నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

by Harish |
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్ పడింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ పరిస్థితులు కొనసాగుతుండటం, శాంతి సంకేతాలు వచ్చినప్పటికీ సానుకూల పరిణామాలేమీ చోటు చేసుకోకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లు బలహీనపడ్డాయి. ఈ ప్రభావం కారణంగా దేశీయ సూచీలు క్షీణించాయి. ప్రధానంగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా అమ్మకాలకు మొగ్గు చూపడంతో పాటు గత మూడు సెషన్లలో వచ్చిన లాభాలను వెనక్కి తీసుకునేందుకు మదుపర్లు ఆసక్తి చూపడంతో స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. గురువారం నాటి ట్రేడింగ్‌లో ఉదయం ప్రారంభమైన సమయంలో లాభాలతో కొనసాగిన స్టాక్ మార్కెట్లు మిడ్-సెషన్ వరకు మెరుగ్గా ర్యాలీ చేశాయి. అయితే ఆ తర్వాత పరిణామాల్లో ముఖ్యంగా మార్చి నెలకు సంబంధించి ఎఫ్అండ్ఓ కాంట్రాక్టుల గడువు ముగియడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ఆసక్తి చూపించారు.

దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 115.48 పాయింట్లు కోల్పోయి 58,568 వద్ద, నిఫ్టీ 33.50 పాయింట్లు పడిపోయి 17,464 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఫార్మా, హెల్త్‌కేర్ రంగాలు 1 శాతానికి పైగా నీరసించాయి. ఎఫ్ఎంసీజీ రంగం రాణించింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎంఅండ్ఎం, హిందూస్తాన్ యూనిలీవర్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ, టైటాన్ షేర్లు లాభాలను దక్కించుకోగా, రిలయన్స్, విప్రో, డా రెడ్డీస్ కంపెనీల షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.71 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed