బడులు బంద్.. అయోమయంలో విద్యారంగం

by Anukaran |
బడులు బంద్.. అయోమయంలో విద్యారంగం
X

విద్యారంగాన్ని కరోనా, లాక్‌డౌన్ అతలాకుతులం చేశాయి. ఏం జరుగుతుందో తెలియక విద్యార్థులు, తల్లిదండ్రులు గందరగోళానికి గురయ్యారు. అకడమిక్ ఇయర్ మొదలు కాలేదు. ప్రైవేట్ యాజమాన్యాలు ఆన్ లైన్ క్లాసులతో ఫీజుల మీదనే దృష్టి సారించాయి. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ఆ మాత్రం చదువుకు కూడా దూరమయ్యారు. సంక్షోభం కారణంగా పలువురు ప్రైవేటు ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వం, కోర్టులు ఇచ్చిన ఆదేశాలను కార్పొరేటు విద్యాసంస్థలు యథేచ్చగా ఉల్లంఘించాయి. అయినా పట్టించుకునేవారే కరువయ్యారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనాను నివారించేందుకు లాక్‌డౌన్ విధించడంతో అసలు సమయానికి అకడమిక్ ఇయర్ ప్రారంభం కాలేదు. ఆగస్టు తర్వాత సడలింపులు వచ్చినా విద్యావ్యవస్థ సాధారణ స్థితికి రాలేదు. విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగకుండా ప్రభుత్వం డిజిటల్ క్లాసులను ప్రారంభించింది. అంతకుముందే ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ఆన్‌లైన్ క్లాసులకు తెరలేపాయి. సాధారణ రోజుల మాదిరిగానే లక్షల రూపాయల ఫీజులను వసూలు చేశాయి. బోధన, వసతి, భోజనం లేకపోయినా ఫీజులు అడగడంతో తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు వ్యతిరేకించాయి. అధిక ఫీజులు వసూలు చేయొద్దని ప్రభుత్వం ఇచ్చిన జీఓలు అమలు కాలేదు. కోర్టు ఆదేశాలనూ అటకెక్కించారు. కుటుంబాలు ఆర్థికంగా కష్టపడుతున్న తరుణంలో ఫీజుల కోసం ఒత్తిడి చేయడంతో పలు సంఘాలు కోర్టులను ఆశ్రయించాయి.

గురి తప్పిన డిజిటట్ పాఠాలు

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం డిజిటల్ తరగతులు ప్రారంభించారు. దూరదర్శన్, టీశాట్ చానెళ్ల ద్వారా పాఠాలు బోధించారు. గ్రామీణ ప్రాంతాలలో టీవీలు, ఇంటర్నెట్ లేక విద్యార్థులు పాఠాలను అందుకోలేకపోయారు. సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. డిజిటల్ పాఠాలు అర్థం కాక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసేందుకు మధ్య తరగతి కుటుంబాలు అప్పులు చేయాల్సి వచ్చింది. డిజిటల్ పాఠాలు వినేందుకు విద్యార్థులు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. సిగ్నల్స్ కోసం నీటి ట్యాంకులు, ఎత్తైన ప్రాంతాలు, చెట్ల మీదకు ఎక్కాల్సి వచ్చింది. పది శాతం విద్యార్థులు కూడా డిజిటల్ పాఠాల లక్ష్యానికి చేరువ కాలేకపోయారని ఉపాధ్యాయ సంఘాల నేతలే అంగీకరిస్తున్నారు. విద్యాసంస్థలు ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియదు. అకడమిక్ క్యాలెండర్, సిలబస్‌ను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీబీఎస్‌ఈ, స్టేట్ సిలబస్‌లోనూ 30శాతం తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నారు. నిరసనల నేపథ్యంలో వెనక్కి తగ్గారు. ఇప్పటికిప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభిస్తే పాఠ్యాంశాల బోధన, సిలబస్, పరీక్షలు ఎలా నిర్వహిస్తారనేదానికి రూట్ మ్యాప్ లేకుండా పోయింది.

అదీ వావాదాస్పదమే

ఇంటర్, డిగ్రీ ప్రవేశాల కోసం గడువును పొడిగిస్తూ వెళ్తున్నారు. పది, ఇంటర్ విద్యార్థులను పాస్ చేయడం కూడా వివాదాస్పదంగా మారింది. ఎంసెట్‌లో వెయిటేజీ ఆధారంగానే ర్యాంకులను ప్రకటించారు. కరోనాతోనూ, ఇతర అనారోగ్య కారణాలతోనూ ఎంసెట్ రాయలేకపోయినవారికి మరోసారి అవకాశాన్ని కల్పించారు. వారికోసం ప్రత్యేకంగా సీట్లను కేటాయించాల్సి వచ్చింది. డిగ్రీ, పీజీ విద్యార్థుల కోసం యూనివర్సిటీలు ప్రత్యామ్నాయాలను ప్రతిపాదించాయి. సెంట్రల్ యూనివర్సిటీలో ఆన్‌లైన్ క్లాసులను అనుమతించగా, ఓయూ, కేయూ లాంటి యూనివర్సిటీలు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పీజీ సెట్, లాసెట్, ఐసెట్ యూనివర్సిటీలవారిగా పొంతన లేకుండా కొనసాగాయి. ఇప్పటికే కౌన్సెలింగ్‌ ముగిసినప్పటికీ, కొన్ని యూనివర్సిటీలు ఇంకా డిగ్రీ పరీక్షల ఫలితాలను ప్రకటిస్తున్నాయి.

ఆదాయమే లక్ష్యంగా

ఆన్‌లైన్ క్లాసులను ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ఆదాయ మార్గంగా మార్చుకున్నాయి. ఆన్‌లైన్ క్లాసులకు హాజరయ్యే విద్యార్థులలో కండ్లు, వెన్ను, కండరాల నొప్పి వంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఫిజికల్ యాక్టీవిటీ లేకపోవడంతో సమస్యలు వస్తాయని సైకాలజిస్టులు కూడా చెబుతున్నారు. ఇంటర్ బోర్డు ప్రత్యేకంగా విద్యార్థులకు సైకాలజిస్ట్ కౌన్సెలింగ్‌ను కూడా అందించింది. కంప్యూటర్లు, మొబైల్ ముందున్న విద్యార్థులు వీడీయో గేమ్స్ చూస్తున్నా, ఇతర పనులు చేస్తున్నా ఉపాధ్యాయులు నియంత్రించడం సాధ్యం కాదు. ఫిజికల్ క్లాసులోనైతే విద్యార్థి, టీచర్‌కు నేరుగా కనెక్టవిటీ ఉండటంతో పాఠాలు సరిగా అర్థమవుతాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల తల్లిదండ్రులు ఎక్కువగా వ్యవసాయ పనుల మీద ఆధారపడుతుంటారు. ఆర్థిక సమస్యల కారణంగా వారు ఇంటి వద్దనే ఉండి పిల్లలను పర్యవేక్షించే వెసులు బాటు ఉండదు. కొందరి ఇండ్లలో టీవీలు, స్మార్ట్ ఫోన్లు లేక విద్యార్థులు డిజిటల్ పాఠాలను అందుకోలేకపోయారు.

ఉపాధి కోల్పోయి

లాక్‌డౌన్ తర్వాత ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలలో ఎక్కువ మంది టీచర్ల అవసరం లేకుండా పోయింది. అప్పటికే ప్రైవేట్ టీచర్లకు రెండు నెలల జీతం అందలేదు. తర్వాత లాక్‌డౌన్ రావడంతో ఆ జీతం ఇప్పటికీ అందలేదు. దాదాపు 16,500 సంస్థలలో పనిచేసే లక్షల మంది ఉపాధ్యాయుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. విద్యాసంస్థలు తెరిచే అవకాశాలు లేవని గుర్తించి చిన్నచిన్న పనులు చేస్తున్నారు. వ్యాపారాలు, ఇతర పనులు, భవన నిర్మాణాలు, డ్రైవింగ్ కు వెళ్లినవారు కూడా ఉన్నారు. కొందరు వ్యవసాయ పనులలో చేరిపోయారు. ఆన్‌లైన్ పాఠాలు బోధిస్తున్నవారిలో కూడా పది శాతం మందికి కూడా జీతాలు అందడం లేదు. కుటుంబాలను పోషించుకోవడం కష్టమవుతోంది. వాగ్వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. సమస్యలు వస్తుండటంతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. సుమారు 20 మంది ప్రైవేట్ టీచర్లు బలవన్మరణం చెందారు. పిల్లలకు పెండ్లిళ్లు చేయలేమని చదివించలేమనే ఆలోచనలతో గుండెపోటు, ఇతర అనారోగ్య సమస్యలతో మరణించిన టీచర్లు కూడా ఉన్నారు.

పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాం : సాయి కుమార్, డిగ్రీ విద్యార్థి, నల్లగొండ

ఓయూ యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ ఫైనలియర్ పూర్తి చేశా. పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో కూడా తెలియదు. రెండుసార్లు షెడ్యూల్ విడుదల చేశారు. మొదటిసారి పరీక్షలు జరగలేదు. చదువుకుంటున్నపుడు వసతిగృహాలు, గదులలో ఉండేది. పరీక్షల కోసం వచ్చేందుకు బస్సులు లేవు. ఉండేందుకు ఇక్కడ వసతులు కూడా లేవు. అయినా, రెండోసారి పరీక్షలు నిర్వహించారు. ఎలాగోలా రాశాం. మూడు రోజులుగా రిజల్ట్స్ వస్తున్నాయి. మళ్లీ కాలేజీలు ఎప్పుడు ప్రారంభిస్తారో అర్థం కావడం లేదు. పీజీ ప్రవేశాలు, అకడమిక్ ఇయర్‌ మీద ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వీటి కోసం ఎదురుచూసే కంటే ఏదైనా జాబ్ కొట్టాలని సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్నా. ఆర్‌ఆర్‌బీ, ఎన్‌టీపీసీ కోసం ఇంటి వద్దే ఉండి చదువుకుంటున్నా.

క్లాసు రూం బోధనలు ప్రారంభించాలి : ఇటికాల రవీందర్, ఉపాధ్యాయుడు, హైదరాబాద్

రోజూ స్కూల్‌కు వెళ్లి విద్యార్థులకు చదువు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం. పిల్లలు విద్య నుంచి దూరం కాకుండా ఉండేందుకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. అసలు లక్ష్యం నెరవేరడం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్లాసులు నిర్వహిచడంతోపాటు సాధ్యమైనంత వరకు విద్యార్థి చదువుకు దూరంగా కాకుండా చూసేందుకు శ్రమించాల్సి వస్తోంది. పాఠశాలలను తొందరగా కరోనా జాగ్రత చర్యలతో ప్రారంభించాలి. షిప్టులవారీగా భౌతిక తరగతులను నిర్వహించాలి. సౌకర్యాలను కల్పించి తరగతి బోధనలను ప్రారంభించాలి.

టీచర్ వృత్తిని పరిరక్షించాలి : బయ్య శివరాజు, ప్రైవేట్ ఉపాధ్యాయుడు

లాక్‌డౌన్ రోజులలో ప్రైవేట్ ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాలని రూల్స్ ఉన్నా అమలు చేయ లేదు. అనేకసార్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసినా పట్టించుకోలేదు. భారీగా నిరసన కార్యక్రమాలు నిర్వహించినా ప్రభుత్వంలో చలనం లేదు. ఆర్థికంగా కష్టాలు ఓర్చుకోలేక, కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితులు లేక దాదాపు 20 మంది ప్రైవేట్ టీచర్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఐదారుగురు కరోనా, గుండెపోటుతో మరణించారు. ఆన్‌లైన్ క్లాసులకు ఒక్క టీచర్ సరిపోతారని మిగిలినవారిని పక్కన బెట్టారు. యాజమాన్యాలు ఫీజులు వసూలు చేశాయి. టీచర్లకు జీతాలు చెల్లించ లేదు. జీఓలు, కోర్టుల తీర్పులు ఉన్నా అమలు చేయలేదు. అత్యంత గౌరవ ప్రదమైన ఉపాధ్యాయ వృత్తికి ప్రమాదం ఏర్పడింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి.

లక్ష రూపాయలు ఫీజు చెల్లించాను : అబ్బయ్య గౌడ్, ఇంటర్ విద్యార్థి తండ్రి

మా పెద్దబ్బాయి నగరంలోని ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. లాక్‌డౌన్ తర్వాత ఆన్‌లైన్ క్లాసులు చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఏడాదికి రూ.90 వేల ఫీజు మాట్లాడుకున్నాం. ఫస్టియర్ అంతా క్లియర్ చేశాం. ఆర్థికంగా కష్టంగా ఉందని ఇపుడు సగం ఫీజులు చెల్లిస్తామన్న వినడం లేదు. చెప్పినంత కడితేనే ఆన్‌లైన్ లింక్ ఇస్తున్నారు. పది రోజుల పాటు క్లాసులు నిలిపివేశారు. మొబైల్ ఫోన్ కొన్నదే ఆన్‌లైన్ క్లాసుల కోసం. మా అబ్బాయ్ గేమ్స్ ఆడుతూ, యూట్యూబ్ వీడీయోలు చూస్తున్నాడు. క్లాసులు లేకపోవడంతో ఇంట్లో ఉండటం లేదు. దీంతో అప్పులు చేసి ఫీజు చెల్లించాను. లాక్‌డౌన్‌తో అందరి పనులు ఆగిపోయాయి. వాయిదాలలో చెల్లిస్తామన్నా కాలేజీలు వినడం లేదు.

Advertisement

Next Story

Most Viewed