- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెట్రో మంట.. పన్ను మోత
పెట్రల్ ధర మండిపోతున్నది. డీజిల్ కొండెక్కింది.. గ్యాస్ బండ గుదిబండగా మారుతున్నది. ధరలు ఎందుకిలా పెరుగుతున్నాయి. ప్రస్తుతం లీటరు పెట్రోలు ధర రూ. 92.51కు చేరింది. గతేడాది డిసెంబరు 16న హైదరాబాద్ లో రూ. 87.06 లీటరు ధర పలికింది. ఇందులో మూల ధర : రూ. 27.41 మాత్రమే. మిగిలింది ఎక్సైజ్ పన్ను రూపంలో కేంద్ర ప్రభుత్వం రూ. 32.98, వ్యాట్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం 21.79 చొప్పన పన్నులుగా వసూలు చేస్తున్నాయి. ఈ పన్ను భారమే తడిసి మోపడవుతుండటం గమనార్హం.
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తుల (పెట్రోలు, డీజిల్, ఎల్‌పీజీ) ధరలను వికేంద్రీకరించిన తర్వాత చమురు కంపెనీలు ఇష్టారాజ్యంగా వాటి ధరలను పెంచేస్తున్నాయి. ఏడాది కాలంలో పెట్రోలు ధర రూ. 16.10, డీజిల్ ధర రూ. రూ. 16.09 చొప్పున పెరిగాయి. అసలు (బేసిక్) ధర పెట్రోలు లీటర్‌కు 27.41, డీజిల్ రూ. 28.35 చొప్పున మాత్రమే ఉంటే మిగిలినదంతా కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న ఎక్సయిజ్ పన్ను, రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న ‘వ్యాట్’ మాత్రమే. తాజాగా ‘అగ్రి సెస్’ విధించినా అది ప్రత్యక్షంగా వినియోగదారుడిపై పడడంలేదు. చమురు కంపెనీలు భరించాల్సిన ఈ భారాన్ని కూడా పరోక్షంగా వినియోగదారులపై వేస్తున్నాయి.
పెట్రోలు, డీజిల్ ధరల్లో ఒక వంతు కంటే తక్కువ మాత్రమే బేస్ ప్రైస్ ఉంటే రెండొంతుల కంటే ఎక్కువగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులు, డీలర్ కమిషన్, ప్రైట్ చార్జీలు ఉన్నాయి. గతేడాది ఫిబ్రవరి 15 నాటికి హైదరాబాద్ నగరంలో పెట్రోలు ధర రూ. 76.41 ఉంటే, ఈ ఏడాది అదే తేదీ నాటికి రూ. 92.51కు చేరుకుంది. ఇక డీజిల్ విషయంలో గతేడాది ఫిబ్రవరి 25 నాటికి రూ. 70.44 ఉంటే ఈ ఏడాది ఫిబ్రవరి 15 నాటికి అది రూ. 86.53కు చేరుకుంది. ఏడాది కాలంలో పెట్రోలు, డీజిల్ ధరలు రూ. 16 చొప్పున పెరిగాయి. కరోనా టైమ్‌లో కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌పై అదనంగా మూడు రూపాయల చొప్పున ఎక్సయిజ్ డ్యూటీని విధించింది. ఈ భారం వినియోగదారులపై పడకపోయినా చమురు సంస్థలు చెల్లించాల్సి ఉన్నందున ప్రతీరోజు కొంత చొప్పున ధరలను పెంచి ప్రజలపై భారం వేశాయి.
అసలు ధర రూ. 27.41 మాత్రమే
చమురు సంస్థలు విక్రయిస్తున్న పెట్రోలు, డీజిల్ ధరల గురించి సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేయగా వెల్లడించిన వివరాలను చూస్తే అసలు ధర కంటే పన్నుల ద్వారా ప్రజల నుంచి ప్రభుత్వాలు ముక్కుపిండి వసూలు చేస్తున్నవే ఎక్కువగా ఉన్నట్లు తేటతెల్లమవుతోంది. గతేడాది డిసెంబరులో ఆర్టీఐ ద్వారా చేసిన దరఖాస్తుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇచ్చిన సమాధానంలో విస్తుపోయే అంశాలు కనిపించాయి.
గతేడాది డిసెంబరు 16న హైదరాబాద్ నగరంలో పెట్రోలు, డీజిల్ ధరలు, వాటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులు ఇలా ఉన్నాయి..
పెట్రోలు..
మూల ధర : రూ. 27.41
ప్రైట్ చార్జి : రూ. 1.18
కేంద్రం విధిస్తున్న ఎక్సయిజ్ డ్యూటీ : రూ. 32.98
రాష్ట్రం విధిస్తున్న వ్యాట్ : రూ. 21.79
డీలర్ కమిషన్ : రూ. 3.70
రీటెయిల్ ధర : రూ. 87.06
డీజిల్ :
మూల ధర : రూ. 28.35
ఫ్రైట్ చార్జి : రూ. 1.20
కేంద్రం విధిస్తున్న ఎక్సయిజ్ డ్యూటీ : రూ. 31.83
రాష్ట్రం విధిస్తున్న వ్యాట్ : రూ. 16.67
డీలర్ కమిషన్ : రూ. 2.55
రీటెయిల్ ధర : రూ. 80.60
ఢిల్లీ స్థాయిలో ధరలు..
ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నాటికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఖరారు చేసిన పెట్రోలు, డీజిల్ ధరలు ఢిల్లీ నగరంలో ఎలా ఉన్నాయో వివరించింది. దేశంలో నాలుగు మెట్రో నగరాల్లో ఢిల్లీలో మాత్రమే అతి తక్కువగా ధరలు ఉన్నాయి. ఫిబ్రవరి 1న ఢిల్లీలో పెట్రోలు రూ. 86.30, డీజిల్ రూ. 76.48 చొప్పున ఉన్నాయి.
వీటి ప్రకారం పెట్రోలు, డీజిల్ మూల ధర ఎలా ఉందో పరిశీలిస్తే…
పెట్రోలు..
మూల ధర : రూ. 29.34
ఫ్రైట్ చార్జి : రూ. 0.37
కేంద్రం విధిస్తున్న ఎక్సయిజ్ డ్యూటీ : రూ. 32.98
రాష్ట్రం విధిస్తున్న వ్యాట్ : రూ. 19.92
డీలర్ కమిషన్ : రూ. 3.69
రీటెయిల్ ధర : రూ. 86.30
డీజిల్ :
మూల ధర : రూ. 30.55
ఫ్రైట్ చార్జి : రూ. 0.34
కేంద్రం విధిస్తున్న ఎక్సయిజ్ డ్యూటీ : రూ. 31.83
రాష్ట్రం విధిస్తున్న వ్యాట్ : రూ. 11.22
డీలర్ కమిషన్ : రూ. 2.54
రీటెయిల్ ధర : రూ. 76.48
తెలంగాణలో ఏటా ఏడు కోట్ల టన్నులు..
రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ తదితర పెట్రోలియం ఉత్పత్తులు ఏటా సగటున ఆరున్నర కోట్ల టన్నుల మేర వినియోగం అవుతున్నాయి. రాష్ట్రం ఏర్పడే నాటికి 4.81 కోట్ల టన్నులు ఉంటే ఆ తర్వాతి సంవత్సరం 5.70 కోట్ల టన్నుల చొప్పున వినియోగమైంది. గతేడాది 6.95 కోట్ల టన్నుల మేర వినియోగమైనట్లు పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ పేర్కొంది. దక్షిణాదిన అత్యధికంగా తమిళనాట గతేడాది 14 కోట్ల టన్నులు, కర్నాటకలో 13 కోట్ల టన్నులు ఆంధ్రప్రదేశ్‌లో 7.66 కోట్ల టన్నుల చొప్పున వినియోగమైంది. రాష్ట్ర ప్రభుత్వానికి గతేడాది పెట్రోలు, డీజిల్‌పై సుమారు రూ. 7720 కోట్లకు పైగా వ్యాట్ రూపంలో వసూలైతే ఈసారి మాత్రం అది వెయ్యి కోట్లు తగ్గినట్లు ఆర్థిక శాఖ వర్గాల సమాచారం. కరోనా కారణంగా దాదాపు మూడు నెలలు లాక్‌డౌన్ అమలు కావడంతో పెట్రోలు, డీజిల్ వినియోగం గణనీయంగా తగ్గింది.
డీజిల్ ధర గణనీయంగా పెరగడంతో పరోక్షంగా అది నిత్యావసర వస్తువుల మొదలు సిమెంటు, ఇసుక, ఇనుము తదితర అన్ని రకాల ఉత్పత్తుల రవాణాపై భారం పడింది. కరోనా సమయం తర్వాత కూరగాయల మొదలు అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగాయి. సామాన్యులపై భారం పడింది. తెలంగాణ ప్రభుత్వం పెట్రోలుపై ప్రతీ లీటర్‌కు 35%, డీజిల్‌పై 27% పన్ను వసూలు చేస్తోంది.