నష్టాలనుంచి గట్టెక్కదెలా.. TS ఆర్టీసీలో మల్లగుల్లాలు?

by GSrikanth |   ( Updated:2022-04-17 00:00:33.0  )
నష్టాలనుంచి గట్టెక్కదెలా.. TS ఆర్టీసీలో మల్లగుల్లాలు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: తీవ్ర నష్టాలు, అప్పుల్లో కూరుకుపోతున్న తెలంగాణ ఆర్టీసీ కీలక సమావేశానికి సిద్ధమైంది. దాదాపు నాలుగేండ్ల నుంచి నిర్వహించని బోర్డు మీటింగ్‌ను ఈ నెల 22న నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎజెండా అంశాలను సైతం సిద్ధం చేస్తున్నారు. ఆర్టీసీకి సంబంధించిన కీలకమైన నిర్ణయాలు ఉండటంతో.. బోర్డు మీటింగ్​ఎజెండాను రహస్యంగా దాచి పెడుతున్నారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్​అధ్యక్షతన వైస్​చైర్మన్, ఎండీ వీసీ సజ్జనార్, సభ్యులు రవాణా శాఖ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు, ఎల్​ఈటీఎఫ్​సెక్రెటరీ, జీహెచ్ఎంసీ కమిషనర్, రవాణా శాఖ కమిషనర్, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎంఓఆర్​టీ సెక్రెటరీతో బోర్డు సమావేశం నిర్వహిస్తున్నారు.

ఏం చేయడం?

నాలుగేండ్ల తర్వాత జరుగుతున్న ఆర్టీసీ బోర్డు మీటింగ్‌లో పలు అంశాలు ప్రాధాన్యతగా మారాయి. ఆర్టీసీ చార్జీలు పెంచేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వాటిని సీఎం కేసీఆర్​ఆమోదానికి పంపించారు. ఈ చార్జీల పెంపు ప్రక్రియ పెండింగ్‌లో ఉండగానే.. ఆర్టీసీ యాజమాన్యం బాదుడు షురూ చేసింది. ముందుగా చిల్లర సమస్య అంటూ చార్జీలను రౌండ్​ ఫిగర్​ చేసింది. దీంతో పల్లె వెలుగు, ఆర్డినరీ బస్సుల్లో కొంత తగ్గినా.. మిగిలిన సర్వీసుల్లో సగటున రూ. 5 వరకు పెరిగాయి. ఆ తర్వాత సర్వీస్​ చార్జీ, మెయింటెనెన్స్ సెస్ అంటూ పలు రకాల వడ్డనలు చేసింది. అంతేకాకుండా డీజిల్ సెస్‌ను తెరపైకి తీసుకువచ్చింది. పెరుగుతున్న డీజిల్ ధరలకు అనుగుణంగా డీజిల్ సెస్ పెరుగుతుందని ఆర్టీసీ ప్రకటించింది. ప్రకటించిన తర్వాత నుంచి కనీసం రూ. 5నుంచి రూ. 10 వరకు టికెట్​ ధరలు పెరిగాయి. ఆ తర్వాత రిజర్వేషన్ సెస్ తీసుకొచ్చారు.

ప్రస్తుతం డీజిల్ సెస్‌ను అమల్లోకి తీసుకొచ్చిన ఆర్టీసీ యాజమాన్యం.. డీజిల్ ధరలు పెరిగితే చార్జీలను కూడా పెంచుతోంది. దీనిపై ఎలాంటి ప్రకటన చేయదు. రాత్రికి రాత్రే పెరిగిన చార్జీలు అమల్లోకి రానున్నాయి. మరోవైపు ఆర్టీసీ బస్​టికెట్​ ధరలు పెంచాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. వాటిని కూడా త్వరలోనే సైలెంట్‌గా అమలు చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే బోర్డు మీటింగ్​ప్రాధాన్యతగా మారింది. నాలుగేండ్ల నుంచి బోర్డు సమావేశం నిర్వహించలేదు. దీంతో ఇప్పుడు నిర్వహించే సమావేశంలో ప్రజా రవాణాను మరింత భారం చేసే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అటు రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడుతలో 17 బస్​ డిపోలను ఎత్తివేసేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. కొన్ని డిపోల్లో నుంచి బస్‌లను కూడా ఇతర డిపోలకు సర్దుబాటు చేశారు. సిబ్బందిని సైతం తగ్గించారు. ఈ నేపథ్యంలో డిపోలను ఎత్తివేసేందుకు బోర్డు సమావేశంలో చర్చ పెట్టనున్నారు.

వీఆర్ఎస్ కూడా?

ఆర్టీసీ కార్మికుల వీఆర్ఎస్‌పై యాజమాన్యం ఇప్పటికే అడుగులేసింది. డిపోల వారీగా వీఆర్ఎస్‌కు సిద్ధంగా ఉన్న వివరాలు తీసుకుంది. ఆర్టీసీలో నష్టాలు, కష్టాలను సాకుగా చూపిస్తూ కార్మికులను కుదిస్తున్న యాజమాన్యం.. పనిచేస్తున్న వారిపైనా ఒత్తిళ్లు తీసుకొస్తోంది. 14 గంటల డ్యూటీలను వేస్తున్నారు. ఇలా స్వచ్ఛందంగా వెళ్లిపోయేలా పని చేయిస్తున్నారు. ఇప్పటికే డిపోల వారీగా వీఆర్ఎస్‌కు సంతకాలు పెట్టిన వారిని ఇంటికి పంపించేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై కూడా బోర్డు సమావేశంలో నిర్ణయించనున్నారు. వీఆర్ఎస్ తీసుకుంటే ఇప్పటి వరకు ఉన్న అంచనా ప్రకారం రూ. 200 కోట్ల వరకు సర్దుబాటు చేయాల్సి ఉంటోంది. వాటిని సమకూర్చుకునేందుకు డిపోలకు సంబంధించిన స్థలాలను లీజుకు ఇవ్వడమా, అమ్మడమా అనేది కూడా బోర్డు సమావేశంలో తేల్చనున్నారు. మరోవైపు స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ స్కీంను ఎత్తివేసేందుకు ఆర్టీసీ దాదాపుగా సిద్ధమైంది. కార్మికులు ప్రతినెలా దాచుకున్న సొమ్మును ఇప్పటికే వాడుకున్న ఆర్టీసీ.. ఇక నుంచి ఎస్ఆర్ బీఎస్ కొనసాగించడం కష్టమేనంటోంది. దీంతో ఎస్ఆర్ బీఎస్‌ను ఎత్తేయనున్నారు.

Advertisement

Next Story