భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

by Harish |
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి భారీ లాభాలను సాధించాయి. ప్రధానంగా అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను 0.25 పాయింట్లు పెంచినప్పటికీ భారత స్టాక్ మార్కెట్లు అధిక లాభాలతో దూసుకెళ్లడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో పాటు రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు సానుకూల చర్చల దిశగా సాగుతుండటం మదుపర్ల సెంటిమెంట్‌ను పెంచాయి. గురువారం ఉదయం నుంచి లాభాలతో మొదలైన సూచీలు మిడ్-సెషన్ సమయంలో కొంత ఊగిసలాట ధోరణిని చూసినప్పటికీ ఆ తర్వాత ముడి చమురు ధరలు దిగిరావడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు దేశంలో పెట్టుబడులు పెంచడం వంటి అంశాలు స్టాక్ మార్కెట్లకు కలిసొచ్చాయి.

దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,047.28 పాయింట్లు ర్యాలీ చేసి 57,863 వద్ద, నిఫ్టీ 311.70 పాయింట్లు పుంజుకుని 17,287 వద్ద ముగిశాయి, నిఫ్టీలో ఫైనాన్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాలు 2 శాతానికి పైగా పెరగ్గా, ఐటీ ఇండెక్స్ స్వల్పంగా నీరసించింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు మాత్రమే నష్టాలను చూడగా, మిగిలిన అన్ని కంపెనీల షేర్లు లాభాల్లో కదలాడాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ, టైటాన్, కోటక్ బ్యాంక్, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, మారుతీ సుజుకి, ఎంఅండ్ఎం, నెస్లె ఇండియా, సన్‌ఫార్మా, డా రెడ్డీస్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు అధిక లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.79 వద్ద ఉంది. కాగా, మార్చి 18న(శుక్రవారం) హోలీ పండుగ సందర్భంగా భారత స్టాక్ మార్కెట్లకు సెలవు. తిరిగి సోమవారం మార్కెట్లు తెరుచుకోనున్నాయి

Advertisement

Next Story