హోలీ సందర్భంగా అక్కడ పిడిగుద్దులు గుద్దుకున్నారు

by Vinod kumar |
హోలీ సందర్భంగా అక్కడ పిడిగుద్దులు గుద్దుకున్నారు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని హుంసా గ్రామంలో పిడిగుద్దులాట శుక్రవారం నిర్వహించారు. హోలీ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం హుంసా గ్రామంలో ఈ ఆట నిర్వహిస్తుంటారు. గ్రామం మధ్యలో తాడు కట్టి దానికి ఇరువైపులా గ్రామస్తులు నిలబడతారు. తాడును ఒక చేతితో పట్టుకుని మరో చేతితో ఎదుటి వ్యక్తి ముఖంపై బలంగా కొడతారు.


ఆచారంగా వస్తున్న ఈ ఆటను నిర్వహించకపోతే గ్రామానికి అరిష్టం అని వారి నమ్మకం. వివిధ ప్రాంతాల్లో వృత్తుల కోసం వెళ్లి స్థిరపడిన గ్రామస్తులు సైతం పిడుగుద్దులాటకు హాజరవుతారు. ఈ ఆటను తిలకించడానికి స్థానికులు కాకుండా జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి హాజరవుతారు. ఆటపై పోలీసు ఆంక్షలు ఉన్నప్పటికీ వాటిని దాటుకుని గ్రామస్తులు ఆటలో పాల్గొంటారు.


ఆటలో ముఖంపై గాయాలు అయినప్పటికీ గాయపడిన వారు ఎటువంటి వైద్య చికిత్సలు చేయించుకోరు. పిడిగుద్దులాట వికృతమైన క్రీడ అని దీనిని నిరోధించడానికి పోలీసులు చేస్తున్న ప్రయత్నాలకు గ్రామస్తులు సహకరించడం లేదు. కానీ పోలీసు ఆంక్షల మధ్య కేవలం 10 నిమిషాల పాటు పిడిగుద్దులాట నిర్వహించారు.

Advertisement

Next Story

Most Viewed