వివేకానందరెడ్డి హత్య ఇంటి దొంగల పనే.. ఎంపీ టికెట్ ఇవ్వొద్దన్నందుకే..

by Disha News Desk |
వివేకానందరెడ్డి హత్య ఇంటి దొంగల పనే.. ఎంపీ టికెట్ ఇవ్వొద్దన్నందుకే..
X

దిశ, ఏపీ బ్యూరో : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఇటీవల చార్జిషీట్ కూడా దాఖలు చేసింది. అయితే చార్జిషీట్‌లో ఎంపీ అవినాశ్ రెడ్డి పేరు ఉండటం రాజకీయంగా దుమారం రేపుతోంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఇంటి దొంగల పనేనని టీడీపీ రాద్ధాంతం చేస్తుంది. వైఎస్ వివేకాను హత్య చేయించి ఆ తర్వాత దాన్ని గుండె నొప్పిగా ప్రచారం చేయించింది ఎవరో ప్రజలకు తెలుసునని టీడీపీ ఆరోపిస్తోంది. అంతేకాదు వివేకా హత్య జరిగినప్పుడు ఎలాంటి సాక్ష్యాలు లభించకుండా రక్తాన్ని ఎంపీ అవినాశ్ రెడ్డి తుడిచి వేయించారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఈ హత్యకేసులో సీబీఐ విస్తుపోయే వాస్తవాలను చార్జిషీట్‌‌లో పొందుపరిచినా వైసీపీ నేతలు నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

సజ్జల సన్నాయి నొక్కులు ఆపు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ నేతల పాత్ర ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హత్యపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసిందని చెప్పుకొచ్చారు. అయితే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నిస్సిగ్గుగా సీబీఐ విచారణనే తప్పుపడుతున్నారని మండిపడ్డారు. వివేకా హత్య జరగడానికి ప్రధాన కారణం కడప ఎంపీ టికెట్ వివాదం అని చెప్పుకొచ్చారు. కడప ఎంపీ టికెట్ అవినాశ్ రెడ్డికి ఇవ్వవద్దని వివేకానందరెడ్డి, జగన్ వద్ద పట్టుబట్టారు. తీవ్ర ఆగ్రహానికి లోనైన అవినాశ్ రెడ్డి అక్కసుతో ఎర్రగంగిరెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, వివేకా మాజీడ్రైవర్ దస్తగిరితోకలిసి వివేకానందరెడ్డిని హతమార్పించాడని సీబీఐ చార్జిషీట్‌లో పేర్కొంటే దాన్ని తప్పుపడుతూ సలహాదారు సన్నాయినొక్కులు నొక్కడం సిగ్గుచేటని విమర్శించారు.

ఈ హత్యకేసులో వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్నిజీర్ణించుకోలేకనే అవినాశ్ రెడ్డి ప్రోద్భలంతో దేవిరెడ్డి శంకర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడని బోండా ఉమా ఆరోపించారు. దస్తగిరి అప్రూవర్ గా మారడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేస్తే, దాన్ని కూడా న్యాయస్థానం మొన్ననే కొట్టేసిందని గుర్తు చేశారు. హత్య కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచడం, ఢిల్లీ నుంచి చౌరాసియా అనే ప్రత్యేకాధికారి పులివెందులకు రావడంతో తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయి అని బోండా ఉమా కీలక వ్యాఖ్యలు చేశారు.

తప్పు చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు

'మార్చి 19, 2019 నాడు వివేకానందరెడ్డి హత్యోదంతంపై సీబీఐ విచారణ జరిపించాలని నాడు డిమాండ్ చేసిన జగన్ నేడు ఎందుకు వద్దంటున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి. అలాగే ఎన్నికల వేళ వివేకా హత్య గురించిన కథనాలు, వార్తలు బయటకు రాకూడదంటూ హైకోర్టుని ఆశ్రయించి ఆర్డర్ ఎందుకు తెచ్చుకున్నారు? ఇవన్నీ ఎంపీ అవినాశ్ రెడ్డిని వివేకా హత్య కేసు నుంచి తప్పించేందుకు' అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల పేరుతో ఢిల్లీకి వెళ్లి వివేకా హత్య కేసు నుంచి తనను, తన పార్టీ వారిని బయటపడేయాలని ముఖ్యమంత్రి కేంద్రానికి మెురపెట్టుకున్నాడని ఇది నిజం కాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పగలరా అని సవాల్ విసిరారు. వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన కుమార్తె సునీతారెడ్డి హైకోర్టును ఆశ్రయించిందంటే జగన్ సర్కార్‌పై నమ్మకం లేకనే కదా అని ప్రశ్నించారు. అయినప్పటికీ సిగ్గులేకుండా ప్రభుత్వ సలహాదారు సజ్జల ఇంకా సీబీఐని తప్పుపడుతూ బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయ త్నిస్తున్నాడని ధ్వజమెత్తారు.

ఎంపీ అవినాశ్‌ను సీబీఐ అదుపులోకి తీసుకోవాలి

వివేకానందరెడ్డి హత్య జరిగిన వెంటనే ఎంపీ అవినాశ్ రెడ్డి అక్కడకు ఎందుకు వెళ్లాడు.. పనిమనిషి తో రక్తపు మరకలు ఎందుకు తుడిపించాడు. వైఎస్ జగన్ మామ గంగిరెడ్డి ఆస్పత్రి నుంచే కాంపౌండర్‌ను పిలిపించి మృతదేహాన్ని శుభ్రంచేయించి ఎందుకు కుట్లు వేయించారో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పగలరా అని ప్రశ్నించారు. హత్య జరిగిన పావు గంటలో వివేకా ఇంటికి వెళ్లిన ఎంపీ అవినాశ్ రెడ్డి రక్తపు మరకలు తుడిపేయించి, ఇతరత్రా ఆధారాలు మాయంచేసి, గుండెపోటుతో చనిపోయాడనిచిత్రీకరించాడని సీబీఐ చార్జిషీట్‌లో స్పష్టంగా పేర్కొంటే సజ్జల సీబీఐని ప్రశ్నించడం దుర్మార్గమన్నారు. వివేకాహత్యను గుండెపోటుగా తన చానెల్‌లో ప్రచారం చేయించిన సీఎం జగన్, ఆ తర్వాత అవినాశ్ రెడ్డిని కాపాడేందుకు నాటి సీఎం చంద్రబాబు, లోకేశ్‌లపై తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు.

అంతేకాదు ఎంపీ అవినాశ్ రెడ్డి జిల్లా ఎస్పీ కి ఫోన్ చేసి వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడని, పోలీసుల విచారణ అవసరం లేదని, తామే అన్ని కార్యక్రమాలు ముగిస్తామని ఎందుకు చెప్పారో చెప్పాలని నిలదీశారు. ఈ కేసులో సీబీఐ దూకుడు తగ్గించడానికి సీఎం జగన్ పదేపదే ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ, అమిత్ షాలకు మొర పెట్టుకుంటున్నారని ఆరోపించారు. వివేకా హత్య కేసు తన మెడకు చుట్టుకోకుండా చూడాలని వారి వద్ద మోకరిల్లాడని ఆరోపించారు. వివేకా హత్యను ఎన్నికల్లో తన గెలుపుకోసం వాడుకొని, ముఖ్యమంత్రి అయ్యాక తన అధికారాన్ని ఉపయోగించి, అడుగడుగునా విచారణను జగన్ అడ్డుకుంటున్నారని ఈ విషయం ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. సీబీఐ వివేకా హత్య కేసు విచారణలో తక్షణమే ఎంపీ అవినాశ్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించాలి. ఆ తర్వాత సీఎం వైఎస్ జగన్‌ ప్రమేయంపై కూడా విచారణ చేపట్టాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా మహేశ్వరరావు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed