వరవరరావుకు చేయించారు.. మాకు చేయించండి

by Shamantha N |
వరవరరావుకు చేయించారు.. మాకు చేయించండి
X

ముంబయి: తలోజా సెంట్రల్ జైలులో వరవరరావుతో కలిసి ఉన్న తమకూ కరోనా టెస్టుల జరిపించాలని సహ ఖైదీలు వెర్నన్ గొంజాల్వెజ్, ఆనంద్ తేల్‌తుంబ్డేల పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన బాంబే హైకోర్టు మహారాష్ట్ర సర్కారు, ఎన్ఐఏ దర్యాప్తు ఏజెన్సీకి నోటీసులు జారీ చేసింది. అయితే, వరవరరావుకు కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. తాము వయోధికులు కావడం, దీర్ఘకాలిక వ్యాధులు కలిగిఉండటం వల్ల ఈ టెస్టులు జరిపించాలని వారు అభ్యర్థించారు. ఒకవేళ పాజిటివ్ వస్తే జైలు ఆస్పత్రిలో చికిత్స ఇస్తూ ఐసొలేషన్‌లో ఉంచాలని కోరారు.

దీనిపై ఎన్ఐఏ తరఫు న్యాయవాది అడిషనల్ సొలిసిటర్ జనరల్(ఏఎస్‌జీ) అనిల్ సింగ్ వాదిస్తూ, ప్రభుత్వ మార్గదర్శకాలకనుగుణంగానే టెస్టులు జరిపించాలని, కరోనా లక్షణాలు కనిపిస్తేనే ఈ టెస్టులు జరిపించాలని అన్నారు. వారు బెయిల్ అడగడం లేదని, కేవలం టెస్టులు మాత్రమే కోరుతున్నారని పిటిషనర్ల తరఫు కౌన్సెల్ మిహిర్ దేశాయ్ వాదించారు. తలోజా జైలులో ఓ ఖైదీ మరణించిన తర్వాత కరోనా పాజిటివ్ తేలిన విషయాన్ని గుర్తుచేస్తూ పిటిషనర్ల అభ్యర్థనలు హేతుబద్ధంగానే ఉన్నాయని పేర్కొన్న న్యాయమూర్తి ఎస్ఎస్ షిండే నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ప్రస్తుతం ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం లేదని తెలిపింది. తమకు మరింత సమయం కావాలని ఏఎస్‌జీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరగా, ఎన్ఐఏ, ప్రభుత్వానికి డివిజన్ బెంచ్ నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను 23కు వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed