గ్రేటర్‌పై స్పెషల్ ఫోకస్.. కాషాయ కార్పొరేటర్లకు గులాబీగాలం?

by GSrikanth |   ( Updated:2022-03-31 00:45:44.0  )
గ్రేటర్‌పై స్పెషల్ ఫోకస్.. కాషాయ కార్పొరేటర్లకు గులాబీగాలం?
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాషాయంపై గులాబీ ఫోకస్ పెట్టింది. ప్రజల్లో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను తగ్గించేందుకు వ్యూహాలను రచిస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో గతంలో లేని విధంగా అనూహ్యంగాఅధిక స్థానాల్లో కార్పొరేటర్లను గెలుచుకొని సత్తాచాటింది. టీఆర్ఎస్‌కు ప్రత్నామ్యాయం బీజేపీ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం ముమ్మరం చేసింది. దీంతో బీజేపీకి చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ రంగం సిద్ధం చేసింది. పలువురు కార్పొరేటర్లను గులాబీ గూటికి చేర్చేందుకు అన్ని చర్యలు చేపడుతున్నది. ఒకవేళ అదే జరిగితే బీజేపీ భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ ఎఫెక్ట్ గ్రేటర్‌లోని శాసనసభా స్థానాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఏ పార్టీకి అయినా పునాది రాజధాని హైదరాబాద్. గ్రేటర్ పరిధిలో సత్తాను చాటితే ఈ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా చూపే అవకాశం ఉంటుంది. అందుకే పార్టీలన్నీ గ్రేటర్ పైనే ప్రత్యేక ఫోకస్ పెడతాయి. గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతాయి. తామేంటో నిరూపించుకుంటాయి. అయితే, ఈసారి జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోరు సాగింది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 99 స్థానాలు ఉంటే ఈ ఏడాది 56 స్థానాలకే పరిమితం అయింది. అంటే 43 స్థానాలలో ఓడిపోయింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ టీఆర్ఎస్ నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో ఓటమిపాలైంది. అనూహ్యంగా గతంలో 4 స్థానాలకే పరిమితం అయిన బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించింది. అయితే లింగోజీగూడ కార్పొరేటర్ మృతి చెందడంతో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఆ స్థానాన్ని గెలుచుకుంది. దీంతో బీజేపీకి ఒక స్థానం తగ్గి 47 స్థానాలకు పరిమితం అయింది. కాంగ్రెస్ 3 స్థానాలతోనే సరిపుచ్చుకుంది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకోవడంతో బీజేపీ నేతలు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఈ విజయాన్ని ప్రచార అస్త్రంగా చేసుకొని వివరిస్తున్నారు. రాష్ట్రంలో రాబోయేది బీజేపీయేనని వివరిస్తున్నారు. అయితే బీజేపీకి చెక్ పెట్టేందుకు గులాబీ పక్కా స్కెచ్ వేస్తోంది. ఎవరు పార్టీలో అసంతృప్తితో ఉన్నారు.. డివిజన్లలో అభివృద్ధి.. తదితర అంశాలను అధికార టీఆర్ఎస్ పార్టీ సేకరించింది. వారిపై దృష్టిసారించింది.

డజన్‌కు పైగా గాలం?

అధికార పక్షంలో ఉంటే డివిజన్ అభివృద్ధికి నిధులు దండిగా వస్తాయనే భావన ప్రజల్లో ఉంది. కార్పొరేటర్లలో సైతం అదే భావన. అయితే ప్రభుత్వం కేటాయించిన నిధులను అధికార పార్టీకి చెందిన డివిజన్ కార్పొరేటర్లకు మంజూరు చేస్తుండటం, అభివృద్ధి పనులు సైతం ముమ్మరంగా సాగుతున్నాయి. దీంతో బీజేపీ విజయం సాధించిన డివిజన్లలో అభివృద్ధికి కుంటుపడుతోంది. ప్రజల నుంచి సైతం సమస్యలపై విన్నపాలు వస్తుండటంతో పరిష్కారంలో జాప్యం జరుగుతోంది. దీంతో టీఆర్ఎస్‌కు చెందిన ఓ మంత్రి రంగంలోకి దిగినట్లు సమాచారం. పార్టీలో చేరితో నిధులతో పాటు ప్రత్యేక నిధులు సైతం ఇస్తామనే హామీలు ఇస్తున్నట్లు సమాచారం. తగిన ప్రాతినిధ్యం ఇస్తామని సన్నిహితులుగా ఉన్నవారితో సంప్రదింపులు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. డజన్‌కు పైగా కార్పొరేటర్లతో చేరికలపై మాట్లాడినట్లు సమాచారం. ఇదే జరిగితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది.

`బీజేపీపై ప్రజల్లో ఓ నమ్మకం ఉంది. బీజేపీగా గెలిచిన ప్రజాప్రతినిధులు పార్టీలు మారరు అనే అభిప్రాయం. అయితే దానిని పోగొట్టి వారు ఇతర పార్టీల నేతల లాగే మారుతారనే అభిప్రాయన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా చేసేందుకు టీఆర్ఎస్ ప్రణాళికలు రూపొందించింది. బీజేపీని రూరల్, గ్రామస్థాయిలోకి వెళ్లకుండా కట్టడి చేసేందుకే గ్రేటర్ బీజేపీ కార్పొరేటర్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టిందనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ బలపడితే టీఆర్ఎస్‌కు నష్టం జరుగుతుందని భావించిన పార్టీ అధిష్టానం గ్రేటర్‌లోని ఓ కీలక మంత్రిని రంగంలోకి దింపినట్లు సమాచారం. బీజేపీకి చెక్ పెట్టేందుకు కార్యాచరణ చేపట్టింది. ఇదిలా ఉంటే గ్రేటర్ ఎన్నికలు జరిగి ఏడాదిన్నరకు పైగా అవుతున్నప్పటికీ నేటి వరకు ఫ్లోర్ లీడర్‌ను నియమించలేదు. ఇక వేళ నియమిస్తే రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సి వస్తుందని అందుకే ఫ్లోర్ లీడర్‌ను నియమించడం లేదనే ప్రచారం జరుగుతుంది. దీనికి తోడు బీజేపీలో రెండు వర్గాలు ఉండటంతో ఏ వర్గానికి ఇచ్చిన మరో వర్గం తిరుగుబాటు ఎగురవేస్తుందనే భావనతో వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీలోని అనైక్యతను క్యాష్ చేసుకునేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టి తమపార్టీలోకి బీజేపీ కార్పొరేటర్లను చేర్చుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

Advertisement

Next Story