యాదాద్రి అద్భుత ఘట్టం ఆవిష్కృతం నేడే.. కుటుంబ సమేతంగా హాజరుకానున్న సీఎం

by Satheesh |   ( Updated:2022-03-28 02:22:29.0  )
యాదాద్రి అద్భుత ఘట్టం ఆవిష్కృతం నేడే.. కుటుంబ సమేతంగా హాజరుకానున్న సీఎం
X

యాదాద్రిలో సోమవారం ఉదయం 11.55 గంటలకు అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానున్నది. పునర్నిర్మాణం పూర్తై కృష్ణశిలల రాజసం.. ఆహ్లాదం పంచే ప్రకృతితో కొంగొత్త సొబగులు అద్దుకున్న దివ్యధామం ఇక భక్తులకు అందుబాటులోకి రానున్నది. 2016 ఏప్రిల్ 21 నుంచి బాలాలయంలోనే సాగిన పూజలు ఇక గర్భాలయంలోకి మారనున్నాయి. మహాకుంభ సంప్రోక్షణ ఘట్టం పూర్తి చేసి సాయంత్రం 4 గంటల తర్వాత శ్రీలక్ష్మీనృసింహుడి దర్శనానికి అవకాశం కల్పించేందుకు అధికారులు, అర్చకులు, పండితులు ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానికి కుటుంబసమేతంగా హాజరు కానున్నారు.

దిశ ప్రతినిధి, నల్లగొండ: కోటి కండ్లతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాదాద్రి శ్రీలక్ష్మీనృసింహుడి దర్శన భాగ్యానికి వేళయింది. వారం రోజులుగా నిర్వహిస్తున్న పంచకుండాత్మక యాగం ఆదివారంతో ముగిసింది. దీంతో సోమవారం ఉదయం ఆలయ ఉద్ఘాటన నిర్వహిస్తారు. ఉదయం 11.55 గంటలకు మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం ప్రారంభంకానుంది. అనంతరం ప్రత్యేక పూజలు, వైదిక కార్యక్రమాలు అత్యంత వైభవోతంగా జరుగుతాయి. సాయంత్రం 4 గంటల నుంచి స్వయంభువుల దర్శనానికి భక్తులకు అనుమతినిస్తారు. అంత కన్నా ముందు సోమవారం ఉదయం 9 గంటలకు మహా పూర్ణాహుతి, 9.30 గంటలకు బాలాలయం నుంచి ప్రధానాలయం వరకు శోభాయాత్ర జరుగుతుంది. 11:55 గంటలకు మహా కుంభసంప్రోక్షణ కార్యక్రమాలుంటాయి. ప్రధానాలయం పునర్నిర్మాణం దృష్ట్యా 2016 ఏప్రిల్‌ 21 నుంచి బాలాలయంలోనే భక్తులకు దర్శనాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే. సోమవారంతో ఇక్కడి దర్శనాలకు తెర పడనుంది.

ఒకేసారి 92 మంది రుత్విక్కులతో యాగ జలాలు..

