ఇండియాను మంద‌లించిన అమెరికా.. దానిపైన‌ నిఘా పెట్టిందంట‌!

by Sumithra |
ఇండియాను మంద‌లించిన అమెరికా.. దానిపైన‌ నిఘా పెట్టిందంట‌!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః అందితే జుట్టు అంద‌క‌పోతే కాళ్లు అన్న‌ట్లు ఉక్రెయిన్ యుద్ధంలో ఇండియా త‌ట‌స్థ వైఖ‌రిపై అమెరికా ముందు నుండి గుర్రుగానే ఉంటోంది. తాను చెప్పిన మాట విన‌క‌పోతే ఎలాంటి విమ‌ర్శ‌లు చేయ‌డానికైనా తెగించే త‌త్వం అమెరికాకు అధికారంతో పెట్టిన విద్య‌. ఈ క్ర‌మంలోనే తాజాగా అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ ఇండియాను వేలెత్తి చూపారు. భార‌త ప్ర‌భుత్వంలోని కొంతమంది అధికారుల వ‌ల్ల‌ భారతదేశంలో "మానవ హక్కుల ఉల్లంఘనలు" పెరిగాయ‌నీ, ఈ ప‌రిణామాన్ని యునైటెడ్ స్టేట్స్ పర్యవేక్షిస్తోందని, ప్రత్యక్షంగానే మందలించారు. ఇరుదేశాల భాగ‌స్వామ్య విలువ‌లైన మాన‌వ హ‌క్కుల అంశంలో భార‌తీయ భాగ‌స్వాముల‌తో క్ర‌మం త‌ప్ప‌కుండా క‌లిసి ప‌నిచేస్తామ‌ని అన్నారు.

కొంతమంది ప్రభుత్వ అధికారులు, పోలీసులు, జైలు అధికారుల వ‌ల్ల‌ మానవ హక్కుల ఉల్లంఘ‌న‌లు పెరగడంతో పాటు భారతదేశంలో ఇటీవలి పరిణామాలను అమెరికా పర్యవేక్షిస్తుంద‌ని బ్లింకెన్ చెప్పారు. సోమవారం అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌, భార‌త విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో ఆయ‌న పాల్గొన్నారు. అయితే, మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న గురించి బ్లింకెన్ అంత‌కుమించి ఎలాంటి వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు. ఇక, త‌ర్వాత రాజ్‌నాథ్ సింగ్‌, జైశంక‌ర్‌లు చేసిన బ్రీఫింగ్‌లో బ్లింకెన్ లేవ‌నెత్తిన మానవ హక్కుల సమస్యపైన ఎలాంటి వ్యాఖ్యలు చేయ‌క‌పోవ‌డం విశేషం.

అయితే, భార‌తదేశంలో మానవ హక్కుల ఉల్లంఘ‌న గురించి నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ప్ర‌శ్నించ‌కుండా అమెరికా ప్రభుత్వం మౌనంగా ఎందుకుంటుందని అమెరికా ప్రతినిధి ఇల్హాన్ ఒమర్ ప్రశ్నించిన కొద్ది రోజుల తర్వాత బ్లింకెన్ ఈ వ్యాఖ్యలు చేయ‌డం మ‌రింత చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యింది. ఇండియాలో బిజెపి ప్ర‌భుత్వం గ‌ద్దెనెక్కిన త‌ర్వాత ప‌లు సంచ‌ల‌న నిర్ణ‌యాలు వెలువ‌డ్డాయి. ముఖ్యంగా US Monitoring "Rise In Human Rights Abuses" In India: Antony Blinkenదేశంలోని అనేక రాష్ట్రాలు రాజ్యాంగపరంగా ప్ర‌జ‌ల‌ విశ్వాసాల‌కు సంబంధించిన‌ స్వేచ్ఛను సవాలు చేసే వ్యతిరేక చట్టాలు ఆమోదించ‌గా, ఇంకొన్ని ప్ర‌స్తుతం ప‌రిశీల‌న‌లో ఉన్నాయి.

2019లో వివాదాస్ప‌ద‌ పౌరసత్వ చట్టాన్ని ఆమోదించడం నుండి అదే సంవత్సరంలో, ముస్లిం మెజారిటీ ప్రాంతంలో పూర్తిస్థాయి అధికారాన్ని చేజిక్కించుకోడానికి జమ్మూ కాశ్మీర్‌ ప్రత్యేక హోదాను రద్దు చేయ‌డం, అలాగే, కొన్ని రోజులుగా బిజెపి పాలిత కర్ణాటక రాష్ట్రంలో ముస్లిం ఆచారాల‌నే కాకుండా సామాజికంగా వారిపై ప‌లు నిషేధాలు విధించ‌డం వంటి వివిధ అంశాలు బ్లింకెన్ మాట్లాడిన విమ‌ర్శ‌ల‌కు ఊత‌మిస్తున్నాయి.

Advertisement

Next Story