తగ్గేదేలే.. మద్యం ఘటనలపై వైసీపీ వర్సెస్ టీడీపీ

by samatah |   ( Updated:2022-03-21 07:59:23.0  )
తగ్గేదేలే.. మద్యం ఘటనలపై వైసీపీ వర్సెస్ టీడీపీ
X

దిశ, ఏపీ బ్యూరో : ఏపీ రాజకీయాలు ప్రస్తుతం మద్యం చుట్టూ తిరుగుతున్నాయి. జంగారెడ్డిగూడెం ప్రాంతంలో ఇటీవల సంభవించిన మరణాల నేపథ్యంలో రాజకీయాలు హీటెక్కాయి. ఈ మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని టీడీపీ వాదిస్తున్నది. అసలవి మద్యం మరణాలే కావని అధికార పార్టీ చెబుతోంది. రాష్ట్రంలో కల్తీ బ్రాండ్ల మందు విచ్చలవిడిగా సరఫరా అవుతోందని, దీనికి ప్రభుత్వ విధానమే కారణమని టీడీపీ పోరుబాట పట్టింది. బయట ఎక్కడా కనపడని ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ రిజర్వ్, బూమ్ బూమ్ లాంటి బ్రాండ్ల మద్యంపైనే ప్రస్తుత వివాదమంతా నడుస్తోంది. ఇవన్నీ ప్రభుత్వంలోని పెద్దలకు ఆర్థికంగా లాభం చేకూర్చేందుకే ప్రవేశపెట్టబడ్డాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వాటికి అనుమతులు వచ్చింది మీ(టీడీపీ) హయాంలోనే అంటోంది వైసీపీ ప్రభుత్వం.

కల్తీ సారా మరణాలన్నీ సీఎం చేసిన హత్యలేనని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపిస్తున్నారు. ఇటీవలే మద్య నిషేధం హామీ ఏమైందంటూ ఆయనతోపాటు టీడీపీ నాయకులు అసెంబ్లీ ముందు ధర్నా చేశారు. విజయవాడ నుంచి శ్రీకాకుళం, చిత్తూరు వరకూ కల్తీ మద్యంపై టీడీపీ నేతలు నిరసనలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో నాసిరకం మద్యం బ్రాండ్లన్నీ నిజానికి జే బ్రాండ్ మద్యమని, వీటి వెనుక అధికార పార్టీయే ఉందని వారు అంటున్నారు. ఈ నేపథ్యంలో విజయనగరం పార్వతీపురంలో పార్టీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కృష్ణాజిల్లాలో పలుచోట్ల ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద మద్యం బాటిళ్లు పగలగొట్టి మరీ టీడీపీ నేతలు నిరసనలు తెలిపారు.

వైసీపీ హయాంలో మద్యం ఏరులై పారుతోంది. మూడేళ్లుగా మధ్య విక్రయాలపై వచ్చిన ఆదాయం, పెరిగిన అప్పులపై వైసీపీ వెంటనే శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఎక్సైజ్ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాల వివరాలను బయటపెట్టాలని కూడా కోరారు. రాష్ట్రం చీప్ లిక్కర్ బ్రాండ్లను కొనుగోలు చేస్తున్న డిస్టిలరీల పేర్లనూ బయట పెట్టడంతోపాటు టెండర్లను విడుదల చేయకుండా ఈ బ్రాండ్లను ఎందుకు కొనుగోలు చేస్తున్నారని ప్రశ్నించారు .

అవి జే బ్రాండ్స్ కాదు.. సీ బ్రాండ్స్ : వైసీపీ కౌంటర్ ఎటాక్

టీడీపీ విమర్శలకు అధికార వైసీపీ కూడా ఘాటుగా కౌంటర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్స్ రిజర్వ్ లాంటి బ్రాండ్లకు టీడీపీ హయాంలోనే అనుమతులు వచ్చాయని చెబుతున్నారు. 2019 తర్వాత జగన్ ప్రభుత్వం మద్యం తయారీ పాలసీలో ఎలాంటి మార్పులూ చేయలేదని ఆ పార్టీ నేత పార్థసారధి పేర్కొన్నారు. ప్రెసిడెంట్ మెడల్ అనే బ్రాండ్ కు 2018 ఫిబ్రవరి 6న, గవర్నర్స్ రిజర్వ్‌కు 2018 నవంబర్ 5న, నెపోలియన్, ఓక్టన్, సెవెంత్ హెవెన్ లాంటి బ్రాండ్లకు 2018 అక్టోబర్ 26న, బూమ్ బూమ్ బీరుకు 2019 మే 14న అనుమతులు ఇచ్చారని, వాటితో వైసీపీ ప్రభుత్వానికి సంబంధం లేదని ఇవన్నీ చంద్రబాబు పాలన నాటివని తెలిపారు. వీటిని ' సీ ' బ్రాండ్లగా పిలవాలని పార్థసారిధి ఆరోపించారు.

ప్రభుత్వం వాస్తవాలను కప్పిపుచ్చుతుంది : రామక‌ృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

రాష్ట్రంలో సొంత మద్యం అమ్మించిన ఏకైక సీఎం జగన్. ఇటీవల జంగారెడ్డిగూడెంలో మరణాలు సంభవిస్తే వాటిని సహజ మరణాలని చెబుతున్నారు. కల్తీ సారా అమ్మకం జరుగుతుందని ఎక్సైజ్ శాఖ చెబుతోంది. మరి ఈ ఇద్దరిలో ఎవరు చెప్పేది నిజం అనుకోవాలి. ఆదివారం విజయవాడలో ఆయన, ష్ట్రంలో కల్తీ సారా లేకపోతే 156 మందిపైన 148 కేసులు దేనికోసం పెట్టినట్టు. అవాస్తవాలు చెప్పినందుకు అసెంబ్లీ లో సీఎం క్షమాపణ చెప్పాలి. గత బ్రాండ్లకు సీఎం నిషేధం పెట్టారని, కొత్త బ్రాండ్ల మద్యం రాష్ట్రంలో దించారని ప్రభుత్వం పెట్టిన రేటుకు వాటిని కొనలేక కల్తీ మద్యం తాగడం వల్లే జంగారెడ్డి గూడెం మరణాలు సంభవించాయంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు.

ఖజానాకు ఆదాయం మద్యం?

నిజానికి మద్యం నుంచే రాష్ట్ర ఖజానాకు ఆదాయం లభిస్తున్నది. పన్నుల ద్వారా వచ్చే ఆదాయానికి తోడు ఎక్సైజ్ పై వచ్చే ఆదాయం చాలా ఎక్కువ. ప్రభుత్వాలు మద్య నిషేధం జోలికి పోవు. గతంలో టీడీపీ సహా చాలా ప్రభుత్వాలు ఆ ప్రయత్నం చేసి చేతులు కాల్చుకున్నాయి. నవరత్నాల్లో భాగంగా దశలవారీ మద్యం నిషేధమని హామీ ఇచ్చిన వైసీపీ ఇప్పుడు దాని ఆచరణపై మల్లగుల్లాలు పడుతుంది. మరోవైపు టీడీపీ, వైసీపీపై ఆరోపణలు చేస్తుందే తప్ప తాము అధికారంలోకి వస్తే మద్యం నిషేధం చేస్తాం అని చెప్పలేకపోతుంది. టీడీపీ లెక్కల ప్రకారమే వాళ్ల 5 ఏళ్ల పాలనలో మద్యం ద్వారా ఆదాయం రూ. 40 వేల కోట్లు కాగా వైసీపీ మూడేళ్ల పాలనలోనే వచ్చింది ఏకంగా 90 వేల కోట్లు అని ఆ పార్టీ నేతలే పేర్కొంటున్నారు.

లిక్కర్ మరణాలుగా చెప్పలేం

'ప్రభుత్వం చీప్ లిక్కర్‌ను సరఫరా చేయడం లేదని, 2019 ఫిబ్రవరి తర్వాత రాష్ట్రంలో ఎలాంటి కొత్త డిస్ట్రలరీ ఏర్పాటు కాలేదు. జంగారెడ్డి గూడెం ప్రాంతం లో జరిగిన మరణాలు సహజ మరణాలే. వాటిని లిక్కర్ మరణాలుగా చెప్పలేం.'

- ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ

Advertisement

Next Story

Most Viewed