- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ గుడ్‌న్యూస్.. పండుగ తర్వాత పదవుల జాతర!
దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో గులాబీ బాస్ నామినేటెడ్ పదవులపై దృష్టిసారించారు. తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకొని ఆశావాహులకు తీపికబురు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. నామినెటెడ్ ఇచ్చి వారిలో అసంతృప్తికి చెక్ పెట్టడంతోపాటు పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టారు. కష్టపడేవారికి, పార్టీకి ఉద్యమకాలం నుంచి పనిచేసేవారికి పదవులు ఇచ్చి తాము ప్రజాపక్షం అని మరోసారి చాటనున్నారు. విడతల వారీగా కార్పొరేషన్లు భర్తీ ప్రక్రియ చేపట్టారని సమాచారం.
రాష్ట్రంలో 67 కార్పొరేషన్లు ఉన్నాయి. వాటిలో 50 కార్పొరేషన్ల భర్తీకి టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల నుంచి నామినేటెడ్ పదవుల భర్తీ ప్రారంభించింది. ఇప్పటివరకు విడుతల వారీగా 18 కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించిన గులాబీ బాస్... వికలాంగుల కార్పొరేషన్, శాట్స్(క్రీడల ప్రాధికార సంస్థ) చైర్మన్లను మాత్రం రెన్యూవల్ చేసింది. మిగతా కార్పొరేషన్ల చైర్మన్ల నియామకంపై ప్రభుత్వం దృష్టిసారించింది. అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో కులాల ప్రాతిపదికన నియామకం చేపట్టనున్నట్లు సమాచారం. ఎవరిని నియమిస్తే పార్టీకి కలిసి వస్తుందని బేరీజు వేసుకుంటూ వారికి బాధ్యతలను అప్పగిస్తోందని పార్టీలో చర్చజోరుగాసాగుతోంది.
అసంతృప్తికి చెక్ పెట్టేందుకు..
ఉద్యమపార్టీ అని, కష్టపడే వారికి గుర్తింపు లభిస్తుందని పార్టీ అధిష్టానం పేర్కొంటుంది. కానీ, అందుకు భిన్నంగా ఉద్యమం నుంచి పార్టీకోసం పనిచేసిన వారికి కాకుండా రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే పదవులు అప్పగిస్తున్నారని సీనియర్లు గుర్రుగా ఉన్నారు. అదేవిధంగా పాత, కొత్త నేతల మధ్య పార్టీలో వర్గపోరు సాగుతోంది. అయితే, ఇలాగే కొనసాగితే పార్టీకి నష్టం జరుగుతుందని భావించిన అధిష్టానం వారిని సమన్వయంతో పాటు వివాద రహితులకు నామినేటెడ్ పదవులను అప్పగించేందుకు కసరత్తు చేస్తోంది. సీనియర్లకు సైతం తగిన ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం.
యువతకు పెద్దపీట
రాబోయే కాలం యువతదే. యువతతోనే పార్టీ బలోపేతం సాధ్యం. అందుకు ఇప్పటినుంచే వారికి ఆకర్షించే పదవులు అప్పగిస్తే రాబోయే కాలంలో సైతం టీఆర్ఎస్‌కు ఎదురుండదని పార్టీ అధిష్టానం భావిస్తోంది. అందులో భాగంగానే ఇప్పటివరకు నియమించిన కార్పొరేషన్లలో 80శాతం యువకులకే కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలను అప్పగించింది. త్వరలో భర్తీ చేయబోయే నామినేటెడ్‌లలో కూడా యువతకే బాధ్యతలను అప్పగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు చైర్మన్ పదవులు దక్కించుకునేందుకు ఆశపడుతున్నారు. అటు.. ఎమ్మెల్యే టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు, ద్వితీయ శ్రేణి నేతలకు కూడా ఈ పదవుల్లో స్థానం కల్పించనున్నట్లు సమాచారం.
డైరెక్టర్లపై దృష్టిసారించని గులాబీ బాస్
రాష్ట్రంలో ఇప్పటి వరకు 20 కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రభుత్వం నియమించింది. కానీ, ఒక బీసీ కమిషన్‌కు చైర్మన్‌తో పాటు ముగ్గురు సభ్యులను నియమించింది. మిగతా ఏ కార్పొరేషన్‌కు డైరెక్టర్లను గానీ, సభ్యులను గానీ, నియమించలేదు. భర్తీ అయినా, కానీ కార్పొరేషన్లకు చైర్మన్లతో పాటు సభ్యులను, వ్యవసాయ మార్కెట్ కమిటీలను ప్రకటిస్తే 200ల మందికిపైగా పదవులు దక్కే అవకాశం ఉంది. పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలను సైతం బుజ్జగించవచ్చని ఆ దిశగా అధిష్టానం చర్యలు చేపట్టాలని పలువురు సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నప్పటికీ తమకు తగిన గుర్తింపు రావడంలేదనే మనోవేధనతో ఉన్నారు. ఏదీ ఏమైనా పార్టీ అసంతృప్తులను సంతృప్తి పరిస్తే రాబోయే కాలంలో కలిసివచ్చే అవకాశం ఉంటుంది. లేకుంటే నష్టం జరిగే అవకాశం ఉంటుందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. మరి గులాబీ బాస్ ఎవరెవరికి పదవులు కట్టబెడతారో, సీనియర్లను, అసంతృప్త వాదులను ఎలా మచ్చిక చేసుకుంటారో, పార్టీలో వర్గవిబేధాలను ఎలా శాంత పరుస్తారో వేచిచూడాల్సిందే.