వర్షపు నీటితో క్యాన్సర్ ముప్పు.. తేల్చిన తాజా పరిశోధనలు

by sudharani |
వర్షపు నీటితో క్యాన్సర్ ముప్పు.. తేల్చిన తాజా పరిశోధనలు
X

దిశ, ఫీచర్స్ : వందేళ్ల ముందే భవిష్యత్తును దర్శిస్తూ నీళ్లను షాపుల్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందని బుద్ధిసాగర్‌ అనే జైనమత సన్యాసి చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నిజంగానే మనమంతా 'ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్'ను కొనుక్కునే తాగుతున్నాం. ఇళ్లకు సరఫరా చేసే నల్లానీరు పరిశుభ్రంగా ఉండటం లేదనే అనుమానాలు ఇందుకు కారణం కాగా కుళాయిల్లో తరచూ మురికి నీరు రావడమనేది దేశ ప్రజలందరికీ అనుభవమే. ఇక ఇందులోని మలినాలు, కఠినత్వం, క్షారగుణం, ఖనిజాలు, లోహపదార్థాలు, కోలిఫాం, ఈకొలి సూక్ష్మజీవుల సంగతి సరేసరి. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు వర్షపు నీటిని సైతం తాగేందుకు ఉపయోగించొద్దని, అందులో 'ఫరెవర్ కెమికల్స్' ఉన్నాయంటూ కొత్త పరిశోధన వెల్లడించింది.

భూమిపై పడే ప్రతీ వర్షపు నీటిలో అసురక్షిత స్థాయిలో పర్ అండ్ పాలీ-ఫ్లోరోఅల్కైల్ పదార్థాలు (PFAS) ఉన్నాయని స్టాక్‌హోమ్ విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. అంటార్కిటికాతో సహా గ్రహం మీద చాలా ప్రదేశాల్లోని వర్షపు నీటిలో వీటిని గుర్తించగా, ఈ కెమికల్స్ పర్యావరణంలో విచ్ఛిన్నం కావు కాబట్టి వాటిని 'ఫరెవర్ కెమికల్స్'గా పిలుస్తారు. అవి నాన్-స్టిక్ లేదా స్టెయిన్ రిపెల్లెంట్ లక్షణాలను కలిగి ఉండే వీటిని ఫుడ్ ప్యాకేజింగ్, ఎలక్ట్రానిక్స్, సౌందర్య సాధనాలు, వంటసామాను వంటి గృహోపకరణాలు, పెయింట్‌‌తో సహా వందలాది రోజువారీ ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు. ఈ కొత్త పరిశోధన ఫలితంగా, కొందరు PFASపై కఠినమైన ఆంక్షలు విధించాలని పిలుపునిచ్చారు.

పరిశోధన ఇప్పటివరకు అసంపూర్తిగా ఉన్నప్పటికీ, PFAS క్యాన్సర్‌తో సహా అనేక ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలి సంవత్సరాల్లో తాగునీటిలో PFAS విస్తరిస్తుండటంతో ఈ దీర్ఘకాలిక పదార్థాల ఉనికి గురించి భయపడిపోతున్నారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో BBC పరిశోధనలో ఇంగ్లండ్‌లోని నీటి నమూనాల్లో యూరోపియన్ భద్రతా స్థాయిలను మించిన స్థాయిలో PFAS కనుగొన్న విషయం తెలిసిందే. మొత్తానికి ఈ స్టాక్ హోమ్ పరిశోధన ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నేల ఇదే విధంగా కలుషితమైందని ఆధారాలు సూచిస్తున్నాయి.

పారిశ్రామిక ప్రపంచంలో మనం తరచుగా వర్షపు నీటిని తాగకపోయినా, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు ఈ నీటిని సురక్షితమైందిగా భావిస్తారు. ఇది మన తాగునీటి వనరులకు ప్రధాన సరఫరా అని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఫరెవర్ కెమికల్స్ మూలంగా చనిపోతామని చెప్పడం లేదు కానీ ఈ పదార్థాలకు ఎక్స్‌పోజ్ కావడం వల్ల సంతానోత్పత్తి సమస్యలు, క్యాన్సర్ ముప్పు పెరగడం, పిల్లల పెరుగుదలలో ఆలస్యం వంటి ప్రమాదాలున్నాయి. ప్రస్తుతం శాస్త్రీయ అవగాహన ఆధారంగా, తాగునీటిలో PFASని సురక్షితమైన స్థాయికి తగ్గించేందుకు ఎక్కువ మొత్తంలో ఖర్చవుతుంది, ప్రధానంగా పరిశ్రమలు విషరసాయనాలను నదులు, కాలువల్లోకి వదలకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.

- ప్రొఫెసర్ ఇయాన్ కజిన్స్, స్టాక్‌హోమ్ విశ్వవిద్యాలయం

Advertisement

Next Story

Most Viewed