పేదలకు అండా అంటూనే.. వారి భూములను లాక్కుంటారా..?

by Vinod kumar |
పేదలకు అండా అంటూనే.. వారి భూములను లాక్కుంటారా..?
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: పేద రైతులకు అండగా ఉంటానని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు పేద రైతుల భూములను లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. పేద రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వాలు వ్యవసాయం చేసుకొని బ్రతకడానికి వీలుగా భూములు కేటాయించిందని అన్నారు.


ఇటీవల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉన్న రాజీవ్ గృహకల్ప ఫ్లాట్లను విక్రయించడం ద్వారా మంచి లాభాలు రావడంతో ప్రభుత్వం ఇప్పుడు తమ దృష్టిని పేదలకు ఇచ్చిన భూములపై సాధించి వాటిని వెంచర్ లుగా మార్చి విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని బాలానగర్, రాజాపూర్, భూత్పూర్, జడ్చర్ల, అడ్డాకుల తదితర మండలాల్లో హరిజన, గిరిజన, బలహీన వర్గాల రైతుల పొలాలను గుర్తించి అధికారులతో సర్వేలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని డీకే అరుణ పేర్కొన్నారు.


పొలాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులకు ప్రతి ఎకరాకు 400 గజాలు ఇస్తామని చెప్పుతూ మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం పేద రైతులకు కేటాయించిన భూములను అత్యవసరమైన రోడ్లు, రైల్వే లైన్లు, తదితర అవసరాలకు కాకుండా రియల్ వ్యాపారానికి స్వాధీనపరచుకోవాలని ప్రయత్నిస్తే తాము చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు.



Advertisement

Next Story