రాష్ట్రంలో మారిన రాజకీయం.. టీఆర్ఎస్ vs కాంగ్రెస్?

by GSrikanth |   ( Updated:2022-03-30 00:30:12.0  )
రాష్ట్రంలో మారిన రాజకీయం.. టీఆర్ఎస్ vs కాంగ్రెస్?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ధాన్యం కొనుగోళ్లపై రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. రైతులకు భరోసా నింపాల్సిన అధికార, ప్రతిపక్ష నేతుల సోషల్ మీడియా వేదికగా విమర్శ, ప్రతివిమర్శలకు దిగుతున్నారు. నిన్నటి వరకు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారగా ఇప్పుడు టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా మారింది. ధాన్యం కొనుగోళ్లపై రాహుల్ గాంధీ జోక్యంతో ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. టీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. విమర్శనాస్త్రాలు సంధించారు.

రాష్ట్రంలో గత అక్టోబర్ నుంచి ధాన్యం కొనుగోళ్ల ఇష్యూ నడుస్తోంది. కేంద్రానిదే బాధ్యత అని టీఆర్ఎస్.. రాష్ట్రానిదే బాధ్యత అని బీజేపీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. సీఎం కేసీఆర్‌తో పాటు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు సైతం కేంద్రానికి విజ్ఞప్తులతో పాటు మంత్రులను కలిసి లేఖలు అందజేస్తున్నారు. బీజేపీ సైతం దూకుడుపెంచి టీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పిస్తుంది. ఇప్పటివరకు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా సాగింది. పార్లమెంట్‌లో ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ ఎంపీలు సైతం ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. తాజాగా.. కొనుగోళ్లపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. కొనుగోళ్లలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతికతను విస్మరిస్తూ రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటని, రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులను క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజా కొనాలని, తెలంగాణలో పండించిన చివరి గింజ కొనేవరకూ రైతుల తరుపున కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుందని ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దీనికి ఎమ్మెల్సీ కవిత ఘాటుగా స్పందించారు. ఎంపీగా ఉన్నారు.. రాజకీయ లబ్ధికోసం నామమాత్రంగా ట్విట్టర్లో సంఘీభావం తెలుపడం కాదని, తెలంగాణ ఎంపీలకు మద్దతుగా వెల్ లోకి వచ్చి నిరసన తెలపాలని అన్నారు. రాహుల్ గాంధీ ట్వీట్‌కు మంత్రి హరీష్ రావు తనదైన శైలీలో స్పందించారు. తెలంగాణపై దొంగ ప్రేమ, మొసలి కన్నీళ్లు ఆపాలని సూచించారు. వన్ నేషన్ వన్ ప్రొక్యూర్ మెంట్‌పై కాంగ్రెస్ పార్టీ స్పందించాలని డిమాండ్ చేశారు. పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి సైతం స్పందించి తెలంగాణ రైతులపై కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తోంది. నిజంగా రైతులపై ప్రేమ ఉంటే తెలంగాణ రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయాలని పార్లమెంటులో ప్రధాని మోడీని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు.

ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ ట్విట్‌కు పీసీసీ అధ్యక్షుడు రెవంత్ రెడ్డి రీ ట్వీట్ చేశారు. తెలంగాణ రైతుల ఆవేదనను అర్ధం చేసుకుని ఉద్యమ కార్యచరణకు మద్దతు నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. అధికార అహంకారంతో రాహుల్ ట్వీట్‌పై కామెంట్స్ చేస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. నిజాయితీ గురించి మాట్లాడే హక్కు వుందా? అని, తెలంగాణ ఇస్తే.. పార్టీని విలీనం చేస్తా, దళిత సీఎం, కేజీ టూ పీజీ అన్నారని, ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని ఉన్నాయని గుర్తుచేశారు. కల్లాల్లో ధాన్యం గింజలపై ప్రాణాలు వదిలేస్తున్న పేదరైతుల ప్రాణాలు కాపాడాలని మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ ట్విట్టర్‌లో మండిపడ్డారు. కేసీఆర్ అసెంబ్లీలో, మీడియా సమావేశంలో ధాన్యం కొనుగోళ్లపై మాట్లాడిన వీడియోలను ట్విట్టర్‌లో పోస్టుచేశారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ ధాన్యం కొనుగోళ్లపై, కేంద్ర, రాష్ట్ర తీరును ఎండగడుతూ చేసిన వ్యాఖ్యలతో రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ మాణిక్యం ఠాగూర్ సైతం కవిత వ్యాఖ్యలను ఖండించారు. మాజీ ఎంపీలను పార్లమెంట్‌లోకి అనుమతించరు కాబట్టి మీరు పార్లమెంట్‌లోకి రాలేరు.. టీఆర్ఎస్ ఎంపీలు మాత్రం సమస్యలపై కొట్లాడకుండా బిర్యానీలు రుచిచూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయన చేసిన వాఖ్యాలపై కూడా టీఆర్ఎస్ నేతలు ఘాటుగా స్పందించారు.

ధాన్యం కొనుగోళ్లపై అధికార, ప్రతిపక్ష పార్టీలు నిత్యం మాట్లాడుతున్నాయి. కేంద్రం కొనుగోళ్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రమే కొనుగోలు చేయాలని ప్రతిపక్షాలు వ్యాఖ్యలు చేస్తున్నాయి. కానీ, రైతు దగ్గరకు వెళ్లి సమస్యలను తెలుసుకోవడంలో వారికి భరోసా ఇవ్వడంలో మాత్రం నిర్లీప్తతను ప్రదర్శిస్తున్నాయి. గత ఆరుమాసాలుగా ధాన్యం కొనుగోళ్ల సమస్య తెరపైకి వచ్చినప్పటికీ నేటివరకు ఎవరూ కొంటారో అర్ధంకాని పరిస్థితి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరి కోతలు ప్రారంభం అయ్యాయి. దీంతో రైతు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కేవలం విమర్శలకే పరిమితమైన రాజకీయపార్టీలపై మాత్రంగా రైతన్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ప్రజలకు భరోసా ఇవ్వడం మాని రాజకీయాలు చేస్తున్నాయనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. అధికారపార్టీ గత ఏడేళ్లుగా తామే కొంటున్నామని ప్రచారం చేసుకుందని ఇప్పుడు కేసీఆర్ కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్షాలు సైతం అదే వాయిస్ వినిపిస్తున్నారు. కానీ, అధికార పార్టీ మాత్రం కేంద్రమే ధాన్యం కొనుగోలు చేయాలని పేర్కొంటుండటం, ఎవరూ స్పందిస్తే వారిపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం స్పందిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో రైతుల సమస్యలు పక్కదారి పట్టించడానికేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ధాన్యం కొనుగోళ్లపై రాజకీయాలు చేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంతకు రైతు సమస్యకు పరిష్కారం ఎప్పుడు లభిస్తుందో? ఎప్పుడు ముగింపు పలుకుతుందో పార్టీల నేతలకే తెలియాలి.

Advertisement

Next Story

Most Viewed