వాళ్లు ఉగ్రవాదులు కాదు.. కేసీఆర్‌పై ఈటల ఫైర్

by Shyam |
Itala Rajendra
X

దిశ, హుస్నాబాద్: సీఎం కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపిస్తాడని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి భూనిర్వాసితులు చేస్తున్న దీక్షకు మద్దతు తెలిపి మాట్లాడారు. లక్షలాది మంది రైతులు మట్టితిని, కొవ్వొత్తుల కరిగి దేశానికి అన్నం పెడుతున్నారన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టును 1.4 నుంచి 8.2కు రీడిజైన్ చేసిండ్రు. రీడిజైన్ చేసిన క్రమంలో సీఎం కేసీఆర్‌తో నేను బస్సులో వచ్చి భూములు కోల్పోతున్న కుటుంబంలోని సభ్యులందరికీ పరిహారం ఇవ్వాలని, లేకుంటే నిర్వాసితుల ఉసురు తగులుతుంది అప్పుడే చెప్పినా.

ప్రాజెక్టులో నాలుగు ఎకరాల భూమి పోతే, వచ్చిన డబ్బులతో నేడు ఒక ఎకరం భూమి కొనలేని దుస్థితి దాపురించింది. 2007 నుంచి 2021 వరకు 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలి. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ కట్టించడం ద్వారా కొడుకు కోడలు, కొత్త అల్లుడు వస్తే ఎక్కడుంటాడంటివి. అప్పుడు నువ్వు చెప్పిన మాటలకు మేమంతా మైమరచిపోతిమి. పోలీసులను ఉసిగొల్పి దౌర్జన్యంగా చేయి చేసుకోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు పాలన సాగుతోందంటే ప్రజల పన్నులతో మాత్రమేనని, 2023లో ఎలక్షన్లు వస్తాయని అప్పుడు నీ పతనం ఖాయమన్నారు.

భూ నిర్వాసితులు సర్వస్వం కోల్పోయి పరిహారం అడుగుతున్నారని, పోలీసులతో కొట్టించడానికి వారేమీ ఉగ్రవాదులు కాదన్నారు. నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించాలని, నువ్వొక్కడివే డబ్బులు ఇవ్వడం లేదని కేంద్రం రూ. 2లక్షల ఇస్తుందని చెప్పారు. రాళ్ళురప్పలు పోగు చేసుకొని కన్నీళ్లతో కన్నగడ్డనొదిలి పోతున్న నిర్వాసితులను ఏడిపిస్తే సీఎం కేసీఆర్ ఉసురు తగిలి పోతావ్ అన్నారు. భూ నిర్వాసితులు దొంగలు దోపిడీదారులు కాదని న్యాయబద్ధంగా పరిహారం అడుగుతున్నారని మీ కుటుంబ సభ్యులవలె అక్రమంగా రూ. వందల కోట్లు సంపాదించుకునేటోళ్లు కాదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని లేని పక్షంలో ఎంతటి ఉద్యమానికైనా వెనుకాడబోమని ఈటెల తేల్చిచెప్పారు. నిర్వాసితులు చేస్తున్న దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గొల్లపల్లి వీరాచారి, గ్రామ సర్పంచి బద్దం రాజిరెడ్డి, భూ నిర్వాసితులు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed