ఇండియాలో అతిపెద్ద రోబో అక్వేరియం.. చూస్తే మతిపోవాల్సిందే..!

by Sujitha Rachapalli |   ( Updated:2021-07-15 20:52:55.0  )
ఇండియాలో అతిపెద్ద రోబో అక్వేరియం.. చూస్తే మతిపోవాల్సిందే..!
X

దిశ, ఫీచర్స్ : భవిష్యత్ తరాలకు సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రపంచస్థాయిలో అందించేందుకు గుజరాత్ ప్రభుత్వం అహ్మదాబాద్‌లో ‘సైన్స్ సిటీ’ ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈ కేంద్రంలో హాల్ ఆఫ్ స్పేస్ అండ్ సైన్స్, యాంఫిథియేటర్, ఇన్ఫర్మేటివ్ లైఫ్ సైన్స్ పార్క్, ఐమాక్స్ 3డి థియేటర్, చిల్డ్రన్ యాక్టివిటీ సెంటర్, ఎనర్జీ పార్క్ వంటివి సందర్శకులు సైన్స్ అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ సైన్స్ సిటీ సాధారణ ప్రజలకు వినోదాన్ని అందిస్తూనే సాంకేతికత, సైన్స్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఈ క్రమంలోనే ప్రపంచ రోబోటిక్ గ్యాలరీ, దేశంలోనే అతిపెద్ద ఆక్వేరియాన్ని ప్రధాని మోదీ ఈ రోజు ప్రారంభించనున్నారు.

గుజరాత్ సైన్స్ సిటీ ప్రాజెక్ట్ రూపొందించడానికి 1999లో గుజరాత్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ సిటీ (జీసీఎస్‌సీ)ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ విభాగం (డీఎస్‌టీ)లో భాగంగా ఇది స్వయంప్రతిపత్తి సంస్థగా పనిచేస్తోంది. ఈ సైన్స్ కేంద్రాన్ని మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ కలల ప్రాజెక్టుగా పరిగణించారు. సైన్స్ విద్యను వినోదంతో మిళితం చేసి అందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో దీన్ని ప్రభుత్వం ప్రారంభించింది. అందులో భాగంగానే ఆరోగ్యం, పర్యావరణం, వాతావరణం, సైన్స్ అచీవ్‌మెంట్స్‌కు సంబంధించిన ప్రత్యేక రోజుల్లో ఈవెంట్స్ నిర్వహిస్తారు. అంతేకాదు ప్రముఖ శాస్త్రవేత్తల పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుతారు. ఈ విధంగా ఏడాది పొడవునా వివిధ రకాల వేడుకలు, కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. వేకేషన్ ట్రైనింగ్ ప్రొగ్రామ్ ఆన్ బయో రీసోర్సెస్, ఓరియంటేషన్ ప్రొగ్రామ్ ఆన్ సైన్స్ ఒలింపియాడ్స్, సమ్మర్ సైన్స్ ఎన్‌రిచ్మెంట్ ప్రోగ్రామ్ మొదలైనవి కేంద్రంలో నిర్వహిస్తారు. ఏడాదికి దాదాపు 8లక్షలకుపైగా దీన్ని సందర్శిస్తుంటారు. అయితే సైన్స్ సిటీ ప్రాజెక్ట్‌ తొలి దశలో ఈ అభివృద్ధి జరగగా, సెకండ్ ఫేజ్‌‌లో భాగంగా ఆక్వాటిక్ గ్యాలరీ, రోబోటిక్స్ గ్యాలరీ‌లతో పాటు నేచర్ పార్క్‌ను ప్రారంభిస్తున్నారు.

ఆక్వాటిక్ గ్యాలరీ :

15 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఆక్వాటిక్ గ్యాలరీలో 68 ట్యాంకులు(మంచినీరు, ఉప్పునీరు, సముద్ర జలాలు) నిర్మించారు. 188 సముద్ర జాతులు, ఉభయచరాలు పెంగ్విన్‌లతో సహా 11,690 చేపల్ని ఇందులో ఉంచుతారు. 28 మీటర్ల ఈ షార్క్ టన్నెల్ ఆక్వా గ్యాలరీకి ప్ర్యతేక ఆకర్షణగా నిలవనుంది. దీంట్లో గ్రే రీఫ్ షార్స్క్, బోనెట్ హెడ్ సొరచేపలు జీబ్రా షార్స్క్ ఉంటాయి. రూ. 260 కోట్లతో నిర్మించిన ఈ ఆక్వేరియం ‘భారతదేశంలో అతిపెద్ద పబ్లిక్ అక్వేరియం’గా పేరుగాంచింది. అక్వేరియం మొత్తం చూసేందుకు దాదాపు 2 గంటల సమయం పడుతుందని సమాచారం. అందులో ఉంచే పెంగ్విన్స్‌ను సౌత్‌ఆఫ్రికా నుంచి తీసుకురాగా, ప్రస్తుతం వాటిని అక్వేరియంలో క్వారంటైన్‌లో ఉంచారు. ఎప్పటికప్పుడు వాటికి వైద్య పరీక్షలు నిర్వహిస్తూ.. వీటి రవాణా కోసం ‘స్టాండార్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్స్’ అవలంభించారు. ఆయా సముద్రజీవులు వివిధ ఎకో రీజియన్స్ నుంచి వస్తున్నందున, వాటికి ఆ ప్రాంత వాతావరణం అనుకూలించడానికి రెండు వారాలు పడుతుందని అక్వేరియం నిర్వాహకులు తెలిపారు.

ఇండియన్ జోన్, ఆసియన్ జోన్, ఆఫ్రికన్ జోన్, అమెరికన్ జోన్ వంటి 68 ట్యాంకుల్లో ఎమ్యులేట్ చేస్తున్న బహుళ పర్యావరణ వ్యవస్థలకు పీహెచ్ స్థాయి, లవణీయత స్థాయి లేదా టీడీఎస్ స్థాయి వంటి అనేక నీటి పారామీటర్స్ పరిగణనలోకి తీసుకుని వీటిని నిర్వహిస్తారు. అంతేకాదు జీవజాతుల అవసరాన్ని బట్టి కెమికల్ ఆక్సిజన్, బయో-ఆక్సిజన్ అందిస్తారు. ఆయా అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలించడానికి గ్యాలరీ వెనుక భాగంలో ప్రయోగశాలలు కూడా ఏర్పాటు చేశారు. నీటి నమూనాలను అక్కడికక్కడే పరీక్షించడానికి వీలుగా సముద్ర జీవశాస్త్రవేత్తల బృందం కూడా ఉంటుంది. ఇక మెరైన్ జాతి వివరాలు, ప్రత్యేకతలు తెలుసుకోవడానికి టచ్ ప్యాడ్ డిస్‌ప్లే ఏర్పాటు చేశారు. ఆయా జాతులపై పూర్తి సమాచారం కోసం, టచ్-ప్యాడ్ డిస్‌ప్లేలపై క్యూఆర్ కోడ్‌ను కూడా స్కాన్ చేయవచ్చు. ఇది మరింత సమాచారంతో వీక్షకుడిని మొబైల్ యాప్‌కు తీసుకువెళుతుంది. ఆక్వా గ్యాలరీలో ఇంటరాక్టివ్ ఎగ్జిబిట్, 5డి థియేటర్ కూడా ఉన్నాయి. సైన్స్ సిటీ వెబ్‌సైట్ ప్రకారం, ఆక్వాటిక్ గ్యాలరీ ప్రవేశ రుసుము 200 రూపాయలు కాగా కనీసం 10 మంది పిల్లలతో కూడిన పాఠశాల విద్యార్థుల గ్రూపునకు రూ.50 సబ్సిడీ ఇస్తారు.

రోబోటిక్ గ్యాలరీ :

మొత్తం మూడు ఫ్లోర్లలో ‘రోబోటిక్ గ్యాలరీ’ ఏర్పాటు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో రోబోలతో నిర్వహించే రెస్టారెంట్ ఉంటుంది. కుకింగ్, సర్వింగ్, క్లీనింగ్ వంటివి రోబోలే నిర్వహిస్తాయి. అంతేకాదు ఇంటరాక్టివ్ ఎగ్జిబిట్‌లు ఉన్నాయి. అక్కడ రోబోలతో సంభాషించొచ్చు. ఇంకా రోబోలతో 3డీ చిత్రాలు దిగేందుకు కూడా అవకాశం ఉంది. కానీ ఇది పెయిడ్ సర్వీస్. ఇక ట్రాన్స్‌ఫా‌ర్మర్, వాల్-ఈ వంటి పాప్ కల్చర్ రోబోట్లతో పాటు, హ్యూమనాయిడ్ రోబోట్ అసిమో గ్రౌండ్ ఫ్లోర్‌కు‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

16వ శతాబ్దపు మెకానికల్ మాంక్ నుంచి నేటి హ్యూమనాయిడ్, స్పేస్ రోబోట్స్ వరకు వాటికి సంబంధించిన పరిణామ చరిత్రను సందర్శకులు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ యంత్రాలు మానవ జీవితాలను ఎలా ప్రభావితం చేశాయో చూడొచ్చు. శస్త్రచికిత్సలలో, రెస్క్యూ ఆపరేషన్లలో రోబోల పనితీరుపై స్పష్టమైన అవగాహన తెచ్చుకోవచ్చు. అంతేకాదు రోబోలు సాకర్ ఆట లేదా బ్యాడ్మింటన్‌లో ఒకదానితో ఒకటి పోరాడటం చూడొచ్చు. మ్యాన్ వెర్సెస్ మెషీన్‌లో భాగంగా రోబోతో మనమూ గేమ్ ఆడొచ్చు. మానవరహిత వైమానిక వాహనాలు, ఉపగ్రహాల‌కు సంబంధించిన డీఆర్‌డీవో, ఇస్రో ప్రదర్శనలతో పాటు రోబో-ఫెస్ట్‌లలో గెలిచిన ఇంజనీరింగ్ ఇన్‌స్టి‌ట్యూట్స్ తయారు చేసిన రోబోలు వర్క్‌‌షాప్‌లు నిర్వహిస్తారు. ఇంటరాక్టివ్ ఇంటర్‌ఫేస్‌తో యువతను ప్రోత్సహించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాలు రూపొందించారు. వర్చువల్, ఆగ్మెంటెడ్ రియాలిటీకి సంబంధించిన ప్రత్యేక గ్యాలరీలో థ్రిల్ రైడ్స్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. అంతేకాదు రింగ్ ఫైట్ లేదా రేస్ కార్లలోకి రావడానికి వీఆర్ గ్లాసెస్ ధరించవచ్చు.

ఇక రోబో-నాట్య మండపం’లో ఐదు డ్యాన్సర్ రోబోలతో పాటు డ్రమ్మర్, ట్రంపెటిస్ట్, పియానిస్ట్ ఉంటాయి. ఈ రోబోల ప్రదర్శన సందర్శకులకు భిన్నమైన ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. రోబోటిక్ వర్క్‌షాప్‌ గ్యాలరీలో 79 రకాల రోబోట్లను ప్రదర్శనకు ఉంచగా, సందర్శకులు రోబోటిక్స్ రంగాన్ని అన్వేషించడానికి ఓ వేదికను అందించే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు.

ఎనిమిది హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ ప్రకృతి పార్కును అటవీ శాఖ సహకారంతో రూపకల్పన చేసి అభివృద్ధి చేసినట్లు డిఎస్‌టి వర్గాలు తెలిపాయి.

Advertisement

Next Story

Most Viewed