ఎమర్జెన్సీ ఆర్డర్స్.. మళ్లీ మొదట్నుంచీ ఫీవర్ సర్వే

by Anukaran |   ( Updated:2021-05-20 20:45:18.0  )
fever survey
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఫీవర్​, గర్భిణీల సర్వే మళ్లీ మొదట్నుంచీ చేయాలని ప్రభుత్వం అత్యవసర ఆదేశాలిచ్చింది. కరోనా కట్టడయ్యేంత వరకూ… ఒక రౌండ్​ ముగియగానే మరో రౌండ్​ సర్వే చేయాలని సూచించింది. ప్రస్తుతం జ్వరం సర్వే వివరాలు తీసుకుని ఏం చేస్తున్నారో తెలియదు కానీ… క్షేత్రస్థాయి సిబ్బందిని మాత్రం పరుగులు పెట్టిస్తున్నారు. మరోవైపు సర్వే సిబ్బంది అనారోగ్యానికి గురవుతున్నారు. రాష్ట్రంలో సర్వే చేస్తున్న వారిలో దాదాపు 20 శాతం కరోనా బారిన పడ్డారు. ఖమ్మంలో సర్వే చేస్తున్న మెప్మా సిబ్బందిలో ఒక గర్భిణీకి కొవిడ్​ పాజిటివ్‌గా తేలింది. తనతో పాటుగా తన భర్తకు కూడా పాజిటివ్​ వచ్చింది. ఈ విషయాన్ని అధికారులకు విన్నవించినా… కనీసం పలుకరించే వారు కూడా లేరని ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆడియో సంచలనంగా మారింది.

సర్వే చేయాల్సిందే

రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు బుధవారం అత్యవసర ఆదేశాలిచ్చారు. జ్వరంతో పాటు గర్భిణీల సర్వేను మళ్లీ చేయాలని సూచించారు. కరోనా కట్టడయ్యేత వరకు నిత్యం సర్వే ఉంటుందని, ఒక విడుత ముగియగానే మరో విడుతలో ముందు నుంచీ సర్వే చేయాలంటూ ఆదేశాలిచ్చారు. అయితే ఈ సర్వే భారం మొత్తం కిందిస్థాయి సిబ్బందిపైనే పడుతోంది. ప్రస్తుతం వైద్యారోగ్య శాఖ సిబ్బంది కాకుండా పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్​, మెప్మా సిబ్బందితో సర్వే జరిపిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు మాత్రం పరిశీలనకు వెళ్లి వస్తున్నారు. రోజువారీగా నివేదికలు, సర్వే వివరాలు, లోకేషన్లు పంపించాలంటూ ఒక విధంగా వేధింపులకు గురి చేస్తున్నారు.

మరోవైపు సర్వే సిబ్బంది ఇప్పటికే చాలా కష్టాల్లో పడుతున్నారు. ఒక కార్పొరేషన్​ పరిధిలో దాదాపుగా 300 మంది కాంట్రాక్ట్​ సిబ్బంది సర్వే చేస్తుంటే… అందులో 80 మందికిపైగా కరోనా బారిన పడుతున్నారు. పంచాయతీల్లో కూడా అదే పరిస్తితి. ఇటీవల ఖమ్మం జిల్లాలో ఓ పంచాయతీ కార్యదర్శి కరోనాతో చనిపోయాడు. గ్రామంలో సర్వే చేసిన సమయంలో కరోనా పాజిటివ్​గా తేలింది. క్షేత్రస్థాయి సిబ్బంది కూడా చాలా మంది మృతి చెందారు. సర్వే సమయంలో వారిని వినియోగించుకుంటున్న అధికారులు… వారికి కరోనా సోకితే మాత్రం కనీసం పలకరించడం లేదు. అంతేకాకుండా చాలా మంది వివిధ రకాల ఇన్​ఫెక్షన్లతో బాధపడుతున్నారు. జ్వరం సర్వేలో చాలా ప్రాంతాల్లో జ్వర పీడితులున్నట్లు తెలుస్తోంది. ఈ వివరాలను ఎప్పడికప్పుడు వైద్యారోగ్య శాఖ నుంచి తీసుకోవాల్సి ఉండగా… ఇప్పుడు ఈ భారమంతా ఇతర విభాగాల సిబ్బందిపై పెట్టారు. అయితే వారికి సరైన రక్షణ చర్యలు కల్పించడం లేదు. సర్వే సిబ్బందికి కనీసం మాస్క్​, శానిటైజర్లు కూడా ఇవ్వడం లేదు. కొన్నిచోట్ల ఇవ్వకున్నా ఇస్తున్నట్లు కాగితాల్లో లెక్కించుకుంటున్నారు. దీనిపై సిబ్బంది నిలదీస్తే అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎప్పటి వరకు సర్వే..?

ప్రస్తుతం ఇప్పటికే ఒక దఫా సర్వే పూర్తి అయింది. సర్వే పూర్తి చేశామని ఊపిరి తీసుకునే సమయంలోనే మళ్లీ సర్వే చేయాలంటూ ఆదేశాలు రావడంతో సిబ్బంది ఉసూరుమంటున్నారు. రెండో దఫా సర్వే రాష్ట్రంలో గురువారం నుంచి మళ్లీ మొదలైంది. బుధవారం రాత్రి అత్యవసరంగా ఆదేశాలిచ్చి మళ్లీ ముందు నుంచి జ్వరం, గర్భిణీల జాబితా తయారు చేస్తున్నారు. ఈసారి గర్భిణీల జాబితాలో చాలా మార్పులు చేశారు. వారి వివరాలు, ఫోన్​ నంబర్లు, ఆధార్​ నంబర్లు, డెలివరీ డేట్​, సమీప ఆస్పత్రి, వారు ప్రస్తుతం చూపించుకుంటున్న ఆస్పత్రి, తల్లిదండ్రుల వివరాలన్నీ తీసుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed