ఆ డబ్బు నా కేసుల కోసం కాదు : హైకోర్టుకు సీఎస్ వివరణ

by Shyam |
High Court
X

దిశ, తెలంగాణ బ్యూరో : కోర్టు ధిక్కరణ కేసుల విచారణ కోసం రూ.58.95 కోట్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టులో గురువారం కూడా విచారణ జరిగింది. ఆ జీవోకు సంబంధించిన ఉద్దేశాన్ని ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ హైకోర్టుకు వివరణ ఇచ్చారు. ఆ జీవో ద్వారా మంజూరైన డబ్బు తనపైన నమోదైన కోర్టు ధిక్కరణ పిటిషన్ల విచారణ కోసం కాదని, భూ సేకరణ వ్యవహారానికి సంబంధించి కోర్టుల్లో దాఖలైన ధిక్కరణ పిటిషన్ల విచారణకు సంబంధించినదని అడ్వొకేట్ జనరల్ ద్వారా కోర్టుకు వివరించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని నిధుల విడుదలపై జారీ చేసిన మధ్యంతర స్టే ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

ప్రధాన కార్యదర్శి వివరణను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు జీవోలో ఏమున్నదో సరిచూసుకోవాలని అడ్వొకేట్ జనరల్‌కు సూచించింది. ఉద్దేశాలు ఎలా ఉన్నా జీవోలో లిఖితపూర్వకంగా పేర్కొన్నదేంటి అని ప్రశ్నించింది. జీవో తీరుపైన ఆశ్చర్యం వ్యక్తం చేసింది. జీవో జారీ అయ్యే ముందు న్యాయశాఖ దృష్టి పెట్టలేదా అని ఆక్షేపించింది. అడ్వొకేట్ జనరల్ జోక్యం చేసుకుని, పిటిషనర్ ఉద్దేశపూర్వకంగానే వాస్తవాలను దాచి కోర్టును తప్పుదారి పట్టించారని వ్యాఖ్యానించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన బెంచ్, ఆ జీవోను పరిశీలిస్తే ప్రభుత్వం మంజూరు చేసిన డబ్బు ఏ అవసరం కోసం ఉద్దేశించిందో స్పష్టమవుతుందని ఏజీని నిలదీసింది. జీవోను ఇప్పటికైనా ఒకసారి నిశితంగా పరిశీలించాలని హితవు పలికి తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Advertisement

Next Story