- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారీగా పెరిగిన సిమెంటు ధరలు.. రియల్ ఎస్టేట్ పనులు నిలిపివేత!
దిశ, తెలంగాణ బ్యూరో: నిర్మాణరంగంలో వినియోగించే సిమెంటు, స్టీల్, అల్యూమినియం వంటి వాటి ధరలు గణనీయంగా పెరిగాయి. దీంతో నిర్మాణ కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలుగుతుంది. అంతేకాదు, ఇన్‌పుట్ వ్యయం పెరగడంతో ప్రాజెక్ట్ వ్యయం కూడా పెరుగుతుంది. ఈ మెటీరియల్స్ ధరలు పెరగడం వల్ల నగదు ప్రవాహానికి ఇబ్బందిగా మారింది. డెవలపర్లకు వర్కింగ్ క్యాపిటల్ సమస్య తలెత్తుతున్నది. నిర్మాణ వ్యయాలు గణనీయంగా పెరగడం వల్ల 600 లకు పైగా డెవలపర్లపై తీవ్ర ప్రభావం పడింది. ఈ ధరల పెరుగుదల కారణంగా గృహాల ధరలు కూడా అదే స్ధాయిలో పెరగడంతో పాటుగా గృహ కొనుగోలు వ్యయాలు కూడా పెరగనున్నాయని క్రెడాయ్, తెలంగాణా రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్(ట్రెడా), తెలంగాణా బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్), తెలంగాణా డెవలపర్స్ అసోసియేషన్ (టీడీఏ)లు స్పష్టం చేశాయి. నిర్మాణ రంగంలో వినియోగించే మెటీరియల్స్ ధరలు గణనీయంగా పెరుగుతుండటం వల్ల ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు ఉన్న అవకాశాలపై శుక్రవారం చర్చించారు. ముడిసరుకు ధరల విపరీతమైన పెరుగుదలకు నిరసనగా ఈ నెల 4వ తేదీన ఒక్క రోజు రియల్ ఎస్టేట్ పనులు నిలిపివేయనున్నట్లు ప్రకటించాయి.
క్రెడాయ్ హైదరాబాద్అధ్యక్షుడు పీ.రామకృష్ణారావు మాట్లాడుతూ.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో వేగవంతమైన వృద్ధి కనిపిస్తోందని, కానీ, రెండు సంవత్సరాలుగా మహమ్మారి కారణంగా ప్రతి ఒక్కరికీ సవాలుగా మారిందన్నారు. ఇప్పుడేమో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా సరఫరా చైన్‌పై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. దీంతో ముడిపదార్థాల సరఫరాపై తీవ్ర ప్రభావం పడి వారి ఖర్చులు కూడా గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం స్టీల్, అల్యూమినియం, రాగి, పీవీసీ పైపుల ధరలు పెరిగాయన్నారు. దీంతో డెవలపర్లపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. అలాగే పెరిగిన డీజిల్ ధరలు కూడా ముడి సరుకుల రవాణా వ్యయాన్ని పెంచినట్లు చెప్పారు. పెరుగుతున్న వ్యయాలను డెవలపర్లు భరించే స్థితిలో లేరన్నారు. ప్రస్తుతం ముడి పదార్ధాల ధరల కొద్దిగా తగ్గే వరకు వేచి చూడడం లేదా ప్రాజెక్ట్‌లను కొనసాగించి పెరిగిన ధరలకనుగుణంగా వినియోగదారులపై భారం మోపడం మాత్రమే చేయాల్సి ఉందన్నారు. ఈ రెండు పరిస్థితులతో ప్రాపర్టీల ధరలను 10–15% పెంచవచ్చునన్నారు. తెలంగాణా బిల్డర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు సి.ప్రభాకర్ రావు మాట్లాడుతూ ''మహమ్మారి కారణంగా రియల్ ఎస్టేట్ రంగం భారీ ఒడిదుడుకులు ఎదుర్కొంటే, ఇప్పుడు యుద్ధ వాతావరణం కారణంగా ధరలు తీవ్ర ప్రభావితమయ్యాయన్నారు. వినియోగదారులపై అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం అధికంగానే ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ రేట్లు తగ్గించడం ద్వారా బిల్డర్లకు ఉపశమనం అందించాలన్నారు. అలాగే ఇన్‌పుట్ క్రెడిట్స్ అందించడం, స్టాంప్ డ్యూటీ తగ్గించడం ద్వారా వినియోగదారులకు ఊరట కలుగుతుందన్నారు.
నిర్మాణాలు ఆపేశారు
అనిశ్చితి పరిస్థితుల్లో కొందరు బిల్డర్లు తమ ప్రాజెక్టుల వద్ద నిర్మాణాలను ఆపేశారని క్రెడాయ్ తెలంగాణా ఛైర్మన్ సీహెచ్ రామచంద్రారెడ్డి అన్నారు. ముడి పదార్థాల ధరలు తగ్గిన తర్వాతే ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. రియల్ ఎస్టేట్ రంగం దేశంలో రెండో అతిపెద్ద ఉపాధికల్పనదారుగా ఉందన్నారు. జీడీపీకి అతి పెద్ద తోడ్పాటు అందిస్తుందన్నారు. ఒకవేళ ప్రాజెక్టులు ఆగిపోతే అది నేరుగా ఈ రంగంపై ఆధారపడిన వ్యక్తుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులపై ఇన్‌పుట్ ట్యాక్స్ తగ్గించడంతో పాటుగా జీఎస్‌టీని సరళీకృతం చేయాలని, నిర్మాణ రంగ ముడి పదార్థాల ప్రస్తుత ధరలను హేతుబద్దీకరించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. క్రెడాయ్ తెలంగాణా అధ్యక్షులు డి మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మహమ్మారి కారణంగా మాత్రమే కాకుండా యుద్ధం వల్ల రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా ప్రభావితమైందన్నారు. స్టాంప్‌డ్యూటీ పెంచాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో పాటుగా ఆస్తుల ధరలను సవరించాలనే నిర్ణయం కారణంగా డిమాండ్ పై తీవ్ర ప్రభావం పడిందన్నారు. మార్కెట్ డిమాండ్ పరంగా భారీగా ప్రభావం పడటంతో పాటుగా రియల్ ఎస్టేట్ రంగాన్ని తీవ్ర ఇబ్బందులలోకి నెట్టేసిందన్నారు. సమావేశంలో క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు మురళీ కృష్ణారెడ్డి, ట్రెడా అధ్యక్షుడు సునీల్ చంద్రారెడ్డి, తెలంగాణా బిల్డర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు సి.ప్రభాకర్ రావు, అధ్యక్షులు, తెలంగాణా డెవలపర్స్ అధ్యక్షుడు బీవీ రావులతో పాటు రియల్ ఎస్టేట్ రంగ ప్రతినిధులు పాల్గొన్నారు.