ప్రధానాలయ దివ్య విమానంపై శ్రీ సుదర్శన స్వర్ణ చక్రానికి సీఎం కేసీఆర్‌ సమక్షంలో యాగ జలాలతో సంప్రోక్షణ పర్వానికి శ్రీకారం చుడతారు. ఆలయం చుట్టూ ఉన్న ఆరు రాజగోపురాలపైనా స్వర్ణకలశాలకు మహాకుంభ సంప్రోక్షణను ఒకేసారి 92 మంది రుత్వికులు నిర్వహిస్తారు. సప్తాహ్నిక దీక్షతో వారం నుంచి బాలాలయంలో కొనసాగించిన పంచకుండాత్మక మహాయాగంలో పూజించిన నదీజలాలను మహాకుంభంలోకి చేర్చి ఆ పుణ్య జలాలతో పాటు శ్రీస్వామి, అమ్మవార్ల ప్రతిష్ఠామూర్తులతో శోభాయాత్ర చేపడతారు. పునర్నిర్మితమైన ప్రధానాలయం చుట్టూ ప్రదక్షిణ నిర్వహిస్తారు. ఇందులో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పాల్గొంటారు. విమానం, గోపురాల శిఖరాలపై కలశ సంప్రోక్షణ కైంకర్యాన్ని కొనసాగిస్తారు. అనంతరం ప్రధానాలయంలోకి వేద, మంత్ర పఠనాల మధ్య ప్రవేశించి ఉపాలయాలలో ప్రతిష్ఠామూర్తులకు మహా ప్రాణన్యాసం నిర్వహిస్తారు. ప్రథమారాధనలు చేపడతారు. మహాకుంభ సంప్రోక్షణ పర్వం అనంతరం గర్భాలయంలోని స్వయంభువుల దర్శనాలకు తెరతీస్తారు. కొండ మీద విష్ణు పుష్కరిణిని ఇప్పటికే గోదావరి జలాలతో నింపారు. ఇదిలావుంటే.. ఇప్పటికే దివ్య విమానంపై వివిధ రంగులతో కూడిన పతాకాలు ఆవిష్కరించారు.

కుటుంబ సమేతంగా హాజరుకానున్న సీఎం..

యాదాద్రి ఆలయ పున:ప్రారంభానికి సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా హాజరుకానున్నారు. యాదాద్రిలోని ప్రెసిడెన్షియల్ సూట్‌లో సీఎం కేసీఆర్ బస చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. సోమవారం మొదటగా బాలాలయంలో జరిగే పూర్ణాహుతితోపాటు ప్రతిష్టామూర్తుల శోభాయాత్రలోనూ సీఎం, ఆయన కుటుంబ సభ్యులు భాగస్వాములు అవుతారని సమాచారం. గర్భాలయంలోని మూలవరులకు తొలిపూజ చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకుంటారు. అనంతరం యాదాద్రి క్షేత్రాభివృద్దికి విశేషంగా కృషి చేసిన వారందరినీ సీఎం కేసీఆర్ ఆలయ మాడ వీధుల్లో సన్మానిస్తారు. యాదాద్రి ఆలయ పున:ప్రారంభానికి సీఎం కేసీఆర్‌తో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనున్నారు.

కంచి తరహాలో బంగారు బల్లి..

యాదాద్రి క్షేత్రానికి ప్రపంచ స్థాయి గుర్తింపును తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి తహతహలాడింది. తాజాగా మరో ప్రత్యేకతనూ జోడించనున్నారు. కంచి తరహాలో బంగారు బల్లిని ప్రధానాలయంలో ఏర్పాటుచేయనున్నారు. దీంతోపాటు 12 రాశుల బంగారు రూపాలను అమర్చనున్నారు. రాతి గోడలకు అమర్చే శంఖు, చక్రం, కలశం, రాజసింహ, హంస పుత్తడి తొడుగుల బిగింపు మొదలుపెట్టారు. ప్రధానాలయంలో దర్శనాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులను కొండ కింది నుంచి కొండపైకి చేర్చడానికి 32 మినీ బస్సులకు యాదాద్రి దర్శినిగా రూపురేఖలు మార్చారు.

20వేలకు చేరుకోనున్న భక్తుల సంఖ్య..

ఆరేళ్లలో బాలాలయంలో నరసింహస్వామిని.. సాధారణ రోజుల్లో 8 వేల మంది వరకు దర్శించుకున్నారు. యాదాద్రి ఆలయ పున:ప్రారంభం తర్వాత ఆ సంఖ్య కాస్త 20 వేలకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే సెలవు రోజులు, ప్రత్యేక సందర్భాల్లో దర్శించుకునే వారి సంఖ్య 30 వేల నుంచి 50 వేల వరకు పెరిగే అవకాశముంది. మరోవైపు యాదాద్రిలోనూ తిరుమల తరహాలో వీఐపీ, బ్రేక్ దర్శనాలకు వీలు కల్పించనున్నట్టు ఇప్పటికే యాడా అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed