డ్రగ్స్ ​దోషి ప్రభుత్వమే.. సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్​రెడ్డి

by Vinod kumar |
డ్రగ్స్ ​దోషి ప్రభుత్వమే.. సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్​రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: గోవా నుంచి హైదరాబాద్​కు డ్రగ్​ కారిడార్​ ఏర్పాటైందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ భూతంతో మరణం సంభవించడం ఆందోళన కలిగిస్తోందని, జాతీయ స్థాయి సిట్ ఏర్పాటు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.


డ్రగ్​ అంశంపై సీఎం కేసీఆర్​కు.. రేవంత్​రెడ్డి శుక్రవారం సుదీర్ఘమైన లేఖ రాశారు. తాజాగా హైదరాబాద్‌లో తొలి డ్రగ్స్ బాధిత మరణం ఒక్కసారిగా నగరం ఉలిక్కిపడేలా చేసిందని, మూడేళ్లుగా డ్రగ్స్‌కు బానిస అయిన 23 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి ఆ డ్రగ్స్ కారణంగానే ఆరోగ్యం క్షీణించి, చివరికి తుది శ్వాస విడవడం బాధకరమని లేఖలో పేర్కొన్నారు.

ఈ ఘటన హైదరాబాద్ డ్రగ్స్‌కు కేంద్రంగా వర్ధిల్లుతోన్న పరిస్థితికి అద్దం పట్టిందని, గోవా నుండి హైదరాబాద్‌కు డ్రగ్స్ కారిడార్ ఏర్పాటు జరిగిందేమో అన్న సరికొత్త సందేహాలను రేకెత్తిస్తోందన్నారు. మొన్న కెల్విన్, నిన్న టోనీ లాంటి డ్రగ్స్ మాఫియా పెడ్లర్లు చాపకింద నీరులా హైదరాబాద్‌ను డ్రగ్స్ వినియోగ కేంద్రంగా మార్చుతున్న తీరుపై ఐదేళ్లుగా మేం మొత్తుకుంటున్నా ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.


డ్రగ్స్ భూతం ఏదో రూపంలో పడగ విప్పినప్పుడల్లా అందులో ప్రమేయం ఉన్న రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న విమర్శలు ఉన్నాయని, ఎన్ని టాస్క్ ఫోర్సులు వేసినా, ప్రత్యేక అధికారులతో పర్యవేక్షించినా డ్రగ్స్ మాఫియా అంతం కాకపోవడానికి తెర వెనుక ప్రభుత్వం చేస్తోన్న చేష్టలే కారణమని, డ్రగ్​ దోషి ప్రభుత్వమే అని భావించాల్సి వస్తుందన్నారు.

2017 లో డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ ను అరెస్టు చేసినప్పుడు ప్రభుత్వం విచారణకు సహకరించడం లేదని ఈ మధ్య ఈడీ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసే వరకు జరిగిన పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే అసలు దోషి మీ ప్రభుత్వమే అనిపిస్తోందని, కెల్విన్ అరెస్టు.. విచారణ తర్వాత ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ 11 మంది సినీ ప్రముఖులతో పాటు, మొత్తం 60 మందిని విచారించిందని, ఇంతలా ఉరుము ఉరిమి ఇంతేనా కురిసింది అన్నట్టు వారందరికీ క్లీన్ చిట్ ఇచ్చి కేసును అటకెక్కించారని, కేసైతే మూసేశారు కానీ, రాష్ట్రంలో.. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ మాఫియా ఊడల మర్రిలాగా విస్తరిస్తూనే ఉందన్నారు.

ఈ విచారణ తాలూకు వివరాలు, ఎఫ్ఐఆర్ కాపీలు, ఛార్జ్ షీట్లు, నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న కంప్యూటర్లు, సెల్ ఫోన్ లోని వివరాలు, ఫోన్ సర్వీస్ ప్రొవైడర్ల నుండి స్వాధీనం చేసుకున్న కాల్ రికార్డులు, డిజిటల్ రికార్డులు తమకు అప్పగిస్తే మరింత లోతుగా విచారణ జరుపుతామని ఈడీ సంసిద్ధత వ్యక్తం చేసిందని, వివరాలన్నీ ఈడీకి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కోర్టు ఉత్తర్వుల అనంతరం రాష్ట్ర ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ కు ఈడీ ఆరు సార్లు లేఖలు రాసినా స్పందించలేదని, ఈడీకి సమాచారం ఇవ్వకపోగా, విచారణకు సహకరించే పరిస్థితి కనిపించలేదన్నారు.

ఎందుకు సహకరించడం లేదు..

ప్రభుత్వం పై ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. ఎవరిని కాపాడే ఉద్ధేశ్యంతో మీరు ఈడీకి సహకరించడం లేదని, ఆధారాలు ఇవ్వడానికి మీరు ఎందుకు జంకుతున్నారని, ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం అని హైకోర్టు వ్యాఖ్యానించిన తర్వాత కూడా కేసులో తీవ్రత మీకు ఎందుకు అర్థం కాలేదన్నారు. బెంగళూరులో నమోదైన డ్రగ్స్ కేసులో టీఆర్ఎస్​ పార్టీకి సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయని, వారిని ప్రభుత్వమే కాపాడినట్టు కథనాలు వస్తున్నాయని, అయినా ఎందుకు స్పందించడం లేదన్నారు.

అంతేకాకుండా 2017లో సినీ ప్రముఖుల విచారణ తర్వాత అప్పటి ఎక్సైజ్ కమిషనర్ అకున్ సబర్వాల్ ఆకస్మిక బదిలీ వెనుక ఏం జరిగిందని లేఖలో నిలదీశారు. హైదరాబాద్ డ్రగ్స్ ఫ్రీ సిటీ కావడం ప్రభుత్వానికి ఇష్టం లేదా అని, విద్యార్థులు, యువత మత్తులోనే మునిగి తేలాలని కోరుకుంటున్నారని, గతేడాది అక్టోబర్ లో డ్రగ్స్, గంజాయి పై సీఎం కేసీఆర్​ సమీక్ష చేసి ఆరు నెలలవుతున్నా ఎందుకు ఫలితాలు ఇవ్వడం లేదన్నారు.

హైదరాబాద్‌లో కాఫీషాపులు, బార్లు, పబ్బులు, ఆఖరుకు కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న కిళ్లీ కొట్టులు కూడా డ్రగ్స్ అమ్మే కేంద్రాలుగా మారాయని, చిత్ర పరిశ్రమ నుండి ఐటీ వరకు, కళాశాలలు, పాఠశాలల వరకు సర్వత్రా డ్రగ్స్ ఆనవాళ్లు కనిపిస్తున్నాయని రేవంత్​రెడ్డి ఆరోపించారు. 65 ఏళ్ల ఉమ్మడి పాలనలో హైదరాబాద్‌లో మొత్తం ఆరు పబ్ లకు అనుమతి ఇస్తే టీఆర్ఎస్​ అధికారంలోకి వచ్చిన ఈ ఏడేళ్లలో వాటి సంఖ్య 60 కి చేరిందని, హైదరాబాద్ శివార్లలో మూతబడ్డ పలు ఫార్మా కంపెనీలు ప్రస్తుతం డ్రగ్స్ తయారీ కేంద్రాలుగా రూపాంతరం చెందాయన్నారు.

జాతీయ స్థాయిలో సిట్ ఏర్పాటు చేయాలి..

తాజా డ్రగ్స్ బాధిత మరణం నేపథ్యంలో ఇప్పటికైనా మారాలని, తక్షణం డిజిటల్ రికార్డులన్నీ ఈడీకి అందజేయాలని డిమాండ్​ చేశారు. ఈ కేసు విచారణకు జాతీయ స్థాయిలో సిట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, డీఆర్ఐ, ఎన్సీబీ, ఈడీలతో సంయుక్తంగా సిట్ ఏర్పాటు చేయాలని, దీనికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ సీఎంగా ఆయా సంస్థల అధిపతులకు లేఖలు రాయాలని రేవంత్​రెడ్డి డిమాండ్​ చేశారు.

Advertisement

Next Story