గుజరాత్ టైటాన్స్‌లోకి రహ్మానుల్లా గుర్బాజ్!

by Harish |
గుజరాత్ టైటాన్స్‌లోకి రహ్మానుల్లా గుర్బాజ్!
X

న్యూఢిల్లీ : ఐపీఎల్-15వ సీజన్ ప్రారంభానికి ముందు ఇంగ్లాండ్ క్రికెటర్ జేసన్ రాయ్ లీగ్ నుంచి తప్పుకుని గుజరాత్ టైటాన్స్‌కు షాక్ ఇచ్చిన విషయం విధితమే. వ్యక్తిగత కారణాలు చెబుతూ రాయ్ ఈ ఏడాది ఐపీఎల్‌ నుంచి తప్పుకున్నాడు. రాయ్‌ను వేలంలో గుజరాత్ టైటాన్స్ కనీస ధర రూ. 2 కోట్లకు దక్కించుకుంది. రాయ్ లీగ్ నుంచి తప్పుకోవడంతో అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు టీమ్ మేనేజ్‌మెంట్ ఇప్పటికే చర్యలు చేపట్టింది. అయితే, టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు సురేశ్ రైనాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోవడంతో అన్‌సోల్డ్ ప్లేయర్‌గా మిగిలిపోయాడు. దాంతో రాయ్ తప్పుకున్న తర్వాత సురేశ్ రైనాను గుజరాత్ టైటాన్స్ తీసుకుంటుందని వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా అప్ఘనిస్తాన్ వికెట్ కీపర్, బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్‌తో టీమ్ మేనేజ్‌మెంట్ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తున్నది.

అప్ఘనిస్తాన్ తరఫున 18 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన గుర్బాజ్ 29.5 సగటుతో 534 పరుగులు చేశాడు. ఇక, 9 వన్డేల్లో 53 సగటుతో 428 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు కూడా ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్ జట్టులో గుర్బాజ్ చేరినట్లు ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది వైరల్‌గా మారింది. అయితే , దీనిపై గుజరాత్ టైటాన్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉన్నది. మరోవైపు, 15వ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌ను టీమ్ ఇండియా ఆల్‌ రౌండర్ హార్దిక్ పాండ్యా నడిపించనుండగా.. లీగ్‌లో ఈ నెల 28న జరిగే తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనున్నది.

Advertisement

Next Story

Most Viewed