- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మద్యంపై టీడీపీ పోరు.. 'కిల్లర్ జే బ్రాండ్స్' పేరుతో వెబ్‌సైట్ ప్రారంభం
దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలోని నాటుసారా, కల్తీసారా, జేబ్రాండ్స్‌పై తెలుగుదేశం పార్టీ వెనక్కి తగ్గడం లేదు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మూడు అంశాలపై చర్చకు పట్టుబట్టిన టీడీపీ సభ్యులు చివరకు ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. అటు శాసన సభలోకానీ ఇటు శాసన మండలిలో కానీ ప్రభుత్వం చర్చించలేదు. ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యులు ఇచ్చిన తీర్మానంపై చర్చకు అటు స్పీకర్ తమ్మినేని సీతారాం ఇటు మండలి చైర్మన్ మోషేన్ రాజులు అంగీకారం తెలపలేదు. అసెంబ్లీలో చర్చకు అవకాశం ఇవ్వకపోయినా పోరాటం చేసి తీరుతామని.. ప్రజల వద్దకు వెళ్తామని టీడీపీ చెప్పిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే మద్యంపై పోరాటం చేయాలని నిర్ణయించింది. అందులో ప్రజలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగా టీడీపీ ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఆవిష్కరించింది. జగన్ మద్యం మాఫియాలో ప్రజలకర్త్యవ్యాన్ని, వారు పోషించాల్సిన బాధ్యతను తెలియచేస్తూ, వారిని భాగస్వాములను చేస్తూ శనివారం టీడీపీ జాతీయ కార్యాలయంలో వెబ్ సైట్ (www.killerjbrands.com) ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, టీడీపీ అంగన్ వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత పాల్గొన్నారు. ఆడబిడ్డల పుస్తెలుతెంచుతూ, అడ్డగోలుగా అక్రమార్జనకు పాల్పడుతున్న జగన్ రెడ్డి మద్యం మాఫియాపై ప్రజా పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సభ్యులు పిలుపునిచ్చారు. ప్రజలు, బాధ్యతగల యువకులు.. సమాజహితం కోరేవారంతా జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న మద్యంమాఫియాపై పోరాడటానికి తెలుగుదేశం పార్టీతో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. తమపార్టీ ఆవిష్కరించిన వెబ్ సైట్‌లో ఏదివాస్తవం.. ఏది అబద్ధం అనేది కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అలాగే జగన్ అధికారంలోకి వచ్చాక ఆయన ప్రభుత్వ అమ్ముతున్న మద్యం తాగి చనిపోయిన వారి వివరాలు.. వారి కుటుంబ సభ్యుల ఆవేదనను కూడా www.killerjbrands.com. వెబ్ సైట్లో తెలియచేశామని నేతలు తెలిపారు.
జగన్ రెడ్డి మద్యం మాఫియాను కూకటివేళ్లతో సహా పెకలించాలి : నక్కా ఆనంద్ బాబు
'ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం పాలసీతో కుటుంబాలకు కుటుంబాలే చిద్రమై పోతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని, తాను అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యపాన నిషేధం అమలు చేస్తానని హామీ ఇచ్చిన జగన్ తీరా సీఎం అయ్యాక మద్యాన్ని పెంచిపోషిస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చాక దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్రంలో దారుణాతి దారుణంగా మద్యం, నాటుసారా, గంజాయి వంటి మాదకద్రవ్యాల విక్రయాలను జగన్ కొనసాగిస్తున్నారు. మద్యం తయారీ కంపెనీలన్నీ జగన్, ఆయన మనుషుల అధీనంలోనే ఉన్నాయి. ముఖ్యమంత్రి, ఆయన బినామీల దెబ్బకు చాలామంది వారి డిస్టిలరీ కంపెనీలు వదిలేసి పరారయ్యారు. కంపెనీలన్నీ వారి చేతుల్లో పెట్టుకొని, కల్తీ మద్యాన్ని ప్రజలపైకి వదిలారు' అని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు.
'చీప్ లిక్కర్ తయారీకి ఒక్కో సీసాకు ప్రభుత్వానికి రూ.20లు ఖర్చవుతుంటే, అదే సీసాను రూ.250కి అమ్ముతున్నారు. టీడీపీ హయాంలో నాణ్యమైన మద్యమే తక్కువ ధరకు లభించేది. ప్రభుత్వం మద్యందుకాణాల్లో ఎందుకని డిజిటల్ చెల్లింపులకు అనుమతి ఇవ్వడం లేదు? ప్రజల నుంచి మద్యం విక్రయాల ద్వారా దోచుకుంటున్న సొమ్మంతా కూడా సాయంత్రానికి జగన్మోహన్ రెడ్డి ఖజానాకు చేరుతోంది. ఈ మూడేళ్లలోనే అనధికారిక విక్రయాల ద్వారా జగన్ రెడ్డి ఖజానాకు రూ.7వేల కోట్ల వరకు చేరింది. జేబ్రాండ్స్ మద్యాన్ని ప్రముఖ ల్యాబ్‌లకు పంపి పరీక్షిస్తే వాటిలో విషపూరిత, హానికారక రసాయనాలు ఉన్నాయని తేలింది. అయినా కూడా ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా తన మద్యం అమ్మకాలను సమర్థించుకుంటున్నాడు. జంగారెడ్డి గూడెంలో నాటుసారా తాగి 27మందిచనిపోతే, సెబ్ అధికారులు ఎఫ్ఐఆర్ లు నమోదుచేస్తే, సారా అమ్ముతున్న, తయారు చేస్తున్న వారిపై ఎక్సైజ్ విభాగం వారు కేసులు నమోదు చేస్తే అవేవీ ముఖ్యమంత్రికి కనిపించలేదు. టీడీపీ సభ్యులను సభ నుంచి బయటకు పంపించి నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పారు' అని నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు.
జగన్ మద్యం మాఫియా ఆడబిడ్డల పసుపుకుంకుమలను బలితీసుకుంటున్నాయి : ఆచంట సునీత
'జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన అక్రమ మద్యం పాలసీ ఎందరో ఆడబిడ్డల తాళిబొట్లు తెంపేసింది. ఎన్నో కుటుంబాలను రోడ్లపాలు చేసింది. అధికారంలోకి రావడానికి ఆడబిడ్డలకు మాయమాటలు చెప్పిన జగన్ మద్యపాన నిషేధం హామీతో వారి ఓట్లను కొల్లగొట్టాడు. ముఖ్యమంత్రి అయ్యాకేమో సిగ్గులేకుండా ఏకంగా గాంధీ జయంతి రోజునే కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చి, పిచ్చి పిచ్చి మద్యం బ్రాండ్లను మార్కెట్లోకి వదిలాడు. ఆఖరికి తన మద్యం అమ్మకాలు పెంచుకోవడానికి.. తన దోపిడీకి విద్యా బుద్ధులు నేర్పాల్సిన గురువులను కూడా మద్యం దుకాణాల వద్ద కాపలాఉంచే దుస్థితికి ఈ ముఖ్యమంత్రి దిగజారాడు' అని టీడీపీ అంగన్‌వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత ఆరోపించారు. మద్యపాన నిషేధం అని చెప్పిన వ్యక్తి రాష్ట్రంలో ఏ బ్రాండ్స్ మద్యం లేకుండా చేయాల్సింది పోయి.. ఆఖరికి నాసిరకం మద్యాన్ని తనకు చెందిన డిస్టిలరీల్లో తయారుచేయించి ప్రజల్లోకి వదిలాడు. భర్త తాగితే భార్యకు చేయూత కింద సొమ్ములిస్తానని, తండ్రితాగితేనే కొడుక్కి అమ్మఒడిఇస్తామని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి చెప్పడం నీచాతి నీచం. కూలి పనులు చేసుకుంటూ పొట్టపోసుకునే ఎందరో పేద, మధ్యతరగతి మహిళలు జగన్ రెడ్డి సాగిస్తున్న మద్యం మాఫియాకు చిన్నవయస్సులోనే పసుపుకుంకుమలు కోల్పోయి దిక్కతోచనిస్థితిలో రోడ్లపాలవుతున్నారు. అలాంటి ఆడబిడ్డల ఉసురు ఈ ముఖ్యమంత్రికి ఖచ్చితంగా తగిలి తీరుతుంది అని ఆచంట సునీత శాపనార్థాలు పెట్టారు. తాము ఆవిష్కరించిన వెబ్ సైట్‌లో జగన్ సాగిస్తున్న మద్యం మాఫియావల్ల జరిగే అనర్థాలను ప్రజల్లోకి తీసుకెళ్లేవరకు టీడీపీ తరుపున తాముపోరాటం చేస్తామని టీడీపీ అంగన్‌వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత స్పష్టం చేశారు.