మూడు రోజుల్లో పదివేల కేసులు

by Shamantha N |
మూడు రోజుల్లో పదివేల కేసులు
X

– వేగంగా పెరుగుతున్న ప్రతీ పదివేల కేసులు
– గుజరాత్‌లో సగటున ప్రతీరోజు 20 మంది మృతి

దిశ, న్యూస్ బ్యూరో: లాక్‌డౌన్ నిర్ణయంతో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చని, కొత్తగా పుట్టే పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంచనా వేశాయి. కానీ ఆశించిన ఫలితం ఒక మేరకు మాత్రమే లభిస్తోంది. ప్రతీరోజు సగటున మూడున్నర వేల చొప్పున కొత్త కేసులు పుడుతూనే ఉన్నాయి. నాలుగైదు రాష్ట్రాల్లోనే ఈ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మార్చి 29వ తేదీన దేశంలోని మొత్తం కేసుల సంఖ్య పది వేలు ఉంటే ఒకటిన్నర నెల రోజుల వ్యవధిలో అదికాస్తా ఆరు రెట్లు పెరిగింది. కేంద్ర ప్రభుత్వం ‘డబ్లింగ్’ (రెట్టింపు కావడం)కు పట్టే సమయం తగ్గిపోతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నా ప్రతీ పదివేల కేసులకు పట్టే సమయం మాత్రం బాగా తగ్గుతోంది. మొత్తం కేసుల సంఖ్య వెయ్యి ఉన్నప్పుడు అది పదివేల మార్కుకు చేరుకోడానికి ఆరు రోజులు పట్టింది. అప్పటికే మొదటి విడత లాక్‌డౌన్ అమల్లో ఉన్నందున అది ఇరవై వేల మార్కు చేరుకోడానికి ఎనిమిది రోజులు పట్టింది. కానీ అక్కడి నుంచి కేసుల వేగం బాగా పెరిగింది.

ఏప్రిల్ 22వ తేదీ నాటికి దేశం మొత్తం మీద కరోనా కేసుల సంఖ్య 20 వేలకు అటూ ఇటుగా ఉంది. కానీ అక్కడి నుంచి పదివేల కేసులు పెరిగి 30 వేల మార్కు చేరుకోడానికి ఆరు రోజులే పట్టింది. ఆ తర్వాత 40 వేల మార్కు చేరుకోడానికి ఐదు రోజులు, 50 వేల మార్కు చేరుకోడానికి 4 రోజులు, 60 వేల మార్కు చేరుకోడానికి కేవలం మూడు రోజులే పట్టింది. ప్రతీరోజు సగటున మూడున్నర వేల చొప్పున కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇందులో మహారాష్ట్ర, తమిళనాడులోనే కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటుండగా.. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, గుజరాత్ కొనసాగుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 100 మార్కు చేరుకోడానికి 45 రోజులు పట్టింది. జనవరి 30వ తేదీన దేశంలో తొలి కేసు నమోదుకాగా మార్చి 15 నాటికి వంద కేసులయ్యాయి. మార్చి నెలాఖరు వరకు కేసులు పెరగడం అదుపులోనే ఉంది. ఆ తర్వాతనే వేగం పెరిగింది.

గుజరాత్ రాష్ట్రంలో ప్రతీరోజు 20 మందికి తగ్గకుండా చనిపోతున్నారు. రోజుకు సుమారు 100 నుంచి 120 మంది కరోనా కారణంగా చనిపోతూ ఉంటే అందులో సగటున 50 మంది మహారాష్ట్రలోనే ఉంటున్నారు. ఆ తర్వాతి స్థానంలో గుజరాత్ ఉంది. మొత్తం కేసుల్లో మూడో వంతు ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నాయి. దేశంలో అత్యధిక కేసులు ఈ రాష్ట్రంలో ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ తదితరాలు ఉన్నాయి.

పెరుగుతున్న రికవరీ :

కరోనా నిర్ధారణ పరీక్షలు, పాజిటివ్‌గా ఉన్నవారికి చికిత్స, క్వారంటైన్ తదితర అంశాల్లో పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర వైద్యారోగ్య, హోం మంత్రిత్వశాఖలు తరచూ మార్గదర్శకాలను మారుస్తూ ఉన్నాయి. ఇప్పటివరకూ ఉన్న విధానం ప్రకారం పాజిటివ్ పేషెంట్ చికిత్స అనంతరం డిశ్చార్జి చేసే ముందు మరోసారి పరీక్ష చేసి నెగెటివ్ వచ్చినట్లు నిర్ధారణ చేసుకునేవారు వైద్యులు. కానీ శనివారం జారీ చేసిన మార్గదర్శకాల్లో డిశ్చార్జికి ముందు నిర్ధారణ పరీక్ష అవసరం లేదని కేంద్ర వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. కరోనా లక్షణాలు లేకపోతే ఇంటికి పంపించవచ్చని పేర్కొంది. ఈ విధానం అమల్లోకి రావడంతో ఒక్క రోజులోనే 1511 మంది డిశ్చార్జి అయ్యారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలాగూ పద్నాలుగు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందే కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు అర్థం చేయిస్తున్నారు.

భారత్ :
మొత్తం కేసులు : 62939
మృతులు : 2109
రికవరీలు : 19358

తెలంగాణ :
మొత్తం కేసులు : 1196
మృతులు : 30
రికవరీ : 751

ఆంద్రప్రదేశ్ :
మొత్తం కేసులు : 1980
మృతులు : 45
రికవరీ : 925

Advertisement

Next Story

Most Viewed