ప్రభుత్వ పథకాల అమలుకు సమష్టిగా కృషి చేద్దాం: బండి సంజయ్

by S Gopi |
ప్రభుత్వ పథకాల అమలుకు సమష్టిగా కృషి చేద్దాం: బండి సంజయ్
X

దిశ, తిమ్మాపూర్: ప్రభుత్వ పథకాల అమలుకు, పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు కలసి సమష్టిగా కృషి చేద్దామని కరీంనగర్ పార్లమెంట్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ మానిటరింగ్ కమిటీ సమావేశం (దిశ)లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లడమే కాకుండా గ్రామాల్లో అవగాహన సదస్సులు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కేంద్రం, రాష్ట్రం నుంచి వచ్చే నిధులకు సంబంధించి మండల, గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించి గ్రామాలకు కావాల్సిన మౌళిక సదుపాయాల కోసం నివేదిక అందజేసి నట్లయితే కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. అలాగే పథకాలు సక్రమంగా అమలు పరిచేలా కలిసికట్టుగా కృషి చేద్దామని, ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని వాటి అమలుకు సూచనలు, సలహాలు ఇవ్వాలని అన్నారు. అనంతరం వివిధ శాఖల పరిధిలో అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.

జిల్లా కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ.. జిల్లాలో కరోనా కట్టడికి గట్టి చర్యలు తీసుకున్నామని, కోవిడ్ మొదటి, రెండవ డోసు వ్యాక్సినేషన్ ను జిల్లాలో 100 శాతం పూర్తి చేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచామని తెలిపారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను, సహకరించిన జిల్లా ప్రజా పరిషత్, పంచాయతీ శాఖ అధికారులను అభినందించారు. కోవిడ్ ను కట్టడి చేయడంతోపాటు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కరోనాతో చేరేవారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని, ఆక్సిజన్ కు ఇబ్బంది లేకుండా జిల్లాలో రెండు ఆక్సిజన్ ప్లాంట్ లు ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో కరీంనగర్ లో స్మార్ట్ సిటీ పనులను వేగవంతం చేశామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను జిల్లాలో సక్రమంగా అమలు చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్, గరిమ అగర్వాల్, డీఆర్డీఓ శ్రీలత, జెడ్పీ డిప్యూటీ సీఈఓ పవన్, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జువేరియా, జిల్లా సంక్షేమ అధికారి పద్మావతి, జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ రత్నమాల, పరిశ్రమల శాఖ జీఎం నవీన్, పశుసంవర్ధక శాఖ అధికారి నరేందర్ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed