'పది' పరీక్షల రద్దుకే మొగ్గు?

by Shyam |
పది పరీక్షల రద్దుకే మొగ్గు?
X

దిశ, న్యూస్‌బ్యూరో: పదో తరగతి పరీక్షలను పూర్తిగా రద్దు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రస్తుతానికి రాష్ట్రవ్యాప్తంగా తాత్కాలికంగా పరీక్షలను వాయిదా వేసినా తదుపరి తీసుకునే నిర్ణయంపై ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాతే స్పష్టత రానుంది. విద్యాశాఖ అధికారులు పదో తరగతి పరీక్షలకు సంబంధించి మూడు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నారు. మొత్తానికే పరీక్షలను రద్దు చేయడం, ప్రతీ సబ్జెక్టుకు ప్రస్తుతం ఉన్న రెండు పేపర్ల స్థానంలో ఒకే పేపర్‌ను రూపొందించి దానికి తగినట్లుగా మార్కుల్లో మార్పులు చేసి పరీక్షలు నిర్వహించడం, యధావిధిగా పరీక్షలను నిర్వహించాల్సి వస్తే ఎప్పుడు జరపడం సాధ్యమవుతుంది.. ఈ మూడు అంశాలే ముఖ్యమంత్రితో జరిగే సమావేశానికి ఎజెండాగా రూపొందాయి.

పరీక్షలను మొత్తానికే రద్దు చేయాల్సివస్తే ఇప్పటికే నిర్వహించిన ప్రీఫైనల్ పరీక్షలో వచ్చిన మార్కులను ఆధారంగా చేసుకుని విద్యార్థులకు గ్రేడింగ్ నిర్ణయించాలన్నది ఈ ప్రతిపాదన ఉద్దేశం. పంజాబ్ ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని ఈ సమావేశంలో వివరించే అవకాశం ఉంది. పంజాబ్ తరహా విధానాన్ని ఎందుకు అమలు చేయకూడదో చెప్పాలంటూ ప్ర్రభుత్వానికి హైకోర్టు సూచించిన నేపథ్యంలో ఈ ప్రతిపాదన రూపొందడం గమనార్హం.

ఇక రెండో ప్రతిపాదన ప్రకారం ప్రస్తుతం ఉన్న రెండు పేపర్ల పరీక్షల స్థానంలో ఒకే పేపర్‌ను రూపొందించి నిర్వహించడం. దీనికి తగిన విధంగా మార్కుల విధానంలో మార్పులు తీసుకురావడంతో పాటు పరీక్షా సమయాన్ని కూడా కుదించడం. ఇప్పటికే యూజీసీ విడుదల చేసిన మార్గదర్శకాల్లో పరీక్షా సమయాన్ని తగ్గించడంపై విశ్వవిద్యాలయాలకు అడ్వయిజరీ జారీ చేసింది. ఇదే విధానం ఇప్పుడు పదో తరగతి పరీక్షలకు కూడా వర్తింపజేసేలా అధికారులు ఆలోచిస్తున్నారు.

ఇక మూడవ విధానం ప్రకారం ప్రస్తుత పరీక్షా విధానంలో ఎలాంటి మార్పులు లేకుండా యథాతథంగా నిర్వహించాల్సి వస్తే ఎప్పుడు అనేది ఖరారు చేయడం. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా పరీక్షలను వాయిదా వేయాలని తాత్కాలిక నిర్ణయం తీసుకున్న మంత్రి ఈ వైరస్ బాధ ఎప్పుడు పోతుందో అప్పుడు మాత్రమే పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే అలాంటి పరిస్థితులు సమీప భవిష్యత్తులో ఉంటాయా అనేది ప్రశ్నార్థకం.

ఈ మూడు ప్రతిపాదనల్లో మొదటి దానికే అధికారులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండుసార్లు పరీక్షలను వాయిదా వేయడానికి కారణం కేవలం వైరస్ మాత్రమే. కాబట్టి భవిష్యత్తులో నిర్వహించాల్సి వచ్చినా తగిన వాతావరణం ఏర్పడడం అనివార్యం. సీఎం కేసీఆర్ ముందు ఈ మూడు ప్రతిపాదనలపై చర్చించిన తర్వాత ఆయన సూచనల ప్రకారమే విద్యాశాఖ స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోనుంది.

Advertisement

Next Story

Most Viewed