దర్యాప్తు విస్తృతం చేయండి.. మాజీ మంత్రి కేసు సీబీఐకి అప్పగింత

by Sumithra |
Bombay High Court
X

ముంబయి: మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై దాఖలైన అక్రమవసూళ్ల కేసులో దర్యాప్తును విస్తృతం చేయాలని సీబీఐని బాంబే హైకోర్టు ఆదేశించింది. అప్పటి హోం మంత్రిపైనా ప్రాథమిక విచారణ చేపట్టడానికి అనుమతిస్తే, ఆ ఉదంతంతో సంబంధమున్న ప్రతి ఒక్కరినీ దర్యాప్తు చేయడానికి అవకాశం చిక్కుతుందని, ఏప్రిల్ 5న సీబీఐకి తాము చేసిన ఆదేశాల్లోని ఆంతర్యం ఇదేనని వివరించింది. డిస్మిస్ అయిన పోలీసు సచిన్ వాజే ప్రమాదకరమైన వ్యక్తి అయితే, మళ్లీ 15 ఏళ్ల తర్వాత ఎందుకు సేవల్లోకి తీసుకున్నారని, తీసుకున్న కమిటీ ఏది? అని అడిగింది. కమిటీని నిందితుల జాబితాలో చేర్చాలని సూచించింది. ప్రస్తుతానికి తాము పేర్లు వెల్లడించడానికి పోవడం లేదని, దర్యాప్తు విస్తృతం చేస్తేనే అసలైన దోషులు బయటికొస్తారని సూచిస్తున్నట్టు పేర్కొంది.

అప్పటి మంత్రి వాజేను మళ్లీ సేవల్లోకి తీసుకోవాలని ఆదేశించి ఉండవచ్చునని, కానీ, అప్పుడు శాఖ చీఫ్‌గా ఉన్నవారు తాను అమాయకుడని, కేవలం ఆదేశాలను అమలు చేశామని చెప్పడం సరికాదని న్యాయమూర్తులు ఎస్ఎస్ షిండే, ఎన్‌జే జమాదర్‌ల డివిజన్ బెంచ్ పేర్కొంది. అందుకే మహారాష్ట్ర మాజీ హోం మంత్రిపై దాఖలైన పిటిషన్‌లో విచారణ విస్తృతం చేస్తే అసలైన కుట్రదారులు బయటపడతారని వివరించింది. సీబీఐ తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌ను తోసిపుచ్చాలని కోరుతూ మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తూ ఈ మేరకు సూచనలు చేసింది.

Advertisement

Next Story

Most Viewed