ఆ పోలీస్ స్టేష‌న్‌లో నిందితుడిపై థ‌ర్డ్ డిగ్రీ ప్రయోగం..?

by S Gopi |   ( Updated:2022-03-11 16:53:00.0  )
ఆ పోలీస్ స్టేష‌న్‌లో నిందితుడిపై థ‌ర్డ్ డిగ్రీ ప్రయోగం..?
X

దిశ ప్ర‌తినిధి,వ‌రంగ‌ల్ / బ‌య్యారం: మహబూబాబాద్ జిల్లా బ‌య్యారం స్టేష‌న్‌లో బానోతు ముర‌ళి అనే నిందితుడిపై ఎస్సై ర‌మాదేవి థ‌ర్డ్ డిగ్రీ ప్రయోగించిన‌ట్లుగా తెలుస్తోంది. భార్యాభ‌ర్తల మ‌ధ్య త‌లెత్తిన వివాదం కొద్దిరోజుల క్రితం స్టేష‌న్‌కు చేరింది. అయితే కేసు న‌మోదు చేసి విచార‌ణ చేప‌డుతున్న ఎస్సై ర‌మాదేవి శుక్రవారం బానోతు ముర‌ళిని స్టేష‌న్‌కు పిలిచి విచార‌ణ చేప‌ట్టింది. ఈ క్రమంలోనే థ‌ర్డ్ డిగ్రీకి పాల్పడిన‌ట్లుగా బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ముర‌ళి అరికాళ్లు, మోకాళ్లు, చేతుల‌పై గాయాలైన దృశ్యాలను బంధువులు మీడియా ప్రతినిధుల‌కు పంపించారు. ఆ వీడియోల్లో ముర‌ళి ఒంటిపై గాయాలు స్పష్టంగా క‌నిపిస్తున్నాయి. అంతేకాకుండా న‌డ‌వ‌లేక‌పోతున్నాడు. తీవ్రంగా గాయ‌ప‌డిన ముర‌ళిని బంధువులు మ‌హ‌బూబాబాద్ ఏరియా ఆస్పత్రికి త‌ర‌లించారు. వైద్యులు చికిత్స అంద‌జేస్తున్నారు. అయితే థ‌ర్డ్ ప్రయోగం చేసిన‌ట్లుగా వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై పోలీస్ అధికారులెవ‌రూ ఇంతవ‌ర‌కు స్పందించ‌లేదు. వాస్తవానికి భార్యాభ‌ర్తల‌కు సంబంధించిన అంశాల్లో కేవ‌లం కౌన్సెలింగ్ మాత్రమే చేయాల్సిన స్టేష‌న్ అధికారిణి ఏకంగా థ‌ర్డ్ డిగ్రీ ప్రయోగం వ‌ర‌కు ఎందుకు వెళ్లాల్సి వ‌చ్చిందో తెలియాల్సి ఉంది. ముర‌ళి బంధువులతోపాటు ప్రజా సంఘాల నేత‌లు పోలీస్ శాఖ‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వెంట‌నే విచార‌ణ చేప‌ట్టి సంబంధిత అధికారిణిపై వేటు ప‌డేలా ఉన్నతాధికారుల‌ను క‌లిసి తీరుతామ‌ని కొంత‌మంది నాయ‌కులు బాహాటంగానే బాధితుడి కుటుంబ స‌భ్యుల‌కు మ‌ద్దతు తెలుపుతుండ‌టం గ‌మనార్హం.

థ‌ర్డ్ డిగ్రీ అంటే ఏంటీ..? అస‌లు ప్రయోగించ‌డానికి అనుమ‌తి ఉందా..?

శాంతి భద్రతల ప‌రిర‌క్షణ‌లో భాగంగా దుండ‌గుల‌ను పోలీసులు కొంత క‌ఠినంగా వ్యవ‌హ‌రించ‌క త‌ప్పదు. ముఖ్యంగా విచార‌ణ క్రమంలో చ‌ట్టాల ప‌రిధిని కూడా అతిక్రమిస్తుంటారు. అయితే చట్టం అనేది దేశంలో ప్రతీ ఒక్కరికి సమానమే. అయితే పౌరుల స్వేచ్ఛను హ‌రించే విధంగా పోలీసుల చ‌ర్యలు ఉండ‌కూడ‌దు. పోలీసులు ఇష్టరీతిన నిందితులపై చేయి చేసుకోవడం, బలప్రయోగం చేయడం చట్టవ్యతిరేక చర్యలుగానే పేర్కొనాల్సి ఉంటుంది. ఇక మ‌న‌మంతా థ‌ర్డ్ డిగ్రీ అనే ప‌దం ఎక్కువ‌గా వింటుంటాం. వాస్తవానికి ఫస్ట్ డిగ్రీ అంటే హత్య, చీటింగ్, దొంగతనం, మానభంగం కేసుల్లో అరెస్ట్ చేయడం. సెకండ్​డిగ్రీ.. అంటే అరెస్టు చేసిన 24 గంటల్లో నిందితుడిని జైల్లో పెట్టడాన్ని సెకెండ్ డిగ్రీ అంటారు. థర్డ్​డిగ్రీ.. అంటే ఒక వ్యక్తి మీద బలప్రయోగం చేయడాన్ని థర్డ్ డిగ్రీ అంటారు. ఒక వ్యక్తి స్వేచ్ఛగా ఉన్నప్పుడు ఆ స్వేచ్ఛను నిరోధించడానికి ప్రయోగించే ప్రయోగమే థర్డ్ డిగ్రీ అంటారు. వాస్తవానికి చ‌ట్టం ప్రకారం... ఒక వ్యక్తి నేరం చేసినప్పటికీ అతడి దగ్గర నిజాలు రాబట్టేందుకు కొట్టడం చేయరాదు. థర్డ్ డిగ్రీ చట్టానికి వ్యతిరేకం కాబట్టి బలప్రయోగం చేయరాదు. చేసిన యెడల సంబంధిత పోలీసుల మీద లేక సంబంధిత జైలు అధికారుల మీద కేసు పెట్టవచ్చు. నేరం ఒప్పుకోమని కొట్టడం గానీ, నేరం ఎలా చేశావో చెప్పమని కొట్టడం గానీ, నేరంలో ఫలానా అతను ఉన్నాడని కొట్టి చెప్పామనడంగానీ చేస్తే.. సంబంధిత వ్యక్తిని మేజిస్ట్రేట్ ముందర హాజరు పరచినప్పుడు పోలీసులు కొట్టారని మెజిస్ట్రేట్ గారికి తెలిపితే త‌ప్పకుండా మెడికల్ పరీక్షల‌కు పంప‌డం జ‌రుగుతుంది. వైద్య ప‌రీక్షల అనంత‌రం నిందితుడు చెప్పినది నిజమని నిర్ధార‌ణ అయితే ఐపీసీ 330 లేక సెక్షన్ 331 ప్రకారం సంబంధిత పోలీసు అధికారుల‌పై కేసు నమోదు చేయడం జరుగుతుంది. బాధితుడికి గాయాల‌య్యేలా థ‌ర్డ్ డిగ్రీ ప్రయోగించిన‌ట్లయితే ఐపీసీ 330 ప్రకారం.. 7 సంవత్సరాల వ‌ర‌కు కూడా జైలు శిక్ష ప‌డే అవ‌కాశం ఉండ‌టం గ‌మ‌నార్హం. తీవ్రమైన గాయాలు ఉంటే ఐపీసీ 331 (10 సంవత్సరాలు) కేసు నమోదు చేయడం జరుగుతుంది.

Advertisement

Next Story

Most Viewed