను కూడా పోగొట్టుకున్న కాంగ్రెస్ కనీస స్థాయిలో పరువును నిలబెట్టుకోవాలనుకుంటోంది. మరోవైపు నల్లగొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం టీఆర్ఎస్ సిట్టింగ్ కావడంతో దీన్ని ఈసారి కూడా భారీ మెజారిటీతో గెలవాలని అనుకుంటోంది. కానీ అధికార పార్టీపై పట్టభద్రులు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో తీవ్ర వ్యతిరేకత ఉండడం అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై పడుతోంది.
ప్రభుత్వ వ్యతిరేకతే ప్రతిపక్షాలకు కీలకం
ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఆసరా చేసుకుని కోదండరాం, తీన్మార్ మల్లన్న, రాణి రుద్రమ, వామపక్షాల మద్దతుతో జర్నలిస్టు జయసారథి రెడ్డి లాంటివారు పోటీ చేస్తున్నారు. ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులూ సహజంగా అధికార పార్టీపైన, ప్రభుత్వ పాలనపైన ఉన్న వ్యతిరేకతనే నమ్ముకున్నారు. ఈ నియోజకవర్గంలో అధికార పార్టీ ఏటికి ఎదురీదుతూ ఉంటే మిగిలిన అభ్యర్థులు మాత్రం ప్రభుత్వ వ్యతిరేకతపై ఆధారపడ్డారు. గ్రాడ్యుయేట్లను ప్రసన్నం చేసుకోడానికి పడరాని పాట్లు పడుతున్నారు. నోటిఫికేషన్ రావడానికి రెండు నెలల ముందు నుంచే ప్రచారం మొదలైంది. హైదరాబాద్ నియోజకవర్గంలో సైతం ప్రొఫెసర్ నాగేశ్వర్ సహా చిన్న పార్టీల నాయకులు చాలా మందే పోటీచేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా నల్లగొండ స్థానంలో 72 మంది, హైదరాబాద్‌లో 93 మంది పోటీ చేస్తున్నారు.