ఆ లబ్ధిదారులకు న్యాయం జరిగేనా ?

by samatah |   ( Updated:2022-03-17 09:52:14.0  )
ఆ లబ్ధిదారులకు న్యాయం జరిగేనా ?
X

దిశ, తొర్రూరు (పెద్దవంగర) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబల్ బెడ్ రూమ్ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే పెద్దవంగర మండల పరిధిలోని అవుతాపురం గ్రామంలో లబ్ధిదారుల ఎంపిక ఈ విషయంలో అవకతవకలు జరుగుతున్నట్లు గ్రామ‌స్థులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి 40 డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూర‌య్యాయి. నిర్మాణం కూడా పూర్తి కావ‌డంతో పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీకి సంబంధించి మొత్తం 161 మంది నుంచి ముందు ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించిన రెవెన్యూ అధికారులు.. రెండు ఎకరాల భూమి కలిగి ఉన్నవారు, గతంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధి పొందినవారు, ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న 81 మందిని ప‌క్కన పెట్టేశారు. మిగితా 80 మంది నుంచి ల‌బ్ధిదారుల‌ను ఎంపిక చేసేందుకు ఈ నెల 7న గ్రామ సభలో డ్రా తీసేందుకు ఏర్పాట్లు చేశారు.

చ‌క్రం తిప్పిన స్థానిక లీడ‌ర్లు..

డ్రా తీయ‌కుండానే ల‌బ్ధిదారుల‌ను ఎంపిక చేప‌ట్టాల‌ని ఒక‌రిద్దరు స్థానిక ప్రజాప్రతినిధులు వ్యూహత్మకంగా వ్యవ‌హ‌రించారు. 50మందితో ఓ లిస్టును కూడా త‌యారు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఆ పేర్లను కూడా గ్రామ స‌భ‌లో చ‌దివి వినిపించిన‌ట్లుగా గ్రామ‌స్థులు తెలిపారు. 30 మందికి సంబంధించి వివిధ ర‌కాల అన‌ర్హత‌ల‌ను చూపుతూ ప‌క్కన పెట్టిన‌ట్లుగా తెలుస్తోంది. అయితే ఇందుకు కొంత‌మంది ద‌ర‌ఖాస్తుదారుల నుంచి కూడా వ్యతిరేక‌త వ‌చ్చింది. నిబంధ‌న‌ల ప్రకారం.. డ్రా ప‌ద్ధతిలోనే ఎంపిక జ‌ర‌గాల‌ని బ‌లంగా వాదిస్తూ రెవెన్యూ అధికారుల‌ను నిల‌దీశారు. అయితే ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి.. ల‌బ్ధిదారుల ఆందోళ‌న‌ల మ‌ధ్య ఎంపిక ప్రక్రియ‌ను అధికారులు వాయిదా వేశారు. అయితే దాదాపు ప‌ది రోజులు గ‌డుస్తున్నా.. ల‌బ్ధిదారుల ఎంపిక‌పై స్పష్టత క‌రువైంది. జాబితాను ఫైన‌ల్ చేసే అవ‌కాశ ముంద‌ని తెలుస్తుండ‌టంతో ద‌ర‌ఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేత‌ల ఇష్టానికి జాబితాను త‌యారు చేసి ఎలా ఆమోదింప జేస్తారంటూ మండిప‌డుతున్నారు.

డ్రా ద్వారానే లబ్ధిదారుల ఎంపిక చేస్తాం : రమేష్ బాబు, తహశీల్దార్ - పెద్దవంగర

ఔతాపురంలో డ‌బుల్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక‌లో ఏర్పడిన స్తబ్ధత‌పై త‌హ‌సీల్దార్ నుంచి వివ‌రాలు తెలుసుకునే ప్రయ‌త్నం దిశ చేసింది. త‌హ‌సీల్దార్‌ తెలిపిన వివ‌రాలు ఆయ‌న మాట‌ల్లోనే.. ఇటీవలే పెద్దవంగర తహశీల్దార్‌గా బాధ్యతలు చేపట్టాను. గత రెండు సంవత్సరాల క్రితమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం మీసేవ ద్వారా లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవడం, 80 మంది అర్హుల జాబితాను సిద్ధం చేయడం జరిగింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డ్రా ద్వారానే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడతాను.

Advertisement

Next Story

Most Viewed