- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కవులు, కళాకారులు తమ కలాలకు పదును పెట్టాలి : మంత్రి జూపల్లి
దిశ, రవీంద్రభారతి : కళలు సమాజ అభివృద్ధి, ప్రజల్లో చైతన్యానికి ఎంతగానో దోహదం చేస్తాయని, కవులు, కళాకారులు తమ కలాలకు పదును పెట్టాలని, గళాలు విప్పాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. శుక్రవారం రవీంద్రభారతీలో నిర్వహించిన విధ్వంస జీవన విధానం - సాంస్కృతిక చైతన్య సదస్సుకు మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, మేధావులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. సంస్కృతి అంటే కేవలం ఆటపాటలు, నాట్యం, సంగీతం, సాహిత్యం, కవిత్వం, భాషకే పరిమితం కాదని, సంస్కృతి అంటే మన అస్తిత్వం, ప్రజల జీవన విధానం అని అన్నారు. సకల జలజీవచరాల్లో మానవ జన్మే ఉత్కృష్టమైందని, జీవితాన్ని సార్ధకత చేసుకోవాలని అని చెప్పారు. అయితే ప్రజల జీవన విధానం ద్వంసమైందని, ప్రజల జీవన విధానం గతి తప్పడం వల్ల నేటి సమాజంలో అనేక రుగ్మతలు, పెడధోరణులు, నిత్యం ఎన్నో ఆకృత్యాలు, సంఘటనలు చోటుకుంటున్నాయని చెప్పారు. ఆహారపు అలవాట్లు మారి అనారోగ్యం బారిన పడుతున్నారని, గుడ్డెద్దు చేలో పడ్డట్లు.. విద్యా, వైద్యం, అడంబరాలకు పోయి స్థాయికి మించి ఖర్చులు చేస్తూ... అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో మునిగితేలుతూ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారని తెలిపారు. యువత ఆన్లైన్ గేమ్స్ కు, మత్తుపదార్థాలకు, మాదక ద్రవ్యాలకు బానిసలై తమ ఉజ్జ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, కొంతమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సమాజంలో ఒక సామాజిక చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని.. ఇలాంటి తరుణంలో సమాజంలో చైతన్యం తెచ్చి, ప్రజల ఆలోచన, జీవన విధానంలో మార్పు తీసుకురావడంతో పాటు సాంస్కృతిక పునరుజ్జీవనంపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు.
ప్రజలను ఏకతాటిపైకి తేవడంతో పాటు సమాజంలో చైతన్యాన్ని తీసుకురావడంలో కళారూపాలు కీలక పాత్ర పోషిస్తాయని, సమాజాన్ని తట్టిలేపే శక్తి కవులు, కళాకారులు, సాహితీవేత్తలకే ఉందని, మీ రచనలు, పాటలు, ప్రదర్శనలు ప్రజలను ఆలోచింపజేస్తాయని వెల్లడించారు. ప్రభుత్వ సహాయసాకారాలు ఎప్పుడు ఉంటాయని భరోసానిచ్చారు. నిరుద్యోగ కళాకారుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని, ఆందోళన చెందవద్దని సూచించారు.
ప్రకృతిని ప్రేమించడం నేర్చుకోవాలి
ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ... సాంస్కృతిక పునరుజ్జీవనం, ప్రజల జీవన విధానంలో మార్పులు తేవడానికి కవులు, కళాకారులు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగం నీడన జీవిస్తున్నాం కాబట్టి ఆ రాజ్యాంగ విలువలు మనం నిర్మించబోయే సంస్కృతికి ప్రతిపాదిక కావాలని చెప్పారు. దురాలవాట్లను వదులుకోవాలని, ప్రకృతిని ప్రేమించడం నేర్చుకోవాలని, సమిష్టి జీవితాన్ని విస్తృతపరుచుకోవడం వంటి వాటితో చాలా మార్పులు తెచ్చుకోవచ్చని వ్యాఖ్యానించారు. సాంస్కృతిక విధాన రూపకల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడం అభినందనీయమని, దీనికి కవులు, కళాకారులు చోధక శక్తిగా ఉండి ముందుకు నడిపించాలని కోరారు.
కుల, మత విద్వేషం, అసహనం పెరిగిపోయింది
ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకులు కే. శ్రీనివాస్ మాట్లాడుతూ.. కుల, మత విద్వేషం, అసహనం పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తుందని అన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్ పర్సన్ డా. జి. వెన్నెల మాట్లాడుతూ... అభివృద్ధి, సంక్షేమంతో పాటు సమాజంలోని విలువల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఒకడుగు ముందుకేసి సమాజహితం కోసం కవులు, కళాకారులను భాగస్వాములను చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ అలేఖ్య పుంజలా మాట్లాడుతూ.. ప్రజలను జాగృతం చేసే పెద్ద బాధ్యత.. కవులు, కళాకారులపై ఉందన్నారు. దీనికి సంగీత నాటక అకాడమీ తోడ్పాటునందిస్తుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి జయరాజు, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, ప్రముఖ కవి, పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ, తెలంగాణ భాషా, సాంస్కృతిక సంచాలకులు డా.మామిడి హరికృష్ణ, తెలంగాణ సాహిత్య అకాడమీ సెక్రటరీ డా. బాలచారి, పద్మశ్రీ ఎక్క యాదగిరి, పద్మశ్రీ మహమ్మద్ అలీ బేగ్, పద్మశ్రీ పద్మజా రెడ్డి, పద్మశ్రీ వేలు ఆనంద స్వామి, పద్మశ్రీ ఉమామహేశ్వరి, పద్మశ్రీ మొగిలయ్య, పద్మశ్రీ గడ్డం సమ్మయ్య, పద్మశ్రీ కేతావత్ సోంలాల్, డాక్టర్ కళా కృష్ణ, రాఘవ రాజ్ భట్, సురభి వేణుగోపాలరావు, భాగవతుల సేతురాం, ఎంవీ రమణారెడ్డి, మాస్టర్ జి, చక్రాల రఘు, యాకూబ్, పొట్లపల్లి, దరువు అంజన్న, మిట్టపల్లి సురేందర్, అంతడుపుల నాగరాజు, నేర్నాల కిషోర్, తదితరులు పాల్గొన్నారు.