'ఫ్లెక్సీల కోసం కొట్లాడుతున్న టీఆర్ఎస్, బీజేపీకి కొంచమైన సిగ్గుండాలి'

by Nagaya |
ఫ్లెక్సీల కోసం కొట్లాడుతున్న టీఆర్ఎస్, బీజేపీకి కొంచమైన సిగ్గుండాలి
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రశ్నించడంతో పాటు రాష్ట్ర మనుగడను సైతం విమర్శించారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఎందుకు నిర్వహిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు అర్థం కావడం లేదని అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. గతంలో కాకినాడ సభలో ఒక్క ఓటుకు రెండు రాష్ట్రాలు అని ప్రకటించిన బీజేపీ ఆ తర్వాత ప్రజలను నయవంచన చేసిందని అన్నారు. ఎంత కష్టమైనప్పటికీ సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి చూపించిందని చెప్పారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను ఇచ్చే విషయంలో సోనియా గాంధీ కృషి ఎంతో ఉందని అయినా సోనియాను పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని మోడీ తప్పుబట్టారని అన్నారు. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు కావొస్తున్నా చిల్లి గవ్వ ఇవ్వని ప్రధాని మోడీ ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నారని ప్రశ్నించారు.

తెలుగు వాళ్లను అవమానించారు

ఉత్తర భారత దేశానికి ఇస్తున్న ప్రధాన్యత దక్షిణ భారత్‌కు ఇవ్వడంలో ప్రధాని మోడీ విఫలం అవుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేబినెట్ శాఖల కేటాయింపులో దక్షిణ భారత దేశానికి ప్రాధాన్యత లేదని అన్నారు. నార్త్ ఇండియన్స్‌కు కీలక శాఖలు కట్టబెట్టి సౌత్ ఇండియన్స్‌కు నామమాత్రపు శాఖలు కేటాయించారని చెప్పారు. ఏపీ నుండి ఒక్క మంత్రి కూడా లేరని తెలంగాణ నుండి ఉన్న ఒక్క మంత్రి కిషన్ రెడ్డి ఉన్నా ఉపయోగం లేదని ఎద్దేవా చేశారు. వెంకయ్యనాయుడిని అవమానకర రీతిలో కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించారని ఆరోపించిన రేవంత్.. ఉప రాష్ట్రపతి పదవికాలం పూర్తయ్యాక వెంకయ్యను ఇంటికి సాగనంపే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తెలుగు వారిని అన్ని రంగాల్లో తొక్కివేశారని వ్యాపార, రాజకీయ రంగాల్లో అథమ స్థాయిలో చూస్తున్నారని మండిపడ్డారు.

కొంచమైన సిగ్గుండాలి

అనేక విషయాల్లో రాష్ట్రానికి అన్యాయం చేసిన నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఈ ఏడున్నరేళ్లు కేసీఆర్ వంతపాడారని విమర్శించారు. ఇన్నాళ్లు సహకరించిన కేసీఆర్ ఇవాళ బీజేపీతో ఫైటింగ్ చేస్తున్నట్లు నటించేందుకు హైదరాబాద్‌లో నాలుగు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి చిల్లర పంచాయతీకి తెరలేపాడని మండిపడ్డారు. టీఆర్ఎస్, బీజేపీ మధ్య నడుస్తున్న ఫ్లెక్సీ వార్‌తో తెలంగాణ ప్రజల కడుపు నిండుతుందా? ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెటుతుందా అని ప్రశ్నించారు. ఫ్లెక్సీల కోసం కొట్లాడుతున్న టీఆర్ఎస్, బీజేపీకి కొంచమైన సిగ్గుండాలని దుయ్యబట్టారు.

Advertisement

Next Story