బజాబ్ గ్రూప్ మాజీ చైర్మన్ రాహుల్ బజాజ్ కన్నుమూత

by Disha Desk |
బజాబ్ గ్రూప్ మాజీ చైర్మన్ రాహుల్ బజాజ్ కన్నుమూత
X

న్యూఢిల్లీ: ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త, బజాజ్ గ్రూప్ మాజీ చైర్మన్ రాహుల్ బజాజ్(83) శనివారం కన్నుమూశారు. న్యూమోనియా, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన మధ్యాహ్నం మరణించినట్లు బజాజ్ గ్రూప్ ఓ ప్రకటనలో తెలిపింది. 'రాహుల్ బజాజ్ మరణించడం గురించి మీకు తీవ్ర విచారంతో తెలియజేస్తున్నాము. తన సన్నిహిత కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయన చివరి శ్వాస వదిలారు' అని ప్రకటనలో పేర్కొంది. 1938 జూన్ 10న జన్మించిన ఆయన హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. 1965లో బజాజ్ గ్రూప్‌లో చేరిన రాహుల్, మూడేళ్లకు బజాజ్ ఆటో సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. బజాజ్‌ను కార్పొరేట్ రంగంలో దిగ్గజ సంస్థగా నిలిపిన ఆయన గత ఏడాది చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అంతేకాకుండా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ)కి చైర్మన్‌గా రెండు పర్యాయాలు పనిచేశారు. ఆయనను కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. దీంతో పాటు పలు యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. 2006-10 మధ్యకాలంలో రాజ్యసభ సభ్యుడిగా రాహుల్ బజాజ్ పనిచేశారు. పురాతన వ్యాపార సంస్థల్లో ఒకటైన బజాజ్ గ్రూప్ 25 కంపెనీల కలయికగా ఉంది. వీటిలో ప్రధానంగా బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఎలక్ట్రికల్స్, బజాజ్ ఫిన్సర్వ్ వంటి సంస్థలు ఉన్నాయి. ఇందులో 36 వేలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాగా, ఆయన మృతి పట్ల కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, నారాయణ రాణే, పలువురు ఎంపీలు సంతాపం తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed