చేతులెత్తేసిన వైద్యారోగ్య శాఖ.. క్వారెంటైన్‌లో పేషెంట్ల అవస్థలు

by vinod kumar |
చేతులెత్తేసిన వైద్యారోగ్య శాఖ.. క్వారెంటైన్‌లో పేషెంట్ల అవస్థలు
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయం ‘హోం క్వారెంటైన్’. కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఇప్పటివరకూ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందిన పేషెంట్లను ప్రభుత్వం డిశ్చార్జి చేసి ఇళ్ళకు పంపింది. హోమ్ ఐసొలేషన్‌లోనే ఉండవచ్చని జాగ్రత్తలు చెప్పి పంపింది. ఇంట్లోనే చికిత్స అందిస్తామని ప్రకటించింది. గాంధీ ఆస్పత్రి నుంచి 310 మందిని హోం క్వారంటైన్‌కు తరలించింది. మరో 83 మందికి ఇంట్లో ప్రత్యేక గది సౌకర్యం లేకపోవడంతో బేగంపేటలోని నేచర్ క్యూర్ సెంటర్‌కు తరలించింది. అలా వెళ్ళినవారి ఆరోగ్య పరిస్థితి గురించి గానీ, ఈ నాలుగైదు రోజుల వ్యవధిలో కరోనా లక్షాణాలేమైనా వచ్చాయో తెలుసుకోడానికి గానీ వైద్య సిబ్బంది ప్రయత్నించలేదు. లక్షణాలు బైటపడిన వారే స్వచ్ఛందంగా ఫోన్ చేస్తే కింగ్ కోఠి ఆసుపత్రికి వెళ్ళండి అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు.

హోం క్వారెంటైన్ పేరుతో ప్రభుత్వం గాంధీ ఆస్పత్రిలోని 310 మంది డాక్టర్లను ఇండ్లకు పంపించేశారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం హోమ్ క్వారంటైన్‌లో ఉన్న పేషెంట్లను ప్రతీరోజూ రెండు సార్లు ప్రభుత్వ అధికారులు ఫోన్లు చేసి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేయాలి. నగరంలో ఉంటున్నవారైతే జీహెచ్ఎంసీ, ఆరోగ్య, పోలీసు విభాగాల నుంచి ఎవరో ఒకరు ఉదయం, సాయంత్రం ఆ వ్యక్తి ఆరోగ్యం గురించి వివరాలను నోట్ చేసుకోవాలి. పరిస్థితి మెరుగుపడుతుందా లేక ఇతర ఆరోగ్య సమస్యలేమైనా పెరుగుతున్నాయా అని తెలుసుకోవాలి. రెండు రోజులకు ఒకసారి వైద్యులు, ఆశా వర్కర్లతో కూడిన బృందం నేరుగా వచ్చి వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. కోలుకునేందుకు అవసరమైన సూచనలు, మందులు అందించాల్సి ఉంటుంది. అయితే గత నాలుగు రోజులుగా ఒక్కరు కూడా ఫోన్ చేయలేదని, కనీసం ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ఎవరూ రాలేదని జీహెచ్ఎంసీ పరిధిలో హోం క్వారెంటైన్‌లో ఉన్న ఒక మహిళా పేషెంట్ వాపోయారు.

ఆసుపత్రిలో ఉన్నపుడు వైద్యం చేసినా చేయకపోయినా డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నామనే ధైర్యం ఉండేదని, ఇప్పుడు అది కూడా లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబంలోని ఇతరులకు వైరస్ అంటుతుందేమోనని ఆందోళన పడుతున్నారు. పాజిటివ్ నిర్ధారణ అయిన తమకే ఇలాంటి చేదు అనుభవం ఎదురైతే కొత్తగా వచ్చే సస్పెక్టెడ్ కేసులను పట్టించుకుంటారనే నమ్మకం ఎలా వస్తుందని ఆమె ప్రశ్నించారు. పైగా ఇంటి గోడకు స్టిక్కర్ అంటించి వెళ్ళడంతో పలకరించేవారే కరువయ్యారని, బైటకు వెళ్ళడానికి ఆస్కారమే లేకుండా పోయిందన్నారు. జ్వరం వచ్చిందన్న విషయాన్ని వైద్య సిబ్బందికి ఫోన్ చేసి చెప్తే కింగ్ కోఠి ఆసుపత్రికి వెళ్ళాలంటూ సూచించారని, పాజిటివ్‌ పేషెంట్‌గా తాను ఆటోలో లేదా క్యాబ్‌లో ఎలా వెళ్తానని ఆమె ప్రశ్నించారు. స్వంత వాహనం లేదు కాబట్టి ఆంబులెన్స్ తప్ప మరో మార్గం లేదని వివరించారు. నిజంగా వైద్య సిబ్బంది చెప్పినట్టుగానే తాను ఆటోలో లేదా క్యాబ్‌లో వెళ్తే డ్రైవర్లకు ఇన్‌ఫెక్షన్ సోకుతుందనేది పట్టించుకోరా అని ప్రశ్నించారు.

రెండు రోజులుగా వర్షం, వాతావరణంలో మార్పు రావడంతో రోగ లక్షణాలు పెరిగాయని, తనకు సాయమందించాలని జీహెచ్ఎంసీ పరిధిలోని మరో పాజిటివ్ పేషెంట్ వైద్యాధికారులకు ఫోన్ చేసి తెలిపారు. ఈ వ్యక్తికి కూడా నేరుగా కింగ్‌కోఠి ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. తనకు పాజిటివ్ ఉందని, రోడ్ల మీద ఎలా వెళ్లగలనని, ఇతరులకు వైరస్ అంటుకునే ప్రమాదం ఉందని ఆ వ్యక్తి సూచించినా అధికారులు పట్టించుకోలేదు. ఏం పర్వాలేదు మీరో ఆటోలో వెళ్లండంటూ ఓ సలహా ఇచ్చి ఫోన్ పెట్టేశారని వివరించారు.

కింగ్‌కోఠి ఆసుపత్రికి వెళ్ళాలని అడిగితే ఏ ఆటో డ్రైవర్‌గానీ క్యాబ్ డ్రైవర్‌గానీ వస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ అంబులెన్స్‌లు వెళ్దామనుకున్న అవి అసలు పనిచేయడం లేదని వాపోయారు. ఇదంతా ఒక సమస్య అనుకుంటే ఇంటికి స్టిక్కర్ అంటించడంతో ఇంటి ఓనర్‌తో ఖాళీ చేయాలంటూ వచ్చే సమస్య అదనం అని వాపోయారు.

Advertisement

Next Story

Most Viewed