- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తహసీల్దార్ లేక సేవల్లో జాప్యం.. ఇబ్బందుల్లో ప్రజలు

దిశ, దుగ్గొండి: నియోజక వర్గంలోని దుగ్గొండి మండల ప్రజలు తహసీల్దార్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు మూడు నెలల కిందట తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి బదిలీ అయ్యారు. అప్పటి నుండి నేటి వరకు కొత్త తహసీల్దార్‌ని ప్రభుత్వం నియమించక పోవడంతో మండల ప్రజలు నానా ఇబ్బందుల ఎదుర్కొంటున్నారు. ముఖ్యమైన పనులన్నీ పెండింగ్‌లోనే ఉంటున్నాయి. శాశ్వత తహసీల్దార్ లేకపోవడంతో ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు పలు రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. గురుకులాల్లో ప్రవేశాల కొరకు విద్యార్థులకు అవసరమైన కుల ధ్రువీకరణ, నివాస ధ్రువీకరణ పత్రాలు కావలసినవారు పని జరగాలంటే దుగ్గొండి మండల కేంద్రం నుండి నర్సంపేటలోని ఇంచార్జి తహసీల్దార్ గా ఉన్న రాంమ్మూర్తి వద్దకు సుమారుగా 20 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవలసి వస్తోంది. దీంతో ఎక్కువ శాతం ప్రజలకు ప్రభుత్వ సేవలు అందడం లేదు.
ఖాళీగా ఉన్న పలు పోస్టులు..
దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో అటెండర్, టైపిస్ట్, మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్ పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ 45 రోజుల ట్రైనింగ్ నిమిత్తం వెళ్ళాడు. మండలం నుండి కలెక్టర్‌కి పంపే పలు నివేదికలు, గ్రీవెన్స్ దరఖాస్తులు, గరుడ దరఖాస్తులు, ధరణి, మ్యుటేషన్ పెండింగ్ దరఖాస్తులు, కళ్యాణ లక్ష్మీ నివేదికలలో పూర్తి స్థాయి అధికారులు, సిబ్బంది లేకపోవడంతో ప్రజలకు అందే సేవల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది.
పని ఒత్తిడిలో నాయబ్ తహసీల్దార్, గ్రామ రెవెన్యూ సహాయకులు..
ప్రస్తుతం ఉన్న నాయబ్ తహసీల్దార్ (డిప్యూటీ తహసీల్దార్) ప్రతి రోజు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ధరణి రిజిస్ట్రేషన్ కు సంబంధించిన పనులు చేస్తూ ఉండడం వలన మిగిలిన ఆఫీసు కార్యకలాపాల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. మండలంలో మొత్తం 35 మంది గ్రామ సహాయకులుగా పని చేస్తూ ఉన్నారు. వీఆర్వోలు ఎలాంటి పనులు చేయకుండా ఉండడం వలన పని భారమంతా నాయబ్ తహసీల్దార్ సౌజన్య , గిర్ధవర్, సీనియర్ అసిస్టెంట్, గ్రామ రెవెన్యూ సహాయకుల మీదనే పడుతుంది.
పూర్తి స్థాయి తహసీల్దార్ నియామకం ఎప్పుడు ?
దుగ్గొండి తహసీల్దార్ బదిలీ జరిగి మూడు నెలలు కావస్తున్నా నేటికీ కొత్త తహసీల్దార్‌ని నియమించలేదు. మండల కార్యాలయంలో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప శాశ్వత తహసీల్దార్ ను నియమించడం లేదు. ఇన్ని రోజులైనా, ప్రజలు ఇన్ని అవస్థలు పడుతున్నా ఎందుకు నియమించట్లేదనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇకనైనా అధికారులు చొరవ తీసుకొని పూర్తి స్థాయి అధికారిని నియమించాలని అటు మండల ప్రజలు, ఇటు కార్యాలయ ఉద్యోగులు కోరుకుంటున్నారు.