తెరపైకి వచ్చిన కాంగ్రెస్ అసంతృప్తులు.. ప్రధానంగా ముగ్గురు?

by GSrikanth |   ( Updated:2022-03-23 01:00:55.0  )
తెరపైకి వచ్చిన కాంగ్రెస్ అసంతృప్తులు.. ప్రధానంగా ముగ్గురు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్​పార్టీకి జాతీయ సమస్య.. రాష్ట్రంలోనూ నెలకొంది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్​ పార్టీ బలోపేతం కావాలంటే బలమైన నాయకత్వం కావాలని, పార్టీ పున:నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందంటూ జాతీయస్థాయి కాంగ్రెస్​నేతలు జీ 23గా ఏర్పాటై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, జాతీయ స్థాయిలో సోనియా, రాహుల్​ గాంధీ నాయకత్వం వద్దనకుండా.. బలమైన నాయకత్వం అవసరమంటూ చెప్పుకొస్తున్నారు. కానీ, రాష్ట్రంలో టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డికి వ్యతిరేకంగా అలాంటి వర్గమే ఇక్కడా వ్యతిరేక జెండా ఎగురవేసింది. మొన్నటి వరకూ కొంతమంది సీనియర్లు వెనుక ఉన్నట్టే ఉన్నా.. తెరపైకి మాత్రం ఆరుగురు వచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జీ –6 వ్యవహారం తెరపైకి వచ్చింది.

ఎవరెవరంటే..?

మూడు రోజుల కిందట మాజీ ఎంపీ వీ.హనుమంతరావు ఆధ్వర్యంలో అసంతృప్తి నేతల సమావేశాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి సీనియర్లు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలతో పాటుగా చాలా మందికి ఆహ్వానం పంపించారు. కొద్దిరోజులుగా గాంధీభవన్‌కు దూరంగా ఉంటున్న వారిని కూడా వీహెచ్​పిలిచారు. కానీ, వస్తామంటూ చెప్పిన పలువురు నేతలు చివరి సమయంలో ముఖం చాటేశారు. కాంగ్రెస్ లాయలిస్ట్స్​ఫోరం పేరుతో జరిగిన ఈ సమావేశానికి వీహెచ్ నాయకత్వం వహించగా, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ సభ్యులు కమలాకర్, శ్యాం మోహన్‌తో పాటుగా సీనియర్​ నేత గౌరీ శంకర్ హాజరయ్యారు. అయితే వీరిలో చాలామంది నేతలు కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నవారే కావడం గమనార్హం.

ఎందుకు రాలేదు

జాతయ స్థాయిలో జీ 23 స్థాయిలో రాష్ట్రంలో టీపీసీసీకి వ్యతిరేకంగా కూడా చాలామంది నేతలు వస్తారని ఊహించారు. అక్కడ జీ 23 పేరుతో ఇక్కడ కూడా అదే ప్లాన్​వేశారు. యాంటీ రేవంత్​టీం అన్నట్టుగా హస్తం నేతలు వ్యూహం పన్నారు. కానీ, వీహెచ్​ప్రయత్నాలు బెడిసికొట్టాయి. వాస్తవానికి కొంతమంది సీనియర్లు కొంతకాలంగా గాంధీభవన్‌కు దూరంగా ఉంటున్నా, ఎక్కడా వ్యతిరేక విమర్శలు చేయలేదు. మధుయాష్కీ ఇటీవల రేవంత్​చేసిన బీహార్​ఐఏఎస్‌లు అనే ప్రకటనను విమర్శించారు. కానీ తర్వాత ఆయన సైలెంట్​అయ్యారు. కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ఉత్తమ్​కుమార్​రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహా, ఏలేటి మహేశ్వర్​రెడ్డి, జానారెడ్డి, గీతారెడ్డి వంటి పలువురు నేతలు రేవంత్​వ్యవహరశైలిపై అసంతృప్తితో ఉన్నా.. అడపాదడపా కలిసి వస్తూనే ఉన్నారు. వీహెచ్​ నిర్వహించిన సమావేశానికి వీరందరితో పాటుగా ఎమ్మెల్యేలు శ్రీధర్​బాబు, పొదెం వీరయ్య, రాజగోపాల్​రెడ్డి, వెంకట్​రెడ్డి, ఉత్తమ్‌ను కూడా రావాలని పిలిచారు. అయితే ముందుగా టీపీసీసీ చీఫ్​అంశంలో వ్యతిరేకించి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఆ తర్వాత రేవంత్‌తో కలిసిపోయారు. మరో ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి కూడా పార్టీలో వ్యతిరేకస్వరం వినిపిస్తున్నా.. ఇప్పటి వరకు రేవంత్​రెడ్డి నాయకత్వాన్ని మాత్రం తప్పు పట్టలేదు. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడలేదు.

అయితే, ఆదివారం అశోకా హోటల్‌లో నిర్వహించిన అసంతృప్తివాదుల సమావేశం మాత్రం కేవలం ఆరుగురికి పరిమితమైంది. తమకు కూడా రేవంత్​అంటే కోపం అంటూ వీహెచ్‌కు చెప్పిన వాళ్లంతా డుమ్మా కొట్టారు. వాస్తవంగా ఇటీవల జగ్గారెడ్డి, వీహెచ్​ వంటి నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడం వెనక పలువురు కీలక నేతలున్నారనే ప్రచారం జరిగింది. దీంతోనే వీహెచ్, జగ్గారెడ్డి బహిరంగ ఎదురుదాడికి దిగినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. కానీ, అసలు సమయంలో మాత్రం అంతా వెనకే ఉన్నారు. తెరపైకి రాకుండా జాగ్రత్త పడ్డారు. ఫలితంగా వందల సంఖ్యలో వ్యతిరేకులు ఉంటారని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మీటింగ్.. ఆరుగురికే పరిమితమైంది.

ఇప్పుడు మళ్లీ భయం

తాజాగా జగ్గారెడ్డి అంశంలో ఏఐసీసీ కూడా సీరియస్ అయింది. వాస్తవానికి ఆదివారం నాటి సమావేశానికి ముందు నుంచే ఏఐసీసీ నుంచి సీనియర్లకు సంకేతాలిచ్చారు. అసంతృప్తి వేదికగా, కాంగ్రెస్​లాయలిస్టుల ఫోరం పేరుతో నిర్వహించే సమావేశానికి వెళ్తే ముందుండే పరిణామాలను సూచిస్తూ సున్నితంగానే హెచ్చరించారు. సీనియర్ల గైర్హాజరుకు ఇది కూడా కారణమనే అభిప్రాయాలున్నాయి. ఈ వ్యవహారం ముదిరి, జగ్గారెడ్డి సవాళ్లకు దిగడంతో.. ఏఐసీసీ చర్యలకు పూనుకుంది. ముందుగా జగ్గారెడ్డికి ఉన్న పార్టీ బాధ్యతలను కత్తిరించింది. టీపీసీసీ నుంచే ఈ చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రస్తుతం జగ్గారెడ్డి తనను తాను సమర్ధించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. సోనియా, రాహుల్​ నేతృత్వంలో పని చేస్తామని, రేవంత్​తోనే పంచాయతీ అంటూ చెప్పుకొస్తున్నారు. కానీ, ఏఐసీసీ మాత్రం రాష్ట్ర నాయకత్వాన్ని వ్యతిరేకిస్తే ఎలా ఊరుకుంటామనే హెచ్చరికలు పంపిస్తోంది. త్వరలోనే జగ్గారెడ్డికి ఏఐసీసీ నుంచే చర్యలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సమావేశాన్ని ముందుండి నడిపించిన వీహెచ్పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో స్పష్టత రావడం లేదు. మరోవైపు మర్రి శశిధర్​రెడ్డి తనకున్న పదవికి గతంలోనే రాజీనామా చేశారు. ప్రస్తుతం పార్టీలో ఏ పదవి లేకుండానే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఆయన ఉన్నారా.. లేరా అనుమానాలు కూడా వ్యక్తమవున్నాయి. ఇక వీళ్లు మినహా.. మిగిలిన వారిపైనా చర్యలు తీసుకునే అంశాన్ని టీపీసీసీపైనే పెట్టినట్లు సమాచారం. కమలాకర్, శ్యాం మోహన్‌ను క్రమశిక్షణా కమిటీ నుంచి తప్పిస్తారని గాంధీభవన్లో ప్రచారం జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed