కొత్త ఆర్థిక సంవత్సరం భారీ లాభాలతో స్టాక్ మార్కెట్ల శుభారంభం!

by Harish |
కొత్త ఆర్థిక సంవత్సరం భారీ లాభాలతో స్టాక్ మార్కెట్ల శుభారంభం!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు కొత్త ఆర్థిక సంవత్సరాన్ని భారీ లాభాలతో ప్రారంభించాయి. ఉదయం స్వల్ప ఒడిదుడుకుల మధ్య మొదలైన సూచీలు మిడ్-సెషన్‌కు ముందు నుంచి దూకుడు పెంచాయి. 2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి రోజున మదుపర్లు మెరుగైన కొనుగోళ్లను నిర్వహించడంతో శుక్రవారం ఒక్కరోజే బీఎస్ఈ మార్కెట్ క్యాప్ దాదాపు రూ. 4 లక్షల కోట్లు పెరిగి రూ. 267.90 లక్షల కోట్లకు చేరుకుంది. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు ముడి చమురు ధరలు తగ్గడం, రష్యా చౌకగా చమురు ఇవ్వడానికి సిద్ధపడటం వంటి పరిణామాలు కలిసొచ్చాయి. దీనికి తోడు దేశీయంగా జీఎస్టీ ఆదాయం రికార్డు స్థాయిలో నమోదవడంతో సూచీలు చివరి గంటలో భారీగా పుంజుకున్నాయి.

దీంతో వారాంతం మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 708.18 పాయింట్లు ఎగసి 59,276 వద్ద, నిఫ్టీ 205.70 పాయింట్లు పుంజుకుని 17,670 వద్ద ముగిశాయి. నిఫ్టీలో బ్యాంకింగ్, ఫైనాన్స్, మీడియా, ఎఫ్ఎంసీజీ, ఆటో రంగాలు గణనీయంగా పెరిగాయి. ఫార్మా రంగం మాత్రమే నీరసించింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టెక్ మహీంద్రా, సన్‌ఫార్మా, డా రెడ్డీస్, టైటాన్ ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు మాత్రమే నష్టపోయాయి. మిగిలిన అన్ని షేర్లు లాభాలను సాధించాయి. ముఖ్యంగా ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ, ఎంఅండ్ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు 2 శాతానికి పైగా లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.98 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed